భద్రకాళి బండ్ జిగేలు
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా గురువారం ఉమ్మడి జిల్లాలో చెరువల పండగను వైభవంగా నిర్వహించారు. వరంగల్ జిల్లా కేంద్రంలోని భద్రకాళి బండ్‌పై ఉత్సవాలు అంబరాన్నంటాయి.
ఆట, పాటలతో సందడి
రంగంపేట, న్యూస్‌టుడే : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా గురువారం ఉమ్మడి జిల్లాలో చెరువల పండగను వైభవంగా నిర్వహించారు. వరంగల్ జిల్లా కేంద్రంలోని భద్రకాళి బండ్‌పై ఉత్సవాలు అంబరాన్నంటాయి. మహిళల బతుకమ్మ ఆట, చిన్నారుల సాంస్కృతిక నృత్యాలు, బాణాసంచా పేలుళ్లతో సందడి నెలకొంది. చెరువుల పండగ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్ హనుమకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్, మేయర్ సుధారాణితో కలిసి జ్యోతి వెలిగించి ప్రారంభించారు. హంటర్‌రోడ్ ప్రధాన రహదారి నుంచి బండ్ వరకు డప్పులు, మహిళల కోలాటంతో ర్యాలీగా వచ్చారు. చెరువు గట్టున తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలను పూజించి ఆడిపాడారు. కళాకారులు నృత్యాలు, పాటలు అబ్బుర పరిచాయి. రాత్రి ప్రజలతో కలిసి కలెక్టర్, చీఫ్‌విప్, మేయర్, ఇతర ప్రజాప్రతినిధులు సహపంక్తి భోజనాలు చేశారు. చీఫ్‌విప్ వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ.. వరంగల్ నగరంలో భద్రకాళి బండ్‌ను సర్వంగా సుందరంగా తీర్చిదిద్దామని, రెండో విడత సుందరీకరణ పనులు కూడా కొనసాగుతున్నాయన్నారు. రానున్న రోజుల్లో ఓరుగల్లు నగరం పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. మేయర్ సుధారాణి మాట్లాడుతూ తొమ్మిదేళ్లలో నగరం శరవేగంగా అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందన్నారు. గ్రేటర్ వరంగల్ పరిధిలో ఉన్న చెరువులు, కుంటలను కాపాడుకుంటామన్నారు. ‘కుడా’ ఆధ్వర్యంలో భద్రకాళి బండ్ వద్ద ఏర్పాటుచేసిన లేజర్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెలంగాణ రాష్ట్ర చిత్ర పటం, ఓరుగల్లు కిర్తీ తోరణాలు, ఆచార్య జయశంకర్, సీఎం కేసీఆర్ చిత్రాలు అబ్బుర పరిచాయి. కార్యక్రమంలో ‘కుడా’ ఛైర్మన్ సుందర్‌రాజ్, గ్రేటర్ వరంగల్ కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా, శిక్షణ కలెక్టర్ శ్రద్ధ శుక్లా, డీసీపీ ఎంఏ బారి, మాజీ ఛైర్మన్ యాదవరెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.