logo

ఎంతో కీలకం.. అయినా నిర్లక్ష్యం

మన్యం ప్రాంతంలోని గిరిజనుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు నెలకొల్పిన కేఆర్‌పురం ఐటీడీఏలో పాలకవర్గ సమావేశం నిర్వహణ మరుగునపడింది. సంక్షేమ పథకాల అమలు తీరుపై సమీక్ష, సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలు, వార్షిక బడ్జెట్‌ రాబడులు, వ్యయాల సమీక్షకు ఇది ఎంతో కీలకం. అయినా నిర్వహణ గురించి పట్టించుకునే వారు కరవయ్యారు.

Published : 27 Jun 2022 05:31 IST

ఆరేళ్లుగా నిర్వహించని ఐటీడీఏ పాలకవర్గ సమావేశం

నిరుపయోగంగా యువత శిక్షణ ¸కేంద్రం
 

బుట్టాయగూడెం, న్యూస్‌టుడే: మన్యం ప్రాంతంలోని గిరిజనుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు నెలకొల్పిన కేఆర్‌పురం ఐటీడీఏలో పాలకవర్గ సమావేశం నిర్వహణ మరుగునపడింది. సంక్షేమ పథకాల అమలు తీరుపై సమీక్ష, సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలు, వార్షిక బడ్జెట్‌ రాబడులు, వ్యయాల సమీక్షకు ఇది ఎంతో కీలకం. అయినా నిర్వహణ గురించి పట్టించుకునే వారు కరవయ్యారు. ఈ సమావేశం ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్వహించాల్సి ఉంది. దాదాపు ఆరేళ్లుగా నిర్వహణకు నోచుకోవడం లేదు. 2016 ఏప్రిల్‌లో చివరి సమావేశం జరిగింది. అప్పటినుంచి పథకాల అమలు తీరుపై అధికారులు మొక్కుబడి సమీక్షలతో సరిపుచ్చుతున్నారు. ఐటీడీఏకు వివిధ పథకాల ద్వారా ఏటా సుమారు రూ.20 కోట్ల వరకు విడుదలవుతాయి. వాటి కేటాయింపులు, వ్యయం, మిగులుపై సమీక్షలు, చర్చలు, ఆమోదాలు కొరవడ్డాయి. కేవలం అధికారుల నివేదికలకే పరిమితమయ్యాయని పలువురు ఆరోపిస్తున్నారు.


ఎక్కడి సమస్యలు అక్కడే.. ఐటీడీఏలో ప్రాజెక్టు వ్యవసాయాధికారి ఉద్యోగం నాలుగున్నరేళ్లు, ఉప వైద్య, ఆరోగ్య శాఖాధికారి పోస్టు ఏడున్నరేళ్లు, ఉప విద్యా శాఖాధికారి స్థానాలు ఐదున్నరేళ్లుగా భర్తీకి నోచుకోవడం లేదు.  గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌ల భవన నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. ఐటీడీఏ ఎదుట గిరిజన గురుకుల బాలుర పాఠశాల ఆవరణలో చేపట్టిన క్రీడా వికాస కేంద్రం భవన నిర్మాణం అసంపూర్తిగా ఉంది. నిరుద్యోగ యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ కోసం ఉద్దేశించిన గిరిజన యువత శిక్షణ ¸
కేంద్రం నిరుపయోగంగా మారింది. శిక్షణ కోసం రూపొందించిన ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయి. మారుమూల చింతకొండ, గొట్టాలరేవు, రేగులపాడు, రేపల్లి, ఉర్రింక, రెడ్డిబొడ్డేరు, తంగేడుకొండ, ఉర్రింక, గెడ్డపల్లి, గిన్నేపల్లి, తానిగూడెం, మోదెల, వీరన్నపాలెం గ్రామాల రహదారులు అధ్వానంగా ఉన్నాయి. దీంతో రవాణా సదుపాయాలు లేక కొండరెడ్డి తెగ గిరిజనులు అవస్థలు పడుతున్నారు. ‘కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లి ఆయన నిర్ణయం తీసుకున్న తరువాత త్వరలో పాలకవర్గం సమావేశం నిర్వహించేందుకు కృషి చేస్తాం’ అని ప్రాజెక్టు అధికారి సూర్యనారాయణరెడ్డి తెలిపారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని