logo

విన్నపాలు ఆలకించి.. పరిష్కారానికి ఆదేశించి!

జనగామ కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో పలు వినతులు వెల్లువెత్తాయి. పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు సమస్యలపై ఆర్జీలు అందజేశారు.

Published : 07 Feb 2023 06:04 IST

అర్జీని పరిశీలిస్తున్న అదనపు కలెక్టర్‌ ప్రఫుల్‌దేశాయ్‌

జనగామ అర్బన్‌, న్యూస్‌టుడే: జనగామ కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో పలు వినతులు వెల్లువెత్తాయి. పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు సమస్యలపై ఆర్జీలు అందజేశారు. అధికారులకు ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా న్యాయం జరగడం లేదని కొందరు, ఆసరా గుర్తింపు కార్డులున్నా పింఛన్‌ ఇవ్వడం లేదని మరికొందరు విన్నవించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ప్రఫుల్‌దేశాయ్‌ ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. వారి సమస్యలను తెలుసుకున్నారు. వినతిపత్రాలను సంబంధితశాఖల అధికారులకు బదిలీ చేశారు. మొత్తం 50 దరఖాస్తులు రాగా భూ సమస్యలే ఎక్కువగా ఉన్నాయి.

సొమ్ము వసూళ్లను నిలిపివేయాలని..

వీరంతా తరిగొప్పుల మండలంలోని అంకుషాపూర్‌, నర్సాపూర్‌, సోలిపూర్‌, అబ్దుల్‌నాగారం, బొంతగట్టు నాగారం పంచాయతీల్లో పని చేస్తున్న సిబ్బంది. పంచాయతీ సిబ్బందిగా కొనసాగుతూ ఉపాధిహామీ పథకంలో పని చేశారు. 2021లో జరిగిన ఉపాధిహామీ సామాజిక తనిఖీలో.. వీరి నుంచి సొమ్మును రికవరీ చేయాలని అధికారులు ఆదేశించారు. అవగాహన లేక పొరపాటు చేశామని, చాలీచాలని జీతాలతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకుంటామని, సొమ్ము రికవరీని ఎత్తి వేయాలని అభ్యర్థించారు.

రేడియో కేంద్రం ఏర్పాటు చేయండి..

చైతన్యానికి మారు పేరు అయిన జనగామ జిల్లాలో ఎఫ్‌.ఎం. రేడియో స్టేషన్‌ ఏర్పాటు చేయాలని కోరుతూ జిల్లా కవులు, కళాకారుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. విద్య, వాణిజ్య, వ్యాపార, కళా, సాహిత్య రంగాల్లో బాసిల్లుతున్న ఈ జిల్లాలో రేడియో కేంద్రం ఏర్పాటు చేస్తే అన్ని వర్గాల వారికి ప్రయోజనకరంగా ఉంటుందన్నారు.

ఇల్లు మంజూరు చేయండి..

వీరిది జనగామ మండలం ఎర్రగొల్లపహాడ్‌ శివారులోని కొత్తతండా. ప్రభుత్వం మంజూరు చేసే రెండు పడకగదుల ఇల్లు మంజూరు చేయాలని అదనపు కలెక్టర్‌కు మొర పెట్టుకున్నారు. తన భర్తకు రెండు మూత్ర పిండాలు చెడిపోవడంతో ఏ పని చేయలేని స్థితిలో ఉన్నాడని, తమకు ఇద్దరు పిల్లలు ఉన్నారని, దీన స్థితిలో ఉన్న తమ కుటుంబానికి రెండు పడకగదుల ఇల్లు మంజూరు చేయాలని తేజావత్‌ దివ్య అర్జీ అందజేసింది.

ఇళ్ల నిర్మాణానికి రూ.3 లక్షలు అందించాలని..

జనగామ మండలం యశ్వంతాపూర్‌కు చెందిన నిరుపేదలు వీరు. తమకు రెండు పడకగదుల ఇళ్లు ఇవ్వాలని, సొంత స్థలాలు ఉన్న వారికి వారికి రూ.3 లక్షల చొప్పున అందజేయాలంటూ అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. తమ గ్రామంలో ఉన్న ప్రభుత్వ భూమిలో నిరుపేదలకు ఇళ్లు కట్టించి ఇవ్వాలని, ప్రభుత్వ  సంక్షేమ పథకాలను అర్హులకు అందేలా చూడాలని కోరారు.

మరికొన్ని సమస్యలు ఇవి..

* తన తండ్రి పేరిట ఉన్న ఐదెకరాల భూమికి యాసంగి రైతుబంధు సొమ్ము ఇవ్వలేదని, అధికారుల చుట్టూ తిరిగినా ఎవరూ సరైన సమాధానం ఇవ్వడం లేదంటూ బచ్చన్నపేటకు చెందిన మార్క సందీప్‌ ఫిర్యాదు చేశారు.* లింగాలఘనపురం మండలంలోని ఓ గ్రామానికి చెందిన శనిగరం కావ్య తనకు ఆసరా గుర్తింపు కార్డు వచ్చినా పింఛన్‌ ఇవ్వడం లేదని అధికారుల ముందు వాపోయారు.* జనగామ మండలం యశ్వంతాపూర్‌కు చెందిన గడ్డం సుగుణ.. వితంతు పింఛన్‌ కోసం పంచాయతీ కార్యదర్శికి ధ్రువపత్రాలు సమర్పించినా పింఛన్‌ మంజూరు కాలేదని, అధికారులు చొరవ చూపి మంజూరు చేయాలని కోరింది.* వెంకిర్యాలకు చెందిన శైలజ.. తమ వ్యవసాయ భూమికి వెళ్లే నక్షాను కొందరు ఆక్రమించుకున్నారని గతంలో ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడంతో తాజాగా మళ్లీ ప్రజావాణిని ఆశ్రయించింది.

వివిధ శాఖల వారీగా వచ్చిన దరఖాస్తులివి..

తహసీల్దార్ల పరిధిలోనివి : 26
ఏరియా ఆసుపత్రి: 3
డీఆర్డీవో : 5
ఎస్సీ కార్పొరేషన్‌ : 2
విద్యుత్తుశాఖ : 4
ఇతర : 10

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని