logo

కూరగాయల కోసం వచ్చి తిరిగిరాని లోకాలకు

కూరగాయల కోసం రోడ్డు మీదకు వచ్చిన మహిళను రహదారి ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. ఇంటి నుంచి వెళ్లిన పది నిమిషాల్లోనే ఈ దుర్ఘటన జరగడం కుటుంబ సభ్యులను స్థానికులను కలచివేసింది. నరసాపురం ఎస్సై కె.సుధాకరరెడ్డి, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.

Published : 05 Oct 2022 06:07 IST

రహదారి ప్రమాదంలో మహిళ మృతి

అమీనా (పాత చిత్రం)

నరసాపురం, నరసాపురం గ్రామీణ, న్యూస్‌టుడే: కూరగాయల కోసం రోడ్డు మీదకు వచ్చిన మహిళను రహదారి ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. ఇంటి నుంచి వెళ్లిన పది నిమిషాల్లోనే ఈ దుర్ఘటన జరగడం కుటుంబ సభ్యులను స్థానికులను కలచివేసింది. నరసాపురం ఎస్సై కె.సుధాకరరెడ్డి, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం... నరసాపురం పట్టణంలోని కొత్త కాలనీకి చెందిన చదలవాడ అమీనా(44) కూరగాయలు కొనుగోలు చేసేందుకు మంగళవారం ఉదయం 8 గంటల సమయంలో ద్విచక్ర వాహనంపై బయటకు వచ్చారు. 216 జాతీయ రహదారిపై పెద్ద చర్చి సమీపంలోని మార్కెట్‌ నుంచి ఇంటికి తిరిగి వెళ్తుండగా ఆయిల్‌ ట్యాంకర్‌ వచ్చి బలంగా ఢీకొనడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందింది. ఆమెకు దివ్య, నవ్య, దీనా గ్రేస్‌ అనే ముగ్గురు కుమార్తెలున్నారు. భర్త మోజేస్‌ ఒడిశాలో అల్యూమినియం ఫ్యాక్టరీలో పని చేస్తున్నారు. పెద్ద కుమార్తె దివ్యకు వివాహం కాగా రెండో కుమార్తె నవ్య పదిహేను రోజుల కిందట జీవనోపాధి కోసం దుబాయ్‌ వెళ్లింది. మూడో కుమార్తె దీనా గ్రేస్‌ పట్టణంలోని సికిలే పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. ముగ్గురు కుమార్తెల బాధ్యతలను చూసుకుంటూనే అమీనా స్థానికంగా అనాథాశ్రమం నిర్వహిస్తున్నారు. అందరితో ఎంతో కలివిడిగా ఉండే తల్లి రహదారి ప్రమాదంలో మృత్యువాత పడిందన్న సమాచారంతో అమీనా పిల్లలు హతాశులయ్యారు. ఘటనా స్థలంలో తల్లి మృతదేహన్ని చూసి తల్లడిల్లిపోయారు. ఒడిశాలో ఉన్న నాన్నకు, దుబాయ్‌లో ఉన్న చెల్లికి ఏమని చెప్పనమ్మా అంటూ రోదించిన తీరు చూపరులను కలచి వేసింది. కుమార్తె పసుపులేటి దివ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని