logo

స్పందన లేని యాత్ర

ఎన్నికల నేపథ్యంలో మేమంతా సిద్ధం పేరుతో సీఎం జగన్‌ చేపట్టిన బస్సు యాత్ర ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో విఫలమైంది.

Updated : 17 Apr 2024 06:34 IST

జనం లేక మాట్లాడని సీఎం
 పర్యటన మొత్తం అభివాదాలతో సరి

గణపవరంలో బస్సుయాత్ర వెలవెల

ఈనాడు, డిజిటల్‌, భీమవరం, పెనుమంట్ర, న్యూస్‌టుడే: ఎన్నికల నేపథ్యంలో మేమంతా సిద్ధం పేరుతో సీఎం జగన్‌ చేపట్టిన బస్సు యాత్ర ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో విఫలమైంది. ఉమ్మడి జిల్లాలో సోమ, మంగళవారాల్లో నిర్వహించిన పర్యటన  పేలవంగా సాగింది. కలపర్రు టోల్‌గేట్‌ దగ్గర ఏలూరు జిల్లాలోకి ప్రవేశించిన యాత్ర మొదటి రోజు నారాయణపురంలో ముగిసింది. రెండో రోజు అక్కడి నుంచే మొదలై  భీమవరం మీదుగా సాగి తేతలిలో ముగిసింది. బుధవారం విరామం ప్రకటించారు. యాత్ర సాగిన  గణపవరం, ఉండి, భీమవరం, వంటి ప్రధాన ప్రాంతాల్లో సైతం వెయ్యి మంది కూడా లేరంటే యాత్ర ఎంత పేలవంగా సాగిందో తెలుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో జనం లేక జగన్‌ బస్సులోంచి తొంగి కూడా చూడలేదు. అరకొరగా వచ్చిన వారు కూడా నాయకులు వాహనాలు పెట్టి, డబ్బులు, మద్యం, బిర్యానీ ఇస్తే వచ్చిన వారే కావటం గమనార్హం.

ఆలకించలేదు.. ఆనతివ్వలేదు.. జగన్‌ ఉమ్మడి జిల్లాలో దాదాపు 150 కిమీ మేర యాత్ర చేసినా ఏ ఒక్క చోటా కూడా నోరు విప్పలేదు. జిల్లాకు ఆయన వల్ల ఏం ఒరిగిందో చెప్పలేదు. కష్టాలు చెప్పుకొనేందుకు, వినతులు ఇచ్చేందుకు వచ్చిన వృద్ధులు, దివ్యాంగులు,పేదల మొర వినే ప్రయత్నం చేయలేదు. యాత్ర ఆసాంతం సీఎం అభివాదాలు తప్ప జిల్లా ప్రజలకు ఏం భరోసా ఇచ్చారన్న చర్చ  సాగుతోంది.  

  సాగిందిలా.. మంగళవారం సాయంత్రం భీమవరం నుంచి ప్రారంభమైన బస్సు యాత్ర గొల్లలకోడేరు మీదుగా యండగండి, పిప్పర, చిలకంపాడు లాకులు, రావిపాడు, దువ్వ జాతీయ రహదారి మీదుగా తేతలి బస ప్రాంతానికి చేరుకుంది. చిలకంపాడు లాకుల నుంచి కాశిపాడు, రావిపాడు మీదుగా రహదారి అధ్వానంగా ఉండటంతో కాన్వాయ్‌ నెమ్మదిగా ముందుకు సాగింది. ఒకే దారి కావడంతో ఇతర వాహనాలను పోలీసులు అనుమతించలేదు. దారిలో కేవలం గొల్లలకోడేరు శివారు ఉప్పలగూడెం వద్ద జగన్‌ రెండు నిమిషాలు స్థానికులతో మాట్లాడారు తప్ప ఇంకెక్కడా బస్సు నుంచి కిందకు దిగలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని