logo

రోడ్డు సమస్యను విన్నవిస్తే చేయిచేసుకున్న ఎమ్మెల్యే

మదనపల్లె పురపాలక సంఘం పరిధిలోని నీరుగట్టువారిపల్లెలో శుక్రవారం రాత్రి జరిగిన ‘గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం’ ఉద్రిక్తతకు దారితీసింది.

Updated : 04 Feb 2023 08:19 IST

బాధితుడిని స్టేషన్‌కు తరలించిన పోలీసులు

బాధితుడిని ఇంటి బయట నుంచి విచారిస్తున్న పోలీసులు

మదనపల్లె పట్టణం, న్యూస్‌టుడే : మదనపల్లె పురపాలక సంఘం పరిధిలోని నీరుగట్టువారిపల్లెలో శుక్రవారం రాత్రి జరిగిన ‘గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం’ ఉద్రిక్తతకు దారితీసింది. స్థానికంగా నివాసముంటున్న లక్ష్మీనారాయణపై ఎమ్మెల్యే నవాజ్‌బాషా చేయిచేసుకున్నారు. ఘటన జరిగిన కొన్ని నిముషాల్లోనే బాధితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని ఒకటో పట్టణ పోలీసుస్టేషన్‌కు తరలించారు. స్థానికులు తెలిపిన వివరాలు మేరకు... మదనపల్లెలోని 32వ వార్డులో శుక్రవారం రాత్రి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. రామిరెడ్డి లేఅవుట్‌ వినాయకునివీధిలోకి ఎమ్మెల్యే రావడంతో ఇంట్లో నుంచి లక్ష్మీనారాయణ బయటకొచ్చి ఆప్యాయంగా పలకరించారు. ఎమ్మెల్యే మొదట అతని భుజంపై చేయి వేసి పలకరించారు. అనంతరం ఇంటి ముందున్న రోడ్డుకు మరమ్మతులు చేయిస్తే బాగుంటుందని కోరారు. దీంతో ఎమ్మెల్యే ప్రస్తుతమున్న రోడ్డుపైనే రోడ్డు నిర్మించడానికి చర్యలు తీసుకుంటానని చెప్పగా, అలా చేస్తే రోడ్డు ఎత్తు పెరిగి ఇల్లు పల్లంలోకి చేరుతుందని, వాస్తు ప్రకారం ఇబ్బంది కలుగుతుందని వివరిస్తూ ఎమ్మెల్యే చేయి పట్టుకున్నట్లు స్థానికుల తెలిపారు.  దీంతో ఒక్కసారిగా ఆగ్రహించిన ఎమ్మెల్యే నవాజ్‌బాషా లక్ష్మీనారాయణపై చేయిచేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. అనంతరం బాధితుడిని పోలీసులు ఒకటో పట్టణ పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన స్థానికులు అధిక సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. కొంతమంది ఒకటో పట్టణ పోలీసుస్టేషన్‌ వద్దకు వెళ్లి బాధితుడిని విడిచిపెట్టాలని పట్టుబట్టారు. పర్యటనలో ఉన్న ఎమ్మెల్యేతో మాట్లాడేందుకు తొగటవీర క్షత్రియ సంఘం నాయకులు అక్కడికి వచ్చారు. ఈ సమయంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగి తోపులాటకు దారితీసింది. అనంతరం ఎమ్మెల్యే వారిని పిలిపించి సమస్యను వారికి వివరించడంతో గొడవ సద్దుమణిగింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని