logo

ఎస్సీ కమిషన్‌ సభ్యుడు ఆనందప్రకాశ్‌పై కేసు

వైకాపా అభ్యర్థి గుడాల శ్రీహరిగోపాలరావు (గోపి)తో కలిసి ఎస్సీ కమిషన్‌ సభ్యుడు చెల్లం ఆనందప్రకాశ్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంపై పాలకొల్లు పట్టణ పోలీస్‌స్టేషన్‌లో బుధవారం కేసు నమోదైంది.

Published : 18 Apr 2024 05:29 IST

పాలకొల్లు పట్టణం, న్యూస్‌టుడే: వైకాపా అభ్యర్థి గుడాల శ్రీహరిగోపాలరావు (గోపి)తో కలిసి ఎస్సీ కమిషన్‌ సభ్యుడు చెల్లం ఆనందప్రకాశ్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంపై పాలకొల్లు పట్టణ పోలీస్‌స్టేషన్‌లో బుధవారం కేసు నమోదైంది. ఏప్రిల్‌ 13న వైకాపా ఆధ్వర్యంలో గాంధీ బొమ్మల సెంటర్‌ నుంచి యడ్లబజారు వరకు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆ ప్రచారంలో రాష్ట్ర ఎస్సీ కమిషన్‌ సభ్యుడు చెల్లం ఆనందప్రకాశ్‌ పాల్గొన్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని సీ-విజిల్‌ యాప్‌ ద్వారా 3 సార్లు ఫిర్యాదు చేశారు. అధికారులు స్పందించకుండా ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందకు రాదంటూ విచారించలేదు. దీనిపై ఫిర్యాదుదారు కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌కు, ఎన్నికల కమిషన్‌కు పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్‌ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి (ఆర్‌వో) బి.ఎస్‌.నారాయణరెడ్డిని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీనిపై నారాయణరెడ్డి ఎస్సీ కమిషన్‌ సభ్యుడు చెల్లం ఆనందప్రకాశ్‌కు లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వాలని నోటీసు జారీ చేశారు. ఆయనిచ్చిన సమాధానంతో సంతృప్తి చెందని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి పాలకొల్లు మున్సిపల్‌ కమిషనర్‌, ఎన్నికల ప్రవర్తనా నియమావళి నోడల్‌ అధికారి బి.విజయసారధిని సమగ్ర విచారణకు ఆదేశించారు. ఇదే సమయంలో పాలకొల్లు నియోజకవర్గ వైకాపా అభ్యర్థి గుడాల గోపి ఏప్రిల్‌ 13న జరిగిన ప్రదర్శనకు సంబంధించిన ఎన్నికల ప్రచారం వీడియోను తన ఫేస్‌బుక్‌లో పెట్టారు. చెల్లం ఆనందప్రకాశ్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్లు రుజువు కావడంతో ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించారని నిర్ధారించి నోడల్‌ అధికారి నివేదిక ఇచ్చారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని కోరుతూ పట్టణ సీఐ మంగాదేవికి ఆర్వో ఫిర్యాదు చేశారు. దీనిపై సెక్షన్‌ 188, 171-ఎఫ్‌ సెక్షన్ల కింద కేసు నమోదైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని