logo

గ్రంథాలయం మాది..పుస్తకం మీది!

నేటి తరం పిల్లలు పుస్తక పఠనానికి క్రమంగా దూరమవుతున్నారు. చరవాణుల వ్యామోహంలో పడి గ్రంథాలయాల గడప తొక్కనివారు ఎంతో మంది ఉన్నారు.

Updated : 29 Mar 2024 06:32 IST

సత్ఫలితాలిస్తున్న అభయ ఫౌండేషన్‌ ఆలోచన

వంగర గురుకుల పాఠశాలలో..  

‘గొప్ప పుస్తకాలలో గొప్ప వ్యక్తులు మనతో మాట్లాడతారు. అత్యంత విలువైన వారి ఆలోచనలను అందిస్తారు’ 

పుస్తక పఠనం గురించి ఓ గొప్ప సూక్తి.

నేటి తరం పిల్లలు పుస్తక పఠనానికి క్రమంగా దూరమవుతున్నారు. చరవాణుల వ్యామోహంలో పడి గ్రంథాలయాల గడప తొక్కనివారు ఎంతో మంది ఉన్నారు. ఈ క్రమంలో విద్యార్థులకు పుస్తక పఠనాన్ని అలవాటుగా మార్చేందుకు అభయ ఫౌండేషన్‌ ప్రయత్నిస్తోంది. గ్రంథాలయాలను స్థాపిస్తూ చిన్నారులు మళ్లీ పుస్తకాలకు దగ్గరయ్యే గొప్ప ప్రయత్నానికి ఉమ్మడి వరంగల్‌లోనే శ్రీకారం చుట్టింది.

ఈనాడు, వరంగల్‌, భీమదేవరపల్లి, న్యూస్‌టుడే


విద్యార్థులే తీసుకురావాలి

పుస్తకాలతో విద్యార్థిని

వంగరలో గ్రంథాలయ నిర్మాణాన్ని 20 రోజుల్లో పూర్తి చేశారు. ఫౌండేషన్‌ తరఫున రూ.8 లక్షలు విరాళం ఇవ్వగా ప్రభుత్వ గురుకుల సొసైటీ నుంచి రూ.6 లక్షల నిధులు అందాయి. విద్యార్థులకు పుస్తకాల విలువ తెలియజేయాలని వీటిల్లో వినూత్న ఆలోచన చేశారు. ప్రతి విద్యార్థి కనీసం మూడు పుస్తకాలు తెచ్చి పెట్టాలని, ప్రతి ఉపాధ్యాయుడు, ఉపాధ్యాయురాలు కనీసం పది పుస్తకాలు వితరణ చేయాలని నియమం పెట్టారు. దీంతో విద్యార్థులు  కథల పుస్తకాలు, వ్యక్తిత్వ వికాసం, మహనీయుల జీవిత చరిత్రలు, సైన్స్‌ పుస్తకాలు.. తెచ్చి గ్రంథాలయానికి ఇస్తున్నారు. వంగరలో అలా పక్షం రోజుల వ్యవధిలోనే 600 మంది విద్యార్థులు 3 వేలకుపైగా పుస్తకాలను సేకరించి తమ లైబ్రరిలో పెట్టుకొని ప్రతి రోజు ఆసక్తిగా చదువుతున్నారు.


స్వామీజీ చొరవతో

అభయ ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు బాలచంద్ర స్వామీజీ. హైదరాబాద్‌ సమీపంలోని ఇబ్రహీంపట్నంలో వీరి ఆశ్రమం ఉంది. స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అనంతపురం జిల్లా తాడిపత్రి. ఉన్నత విద్యావంతుడైన బాలచంద్రస్వామి దశాబ్దాల కిందట కంపెనీ సెక్రటరీ ఉద్యోగానికి రాజీనామా చేసి సేవాకార్యక్రమాలు చేస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తోపాటు మొత్తం ఆరు రాష్ట్రాల్లో 300 పాఠశాలలకు అవసరమైన వసతులు సమకూరుస్తున్నారు.
ఉమ్మడి వరంగల్‌లో ఇప్పటి వరకు రెండు చోట్ల గ్రంథాలయాలు ఏర్పాటుచేసేందుకు సహకారం అందించారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరలోని పీవీ రంగారావు బాలికల గురుకుల పాఠశాల, కళాశాలతోపాటు, జనగామ జిల్లా కొడకొండ్లలోని గురుకుల పాఠశాలలో ఏర్పాటుచేశారు. వర్ధన్నపేట పాఠశాల, తొర్రూరులోని వందేమాతరం ఫౌండేషన్‌ నిర్వహించే గ్రంథాలయాలకు పుస్తకాలను వితరణ చేశారు.  ఇతర జిల్లాల్లోనూ గ్రంథాలయ ఏర్పాటు జరుగుతోంది. ఎడపెల్లి, వికరాబాద్‌, లింగంపల్లి ప్రాంతాల్లోనూ భవనాలు నిర్మించి ఇచ్చారు.

జనగామ జిల్లా కొడకండ్లలోని గురుకుల పాఠశాలలో గ్రంథాలయాన్ని ప్రారంభిస్తూ..


పది పుస్తకాలు ఇచ్చా

- ప్రజ్ఞ, 7వ తరగతి, వంగర గురుకుల పాఠశాల

గ్రంథాలయం ఏర్పాటుచేశాక మేం రోజూ ఇష్టంగా చదువుతున్నాం. స్వామీజీ మాకు ఎన్నో మంచి విషయాలు చెప్పారు. గొప్ప వారి జీవిత చరిత్రలు కూడా చదువుతున్నాం. నేను గ్రంథాలయానికి పది పుస్తకాలు ఇచ్చా.


శ్రద్ధగా చదువుతున్నారు :  ఎ.సురేఖ, ప్రిన్సిపల్‌, టీఎస్‌ఆర్‌ పీవీ రంగారావు గురుకుల  బాలికల పాఠశాల, వంగర

గ్రంథాలయం ఏర్పాటుచేశాక విద్యార్థులను పుస్తకాలు తేవాలని కోరాం. అందరూ ఆసక్తి రెండు మూడు తెచ్చి పెట్టారు. మా ఉపాధ్యాయులం పదేసి చొప్పున అందజేశాం. ఈ విధానం వల్ల పిల్లలు ప్రతి రోజూ కనీసం గంట శ్రద్ధగా చదువుతున్నారు.


పుస్తకాలను ప్రేమించాలి

- బాలచంద్ర స్వామీజీ, అభయ ఫౌండేషన్‌  

ప్రతి విద్యార్థి పుస్తకాన్ని ప్రేమించాలి. మేం గ్రంథాలయాలు నిర్మిస్తే విద్యార్థులు పుస్తకాలు తీసుకురావాలని చెబుతున్నాం. మంచి ఫలితాలు వస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని