logo

చెప్పడాల్లేవ్‌.. ఆపేయడమే

గత కొన్ని రోజులుగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పలు ప్రాంతాల్లో విధిస్తున్న అప్రకటిత విద్యుత్తు కోతలతో అటు ప్రజలు..ఇటు చిరు వ్యాపారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

Updated : 01 Jun 2023 05:27 IST

 సరఫరాలో తరచూ అంతరాయంతో అల్లాడుతున్న జనం
 చిరువ్యాపారుల జీవనోపాధికి ఆటంకం
 అసలు కరెంటు కోతలే లేవంటున్న అధికారులు

ఈనాడు డిజిటల్‌, ఏలూరు, న్యూస్‌టుడే- ఆకివీడు, జంగారెడ్డిగూడెం పట్టణం, ఉండ ఎప్పుడు పోతుందో తెలియదు..  ఎప్పుడు వస్తుందో స్పష్టత లేదు..ఎంత సేపు ఉంటుందో అర్థం కాదు.  విద్యుత్తు  కోతలపై ఉమ్మడి జిలాల్లో  ప్రజల ఆవేదన ఇది. కనీస సమాచారం లేని కోతలతో జనం అల్లాడుతుండగా.. చిరువ్యాపారుల
రోజువారీ ఆదాయంపై ప్రభావం కనిపిస్తోంది.

గత కొన్ని రోజులుగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పలు ప్రాంతాల్లో విధిస్తున్న అప్రకటిత విద్యుత్తు కోతలతో అటు ప్రజలు..ఇటు చిరు వ్యాపారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పిల్లలు, వృద్ధులు, గర్భిణుల వేదన వర్ణనాతీతం. పగలంతా ఎండలు ఉక్కపోతతో బాధపడాల్సి వస్తోంది. పట్టణాలు, నగరాల్లో ఇళ్లు ఇరుకుగా ఉండటం బయట గాలి కూడా లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు సహజంగానే పట్టణాల్లో దోమల బెడద ఎక్కువ. తాజా కోతలతో అవి విజృంభిస్తున్నాయి. మరో వైపు జ్యూస్‌, పాలు, పెరుగు శీతలపానీయాలు, ఐస్‌క్రీం తదితర చిరు వ్యాపారులకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. విద్యుత్తు అంతరాయంతో వ్యాపారం పడిపోతోంది. పాలు, పెరుగు, ఐస్‌క్రీం ఎందుకూ కొరగాకుండా పోతున్నాయి. విద్యుత్తు  ఆధారిత చేతివృత్తులు చేసేవారికి నష్టం జరుగుతోంది.  

సాంకేతిక కారణాలట!

విద్యుత్తు కోతలతో ప్రజలు అల్లాడుతుంటే అధికారులు విద్యుత్తు కోతలే లేవని చెప్పటం గమనార్హం. అవి కోతలు కాదు కేవలం సాంకేతిక లోపాలు, వాతావరణ సమస్యలు, ఈదురుగాలుల వల్లే సరఫరా నిలుస్తోందని చెబుతున్నారు. ప్రతి ఉపకేంద్రం పరిధిలో స్థానిక పరిస్థితులు, లోడ్‌ రిలీఫ్‌ కోసం చేసే విద్యుత్తు సరఫరా నిలిపివేతను నమోదు చేయాల్సి ఉన్నా ఈ ప్రక్రియ సక్రమంగా జరగడం లేదు. దెందులూరు మండలంలోని ఓ కేంద్రం పరిధిలో బుధవారం 2 గంటలు సరఫరా నిలిచిపోగా 30 నిమిషాలే ఆగినట్లు నమోదు చేశారు. రాత్రి సమయాల్లో విద్యుత్తు వినియోగం బాగా పెరగడంతో ఫీడర్లపై బాగా భారం పడటంతో రాత్రుళ్లు  కోతలు పెడుతున్నారు.

ఇక్కడే  అధికం

చింతలపూడి, జంగారెడ్డిగూడెం, చాట్రాయి, ఉండి, లింగపాలెం, కామవరపుకోట, మొగల్తూరు, గణపవరం, పోలవరం మండలాల్లో సమయంతో పని లేకుండా రోజుకు 2 నుంచి 4 గంటల వరకూ కోత పెడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో చాలా ప్రాంతాల్లో తక్కువ సమయం (15-30 నిమిషాలు) ఎక్కువ సార్లు విద్యుత్తు తీస్తున్నారు. ‘సాంకేతిక సమస్యలు, వాతావరణ ఇబ్బందుల వల్లే విద్యుత్తు అంతరాయం తప్ప కరెంటు కోతలు లేవు. కొన్నిచోట్ల ఫీడర్లపై భారం పడటంతో చాలా కొద్ది సమయం విద్యుత్తు నిలుపుతున్నాం’ అని విద్యుత్తుశాఖ ఎస్‌ఈ సాల్మన్‌రాజు తెలిపారు.

లో ఓల్టేజీ సమస్య వేధిస్తోంది..

లో ఓల్టేజీ సమస్యతో రాత్రుళ్లు ఫ్యాన్లు ఒక్కసారిగా ఆగిపోతున్నాయి. కొన్ని సార్లు సరిగా తిరగడం లేదు.  సరఫరా ఎప్పుడు ఉంటుందో...! ఎప్పుడు తీసేస్తారో..? తెలియని పరిస్థితి.  వర్షం పడినా గాలి వేసినా మా ప్రాంతంలో విద్యుత్తు సరఫరాకు గంటల కొద్దీ అంతరాయం కలుగుతోంది. అధికారులకు చెప్పినా ఫలితం లేదు.

పీవీఎస్‌ గోపాలకృష్ణంరాజు, వినియోగదారుడు, యండగండి.

పనులు పూర్తి చేయలేకపోతున్నా.. ఒప్పుకున్న పనులు సమయానికి పూర్తి చేయలేకపోతున్నాం. నా దగ్గర ముగ్గురు కూలీలు పని చేస్తారు. కరెంట్‌ సక్రమంగా లేకపోవటంతో గంటలకొద్దీ వారు ఖాళీగానే ఉంటున్నారు. అయినా జీతాలు ఇవ్వాల్సి వస్తోంది.

ఈర్ని సూరిబాబు, వడ్రంగి మేస్త్రీ, జంగారెడ్డిగూడెం'

పాలు, పెరుగు ప్యాకెట్లు పాడవుతున్నాయి

కిళ్లీకొట్టులో శీతలపానీయాలతో పాటు పాలు, పెరుగు, లస్సీ ప్యాకెట్లు అమ్ముతున్నా. రోజుకు సుమారు 3.30 గంటల వరకూ విద్యుత్తు సరఫరా  నిలిచిపోతోంది. దీంతో శీతల పెట్టెలో నిల్వ ఉంచిన పాలు, పెరుగు ప్యాకెట్లలో కొన్ని పాడై నష్టపోవాల్సి వస్తుంది. ఏ సమయంలో విద్యుత్తు సరఫరా నిలిపివేస్తారో తెలియడం లేదు.

డి.స్వరూప్‌కుమార్‌, చినకాపవరం, ఆకివీడు మండలం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని