logo

పశ్చిమ తీరంలో విశ్వనాథ కిరణాలు

కళాతపస్వి కె.విశ్వనాథ్‌ సినిమాల్లో తారల కంటే కథే బలంగా కనిపిస్తుంది. ఆయన సినిమా పేరు కూడా దైనందిన జీవితాలతో ముడిపడినట్టే వినిపిస్తుంది.

Published : 04 Feb 2023 05:05 IST

ఉమ్మడి జిల్లాలో కళాతపస్వి జ్ఞాపకాలు

పంచారామక్షేత్రం సోమేశ్వరుని సన్నిధిలో  ..

పాలకొల్లు, పోలవరం, న్యూస్‌టుడే: కళాతపస్వి కె.విశ్వనాథ్‌ సినిమాల్లో తారల కంటే కథే బలంగా కనిపిస్తుంది. ఆయన సినిమా పేరు కూడా దైనందిన జీవితాలతో ముడిపడినట్టే వినిపిస్తుంది. సాగర సంగమం, సిరివెన్నెల, శృతిలయలు, స్వాతి కిరణం, స్వాతిముత్యం, శుభ సంకల్పం, సూత్రధారులు, సిరిసిరిమువ్వ ఇలా చెబుతూ పోతే ప్రతి చిత్రం పేరు ప్రజలకు పరిచయమున్నదే. అంతటి ప్రఖ్యాత దర్శకుడు విశ్వనాథుడు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో అనేక సందర్భాల్లో పర్యటించారు. సహజసిద్ధమైన ప్రదేశాలకు ప్రాధాన్యమిచ్చే ఆయన సన్నివేశాలకు, పాటల చిత్రీకరణకు అనుకూలంగా ఉండే జిల్లాలోని గోదావరి తీర ప్రాంతాన్ని ఎక్కువగా ఎంచుకునేవారు. అదే కోవలో పోలవరం ప్రాంతంలో సిరిసిరి మువ్వ అప్పట్లో గజ్జెగట్టి ఝుమ్మందినాదం అంటూ పల్లవించింది. సూత్రధారులను గోదావరి ప్రాంతానికి తీసుకొచ్చింది. ఆపద్బాంధవుడు అడుగులు పడేలా చేసింది. జిల్లాలోని ప్రకృతి అందాలను వెండితెరపై వెలిగిస్తూ కలుసుందాం రా అంటూ తెలుగు తెర ఆహ్వానించేలా చేసిన దర్శకుల్లో కళా తపస్విని ఎల్లవేళలా జిల్లా గుర్తుపెట్టుకునేలా చేసింది. కె.విశ్వనాథ్‌ను 1989 మే 28న లలిత కళాంజలి నాటక అకాడమి ఆధ్వర్యంలో దివంగత దర్శకుడు కోడి రామకృష్ణ చేతుల మీదుగా పాలకొల్లులో ఘనంగా సత్కరించారు. ఆయన మీద ఒక సావనీర్‌ కూడా అప్పట్లో విడుదల చేసినట్లు ప్రముఖ కళాకారుడు మానాపురం సత్యనారాయణ గుర్తు చేసుకున్నారు.


అభిమానులతో మమేకమై..

భీమవరం సాంస్కృతికం, న్యూస్‌టుడే: భీమవరంలో చైతన్య భారతి సంగీత, నృత్య, నాటక పరిషత్తు వార్షికోత్సవాల సందర్భంగా 2011లో దర్శకుడు కె.విశ్వనాథ్‌ను ఆ సంస్థ నిర్వాహకులు ‘చైతన్య భారతి జీవన సాఫల్య’ పురస్కారం ప్రదానం చేసి సత్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ముఖాముఖిలో ఆయన ప్రేక్షకులు, అభిమానులతో మమేకమై వారితో ముచ్చటించారు. మానవ సంబంధాలు, మన సంస్కృతి, సంప్రదాయాల విశిష్టతను తెలియజెప్పే చిత్రాలను తీయాలన్నదే తన తపన అన్నారు. మనమంతా ‘అమ్మా.. నాన్న’ అని సిగ్గుపడకుండా పిలిచినంతకాలం తెలుగు సాహిత్యం అజరామంగా నిలిచి ఉంటుందన్నారు.
మొగల్తూరు, న్యూస్‌టుడే: తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలకు తీసుకువెళ్లిన ఘనత కళా తపస్వి కె.విశ్వనాథ్‌కే దక్కుతుందని, ఈ పరిశ్రమకు ఆయన లేని లోటు తీరనిదని నరసాపురానికి చెందిన సినీ దర్శకుడు దవళ సత్యం అన్నారు. శుక్రవారం ఆయన ‘న్యూస్‌టుడే’తో మాట్లాడారు.


కళాశిఖరానికి ఆత్మీయ సత్కారం

బాపు పేరిట ఇచ్చిన అవార్డు అందుకుంటున్న విశ్వనాథ్‌

నరసాపురం, న్యూస్‌టుడే:  కళాతపస్వి విశ్వనాథ్‌కు నరసాపురంతో అనుబంధం ఉంది. అక్కినేని నాగేశ్వరరావు, జమున కథానాయకా, నాయికలుగా తెరకెక్కించిన ‘మూగమనసులు’ సినిమాలోని కొన్ని సన్నివేశాలను నరసాపురంలో 1963లో చిత్రీకరించారు. ఆ సినిమాకు సెకండ్‌ యూనిట్‌ డైరెక్టర్‌గా విశ్వనాథ్‌ పనిచేశారు. ‘మూగమనసులు’ను హిందీ అనువాదంలో రూపొందించిన ‘మిలన్‌’కు కొన్ని సన్నివేశాలను ఇక్కడే చిత్రీకరించారు. స్థానిక వైఎన్‌ కళాశాలలో విశ్వనాథ్‌ను సన్మానించారని నరసాపురానికి చెందిన రెడ్డప్ప ధవేజీ తెలిపారు.నరసాపురం గోదావరి తీరంలో బాపు విగ్రహావిష్కరణ సందర్భంగా 2017లో బాపు జయంతి రోజున ఆయన పేరిట అవార్డులు ప్రదానం చేశారు. అప్పటి మంత్రి పితాని సత్యనారాయణ, అప్పటి ఎమ్మెల్యే బండారు మాధవనాయుడుల చేతులమీదుగా కె.విశ్వనాథ్‌కు బాపు స్మారక మొదటి అవార్డు అందించి ఆత్మీయ సత్కారం చేశారు.


కొత్త జీవితాన్ని ప్రసాదించారు

ఏలూరు గ్రామీణ, న్యూస్‌టుడే: కళాతపస్వి కె.విశ్వనాథ్‌ తనకు కొత్త జీవితం ప్రసాదించారని ప్రముఖ నృత్యకారుడు ఏలూరుకు చెందిన కె.వి.సత్యనారాయణ అన్నారు. ‘1986లో ఆయన దర్శకత్వం వహించిన శృతిలయలు చిత్రానికి నృత్య దర్శకునిగా పని చేశా. నృత్య దర్శకునిగా నంది అవార్డు రావడంతో నా జీవితం మలుపు తిరిగింది. తర్వాత స్వర్ణకమలం, సూత్రధారులు, స్వాతికిరణం చిత్రాలకు నృత్య దర్శకునిగా పనిచేశా. నా ఆహ్వానాన్ని మన్నించి అప్పట్లో ఏలూరులోని హిందూ యువజన సంఘం నిర్వహించిన కార్యక్రమానికి విశ్వనాథ్‌ వచ్చారు’ అని ఆయన గుర్తు చేసుకున్నారు.

చించినాడలో  అల్లరి రాముడు షూటింగ్‌ సమయంలో ..


హేలాపురిలో అడుగు జాడలు

ఏలూరు అర్బన్‌, న్యూస్‌టుడే: సమాజంలో చైతన్యం కలిగించేలా పలు సందేశాత్మక చిత్రాలను అందించిన కళాతపస్వి కె.విశ్వనాథ్‌కు హేలాపురితో అనుబంధం ఉంది. ఆంధ్రప్రదేశ్‌ బ్రాహ్మణ కో-ఆపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీ ఛైర్మన్‌గా నగరానికి చెందిన ఎంబీఎస్‌ శర్మ పనిచేశారు. ఆయన ఆహ్వానం మేరకు విశ్వనాథ్‌ అప్పట్లో ఏలూరు వచ్చి బ్రాహ్మణులకు పలు రకాల ఉపకరణాలు అందజేశారు. ఐదు దశాబ్దాల సినీ ప్రస్థానంలో విశ్వనాథ్‌ తీసిన సినిమాలు ఎన్నటికీ సజీవంగానే ఉంటాయని శర్మ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని