logo

‘దేవుళ్లపై ఒట్లు వేస్తే ఓట్లు రాలవు’

ప్రజల్లో విశ్వాసం కోల్పోయిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో ఎక్కడికి వెళితే అక్కడ స్థానిక దేవుళ్ల మీద ఒట్టేసి ఓట్లు అభ్యర్థిస్తున్నారని, కానీ ఈసారి ఓట్లు రాలవని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతిరాథోడ్‌ అన్నారు.

Published : 10 May 2024 02:08 IST

ప్రసంగిస్తున్న సత్యవతిరాథోడ్‌, చిత్రంలో ఎంపీ మాలోత్‌ కవిత

డోర్నకల్‌, న్యూస్‌టుడే: ప్రజల్లో విశ్వాసం కోల్పోయిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో ఎక్కడికి వెళితే అక్కడ స్థానిక దేవుళ్ల మీద ఒట్టేసి ఓట్లు అభ్యర్థిస్తున్నారని, కానీ ఈసారి ఓట్లు రాలవని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతిరాథోడ్‌ అన్నారు. డోర్నకల్‌లో గురువారం నిర్వహించిన రోడ్‌షోకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. శాసనసభ ఎన్నికలకు ముందు మాయమాటలు చెప్పిన కాంగ్రెస్‌ ఇప్పుడు రూ.2 లక్షల రుణమాఫీని ఆగస్టులో ఇస్తానంటే నమ్ముదామా? అని ప్రశ్నించారు. బలరాంనాయక్‌, సీతారాంనాయక్‌ల కోసం ములుగు వెళ్లాలని, కానీ రెడ్యానాయక్‌, సత్యవతిరాథోడ్‌, కవిత ముగ్గురు ఇక్కడే ఉంటారని చెప్పారు. మేము ఇక్కడే పుట్టిపెరిగినోళ్లం.. ఓట్లు అడిగే హక్కు మాకే ఉందని ధీమా వ్యక్తం చేశారు. మహబూబాబాద్‌కు సీఎం వస్తే జనం లేక గంటన్నర సేపు బస్సులో నిరీక్షించారని, కేసీఆర్‌ వస్తే మానుకోట జనంతో దద్దరిల్లిందని చెప్పారు.

సిటింగ్‌ ఎంపీ, భారాస అభ్యర్థి మాలోత్‌ కవిత మాట్లాడుతూ... కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలపై నిప్పులు చెరిగారు. ఒకరు దేవుళ్లను నమ్ముకుని, మరొకరు దేవుళ్లపై ఒట్లు వేసి ఎన్నికల బరిలో తలపడుతున్నారని విమర్శించారు. భారాస మాత్రం అన్నదాతలు, పింఛన్‌దారులు, మహిళలు, యువత ఓట్లను నమ్ముకుందని తెలిపారు. కార్యక్రమంలో డోర్నకల్‌ ఎన్నికల ఇన్‌ఛార్జి కుడితి మహేందర్‌రెడ్డి, ఏఎంసీ మాజీ ఛైర్మన్‌ విద్యాసాగర్‌, ఎంపీపీ బాలునాయక్‌, నాయకులు మన్యుపాటీ, చంటీ, యశోధర్‌ జైన్‌, కొత్త వీరన్న, గణేష్‌ ఠాగూర్‌, గౌస్‌, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రోడ్‌షో సాగిందిలా...

డోర్నకల్‌: డోర్నకల్‌లోని ఎన్టీఆర్‌ సర్కిల్‌ నుంచి రైల్వే కూడలి వరకు భారాస నాయకులు గురువారం రోడ్‌షో చేపట్టారు. అభ్యర్ధి మాలోతు కవిత దారి పొడవునా ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు. కవితకు మద్దతుగా మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతిరాథోడ్‌ హాజరై ప్రసంగించారు. ఊహించని స్పందన లభించిందని భారాస శ్రేణులు తెలిపాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని