logo

చెలరేగుతున్న మందుల మాఫియా

ఆక్వాసాగులో నిషేధిత యాంటీబయోటిక్స్‌ విక్రయాలు, వినియోగం ఉమ్మడి పశ్చిమలో జోరుగా సాగుతున్నాయి. ఇతర రాష్ట్రాలు, జిల్లాల్లో నుంచి దిగుమతి చేసుకుని యథేచ్ఛగా విక్రయిస్తున్నారు.

Updated : 23 Mar 2023 06:03 IST

చెరువుల్లో విచ్చలవిడిగా యాంటీబయోటిక్స్‌ వినియోగం
లైసెన్సు లేని దుకాణాలకు సరఫరా
హైదరాబాద్‌, నెల్లూరు నుంచి దిగుమతి  

ఆక్వాసాగులో నిషేధిత యాంటీ¨బయోటిక్స్‌ విక్రయాలు, వినియోగం ఉమ్మడి పశ్చిమలో జోరుగా సాగుతున్నాయి. ఇతర రాష్ట్రాలు, జిల్లాల్లో నుంచి దిగుమతి చేసుకుని యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. ఏడాదికి రూ.వందల కోట్ల వ్యాపారం చేస్తున్నారు. అధికారులు పర్యవేక్షణ, తనిఖీలు పూర్తిగా గాలికొదిలేయటంతో ప్రజారోగ్యం ప్రమాదంలో పడుతోంది. ఇటీవల ఔషధ నియంత్రణ అధికారులు చేసిన తనిఖీల్లో ఈ వ్యవహారం వెలుగు చూసింది. 

తణుకులో ఆక్వారైతులకు విక్రయిస్తున్న యాంటీబయోటిక్స్‌ నిల్వలను స్వాధీనం చేసుకున్న ఔషధ నియంత్రణ అధికారులు

ఈనాడు డిజిటల్‌, ఏలూరు: తణుకులో శ్రీలక్ష్మి ఆక్వా ఫీడ్స్‌ అండ్‌ నీడ్స్‌ దుకాణంలో ఔషధ నియంత్రణాధికారులు అబీద్‌అలీ షేక్‌, పి.మల్లికార్జునరావు ఆధ్వర్యంలో మంగళవారం తనిఖీలు జరిగాయి. దుకాణదారుకి అనుమతులు కూడా లేవు. కానీ మనుషులు, జంతువులకు వినియోగించే యాంటీబయోటిక్స్‌కి సంబంధించిన ముడి సరకు పౌడరు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ముడి పదార్థాలను పొడి రూపంలో అమ్మడం నిబంధనలకు విరుద్ధమే కాదు..నేరం కూడా. ఉమ్మడి పశ్చిమలో ఆక్వాసాగు ఎక్కువగా ఉన్న భీమవరం, గణపవరం, తణుకు, నరసాపురం, పాలకొల్లు, కైకలూరు, ఆకివీడు, ఏలూరు గ్రామీణ తదితర ప్రాంతాల్లో పౌడరు విక్రయ ఏజెన్సీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. ఈ ఏజెన్సీలు లైసెన్స్‌లేని దుకాణాలకు కూడా మందులు సరఫరా చేస్తున్నాయి. హైదరాబాద్‌, నెల్లూరు తదితర ప్రాంతాల్లోని మందుల తయారీ కంపెనీల నుంచి పొడిని అక్రమంగా దిగుమతి  చేసుకుంటున్నారు.

ఎగుమతులకు గండి

ఏలూరు, పశ్చిమ.. రెండు జిల్లాల్లో రెండు లక్షలకుపైగా ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతోంది. ఇక్కడ నుంచి ఏడాదికి సుమారు రూ.30 వేల కోట్ల వరకూ వ్యాపారం సాగుతోంది. గతంలో 80 శాతం ఉత్పత్తులు అమెరికా, యూరప్‌ దేశాలకు ఎగుమతయ్యేవి. ఇక్కడి ఆక్వా ఉత్పత్తుల్లో విచ్చలివిడిగా యాంటీబయోటిక్స్‌ వినియోగిస్తున్నారని యూరప్‌ మార్కెట్‌ వర్గాలు గుర్తించాయి. పరీక్షల ద్వారా అవశేషాలున్నట్లు నిర్థారించుకున్నారు. అప్పటి నుంచి యూరప్‌ మార్కెట్‌ మన ఉత్పత్తుల దిగుమతిని చాలా వరకూ తగ్గించింది. దీని ప్రభావంతో రూ.కోట్లలో ఆదాయానికి గండిపడుతోంది. ఆయా దేశాల్లో ప్రజారోగ్యంపై ప్రభుత్వాలు అంత శ్రద్ధ తీసుకుంటుంటే జిల్లా అధికారులు కనీస చర్యలు తీసుకోవటం లేదు.  

మేతతోనే మాయ చేస్తున్నారు

జంతువులు, పశువులకు వచ్చే వ్యాధులకు వినియోగించే కొన్ని యాంటీబయోటిక్స్‌.. చేపలు, రొయ్యల సాగులో వినియోగం నిషేధం. కాని కొన్ని ఆక్వా ఫీడ్‌ దుకాణాల్లో వీటి అమ్మకాలు సాగుతున్నాయి. రొయ్యలు, చేపల మేతలోనే ముడిపదార్థాలు కలిపి విక్రయిస్తున్నారు. దీంతో ఎవరికీ అనుమానం రావటం లేదు. జిల్లాలో కొన్ని వెటర్నరీ మందుల ఏజెన్సీలు భారీమొత్తంలో కొనుగోలు చేసి ఆక్వా రైతులకు సరఫరా చేస్తున్నాయి.


ఎంపెడా   ఏదీ జాడ  

ఆక్వా ఉత్పత్తుల విషయంలో విచ్చలవిడిగా యాంటీబయోటిక్స్‌ వినియోగిస్తున్నారన్నది బహిరంగ రహస్యమే. ఎంపెడా(మెరైన్‌ ఎక్స్‌పోర్ట్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ) అధికారులు మాత్రం కనీస చర్యలు తీసుకోవటం లేదు. ఉత్పత్తులను తనిఖీ చేయటం, రసాయనాల వినియోగం తగ్గించే మార్గాలపై దృష్టి సారించడం గాలికొదిలేశారు. ఈ విషయంలో జిల్లా మత్స్యశాఖ అధికారులు కూడా చేతులెత్తేశారు. చెరువుల దగ్గరకు వెళ్లి ఉత్పత్తుల నమూనాలు సేకరించి, పరీక్షించాలి. యాంటీబయోటిక్స్‌ అవశేషాలు ఉంటే వారిపై చర్యలు తీసుకోవాలి. ఇవేవీ జరగటం లేదు. ఈ విషయంపై మత్స్యశాఖ జేడీఏని వివరణ కోరగా ‘నిబంధనలకు విరుద్ధంగా యాంటీబయోటిక్స్‌ విక్రయాలు జరుగుతున్న విషయం నా దృష్టికి వచ్చింది. ఎంపెడా, మత్స్యశాఖ, ఔషధనియంత్రణ శాఖలతో బృందాలను ఏర్పాటు చేసి తనిఖీ చేస్తాం’ అని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు