logo

ఏమిటీ దౌర్జన్యం.. ఏం కాల్చేస్తారా?

‘నా నియోజకవర్గంలో నన్ను తిరగనివ్వరా? ఎమ్మెల్యేనైన నాపైనే దౌర్జన్యం చేస్తున్నారు.. కాల్చేస్తారా..?’ అంటూ  ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Published : 07 Jun 2023 04:17 IST

పోలీసుల తీరుపై ఎమ్మెల్యే నిమ్మల ఆగ్రహం

రామానాయుడుతో మాట్లాడుతున్న డీఎస్పీ 

పాలకొల్లు పట్టణం, న్యూస్‌టుడే: ‘నా నియోజకవర్గంలో నన్ను తిరగనివ్వరా? ఎమ్మెల్యేనైన నాపైనే దౌర్జన్యం చేస్తున్నారు.. కాల్చేస్తారా..?’ అంటూ  ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితుల భూముల్లో మట్టి అక్రమ తవ్వకాలను నిలుపుదల చేయాలని ఎమ్మెల్యే రామానాయుడు రెండు రోజులుగా స్థానికులతో కలిసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం రాత్రంతా అక్కడే బస చేసి మంగళవారం ఉదయం నియోజకవర్గం పని మీద బయటకు వెళ్లి మధ్యాహ్నానికి తిరిగి వచ్చిన ఆయనను పెరుగులంక గ్రామంలోకి వెళ్తుండగా డీఎస్పీ మనోహరచారి తమ సిబ్బందితో బారికేడ్లు ఏర్పాటు చేసి అడ్డుకున్నారు. ఎమ్మెల్యే తన కారు నుంచి బయటకు దిగకుండా చుట్టూ పోలీసులు పహారా కాశారు. కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. ‘నాపై దౌర్జన్యం ఏమిటి? నన్ను నియోజకవర్గంలో తిరగనివ్వరా’ అంటూ డీఎస్పీని ప్రశ్నించారు. ప్రభుత్వ స్థలాల పూడిక కోసం మట్టి తరలిస్తున్నారంటూ డీఎస్పీ సర్దిచెప్పారు. దానికి సంబంధించిన కాగితాలు ఉంటే చూపించాలని ఎమ్మెల్యే అడిగారు. కారులో ఉన్న ఎమ్మెల్యేను పోలీసులు దౌర్జన్యంగా తమ వాహనంలోకి ఎక్కించారు. దళితులు, సీపీఎం, సీపీఐ, తెదేపా నాయకులు  వాహనాన్ని అడ్డుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అడ్డుకున్న నిరసనకారులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. కొంతమందిని జీపులోకి ఎక్కించేటప్పుడు పిడిగుద్దులు గుద్దడం, కారులో కుక్కడం వంటివి చేయడంతో చాలామంది గాయపడ్డారు. రోడ్డుకు అడ్డంగా కూర్చొని నిరసన తెలుపుతున్న మహిళలను మగ పోలీసులు లాక్కెళ్లి వాహనాల్లో తరలించారు. ఈ క్రమంలో నిరసనకారులకు గాయాలయ్యాయి. వారిని తాడేపల్లిగుడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరికొంత మందిని తాడేపల్లిగూడెం గ్రామీణ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడును గణపవరం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పాలకొల్లు పట్టణం, యలమంచిలి, పోడూరు, నరసాపురం, మొగల్తూరు, వీరవాసరం సీఐలు, ఎస్సై, పోలీసులు, ఏలూరు స్పెషల్‌ బ్రాంచి పోలీసులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని