logo

నూజివీడు కూటమిలో జోష్‌

నూజివీడులో కూటమికి మరింత జోష్‌ వచ్చింది. మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావుతో పాటు ఆయన భార్య సోమవారం నామినేషన్లు ఉపసంహరించుకున్న నేపథ్యంలో కూటమి కార్యకర్తల్లో మరింత ఉత్సాహం కనిపిస్తోంది.

Updated : 30 Apr 2024 06:50 IST

నామినేషన్‌ ఉపసంహరించుకున్న ముద్దరబోయిన

అధినేతను కలిసి తెదేపాలోకి పునరాగమనం

ఈనాడు, ఏలూరు, న్యూస్‌టుడే, నూజివీడు రూరల్‌: నూజివీడులో కూటమికి మరింత జోష్‌ వచ్చింది. మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావుతో పాటు ఆయన భార్య సోమవారం నామినేషన్లు ఉపసంహరించుకున్న నేపథ్యంలో కూటమి కార్యకర్తల్లో మరింత ఉత్సాహం కనిపిస్తోంది. సోమవారం ముద్దరబోయిన తెదేపా అధినేత చంద్రబాబును కలిశారు. కూటమి అభ్యర్థుల ఎంపికలో పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథికి నూజివీడు స్థానాన్ని కేటాయించారు. ఈ  సీటు కోల్పోయిన మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన తెదేపాకు రాజీనామా చేయడం, స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేయటం, ప్రచారంలో తిరగటంతో కూటమి ఓట్లు చీలిపోతాయంటూ వైకాపా ప్రచారం చేసింది. అయినప్పటికీ పార్థసారథి ప్రచారంలో  అందరినీ కలుపుకొని దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాలు కలియదిరుగుతూ..ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ నూజివీడు ఎన్నికల ప్రచార రథానికి పార్థసారథిలా నడిపిస్తూ వస్తున్నారు.

 కూటమికి అనుకూల పవనాలు.. ముద్దరబోయిన పునరాగమనంతో  ఎన్నికల్లో నూజివీడులో కూటమికి మరింత బలం పెరగనుంది. మంగళవారం నుంచి ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశాలున్నాయి. పార్థసారథి సారథ్యంలో రానున్న పదిరోజులు ఇద్దరు కలిసి ప్రచారం చేయనుండటంతో తెదేపా, భాజపా, జనసేన కార్యకర్తలు అభిమానుల్లో ఇప్పటికే జోష్‌ కనిపిస్తోంది. ముద్దరబోయిన వర్గంతోపాటు, ఆయన పార్టీని వీడటంతో ఎటూ వెళ్లలేక స్తబ్దుగా ఉన్న కార్యకర్తలు, అభిమానులు తాజా పరిణామంతో నూతనోత్సాహం కనిపిస్తోంది. పార్థసారథి, ముద్దరబోయిన ఒకే సామాజిక వర్గం కావటం, ఇద్దరు తలోదారైపోవటంతో ఆ వర్గం ఎటూ తేల్చుకోలేక నలిగిపోయింది. తాజా నిర్ణయంతో వారంతా కూటమికిజై అంటూ ముక్తకంఠంతో నినదిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని