logo

ముహూర్తం కుదర్లే!

పేదల సొంతింటి కల సాకారం చేస్తామని, గూడు లేని అర్హులందరికీ పక్కా గృహాలు మంజూరు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా ప్రకటించింది. ఇంటి జాగా కూడా ఇస్తామని ముందుకొచ్చింది.

Updated : 22 Mar 2023 03:51 IST

సామూహిక గృహప్రవేశాలు మళ్లీ వాయిదా
చాలా చోట్ల అసంపూర్తిగా నిర్మాణ పనులు
ఉగాది వేళ ఇళ్ల ప్రారంభోత్సవాలు లేనట్లే!
న్యూస్‌టుడే, కడప. ప్రొద్దుటూరు, రాజంపేట గ్రామీణ

మంటపంపల్లె జగనన్నకాలనీలో నిర్మాణంలో ఉన్న పక్కాగృహాలు

పేదల సొంతింటి కల సాకారం చేస్తామని, గూడు లేని అర్హులందరికీ పక్కా గృహాలు మంజూరు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా ప్రకటించింది. ఇంటి జాగా కూడా ఇస్తామని ముందుకొచ్చింది. ఇందుకోసం పల్లె, పట్టణ ప్రాంతాల్లో స్థలాలు సేకరించి జగనన్న కాలనీలు ఏర్పాటు చేసింది.  క్షేత్రస్థాయిలో మాత్రం ఆశించిన స్థాయిలో పనుల ప్రగతి పరుగులు తీయడం లేదు. లబ్ధిదారులకు సకాలంలో బిల్లులు చెల్లించడంలేదు. సకాలంలో ఇసుక అందకపోవడం, సిమెంటు పంపిణీ కాకపోవడం, భవన నిర్మాణ సామగ్రి సరఫరాలో జాప్యంతో పనులు నిదానంగా సాగుతున్నాయి. ఈ ఏడాది ఉగాది (నేడు)కి నిర్వహించతలపెట్టిన సామూహిక గృహప్రవేశాల శుభ కార్యాన్ని మళ్లీ వాయిదా వేశారు.

* వైయస్‌ఆర్‌ జిల్లాలో 452 చోట్ల జగనన్న కాలనీలు ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా ‘నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు’ (ఎన్‌పీఐ)లో 1,02,614, అంతకు ముందు 3,429 పక్కాగృహాలు మంజూరు చేశారు. మ్యాపింగ్‌ 1,02,843, రిజిస్ట్రేషన్‌ 99,314, జియోట్యాగింగ్‌ 98,395 చేశారు. భౌతికంగా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను 96,507 ఇళ్లకు పూర్తిచేశామని గృహనిర్మాణశాఖాధికారులు చెబుతున్నారు. ఇప్పటికీ 1,513 మంది అసలు మొదలు పెట్టలేదు. గుంత దశలో 30,983, పునాదులు వేసినవి 35,666, కిటికీల వరకు వచ్చినవి 7,650, పైకప్పు దాకా పనులు చేసినవి 6,643 ఉన్నాయి.  14,160 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇప్పటికే బిల్లులకు రూ.667.78 కోట్లు, సామగ్రికి     రూ.133.94 కోట్లు వెచ్చించారు. యూనిట్‌ విలువ రూ.1.80 లక్షలు కాగా, ఇళ్ల నిర్మాణాల వేగవంతానికి స్వయం సహాయక సంఘాల ద్వారా అదనంగా మరో రూ.35 వేలు రుణం మంజూరు చేయాలని రాష్ట్ర ఉన్నతాధికారులు ఆదేశించారు. జిల్లాలో 91,281 మందికిగాను 69,921  మందికి పరపతి ఇచ్చారు. అయినప్పటికీ పనులు వేగంగా ముందుకు సాగలేదు. ఉగాది నాటికి 33,031 ఇళ్లు పూర్తి చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించారు. అందులో సగం కూడా పూర్తవ్వలేదు. తెలుగింటి ఉగాది పర్వదినం వేళ పూర్తయిన పక్కాగృహాల్లో ప్రవేశాలు చేయించాలని అధికారులు నిన్నటిదాకా హడావుడి చేశారు. కాకపోతే చాలాచోట్ల వివిధ కారణాలతో పనులు నిదానంగా జరుగుతున్నాయి. ఆశించిన సంఖ్యలో పూర్తి కాలేదని రాష్ట్ర ఉన్నతాధికారులు గుర్తించారు. జిల్లాలో 14,160 (42.86 శాతం) ఇళ్లు మాత్రమే పూర్తి కావడంతో ఏప్రిల్‌లో గృహ ప్రవేశం కార్యక్రమాన్ని చేపట్టాలని ఉన్నత స్థాయిలో తాజాగా నిర్ణయం తీసుకున్నారు.


అన్నమయ్యలోనూ అదే తీరు

అన్నమయ్య జిల్లాలో ఎన్‌పీఐ పథకంలో 73,950 మందికి పక్కాగృహాలు మంజూరు చేశారు. ఇప్పటికీ 806 మంది మొదలు పెట్టలేదు. గుంతల దశలో 21,376, పునాది 21,566, కిటికీలు వరకు చేసినవి 7,016, పైకప్పు దశకు వచ్చినవి 4,969, పైకప్పు వేసిన ఇళ్లు 18,217 ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇళ్ల నిర్మాణం చేపట్టిన లబ్ధిదారులకు బిల్లులు రూ.526.38 కోట్లు, సామగ్రికి రూ.78.28 కోట్లు వంతున మొత్తం రూ.606.20 కోట్లు వెచ్చించారు. కుదించిన లక్ష్యం మేరకు ఉగాది పండగ నాటికి 21,256 పూర్తి చేయించాలని నిర్ణయించగా, ఇప్పటికి 16,492 పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. మరో 4,764 ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి.


గృహప్రవేశాలు వాయిదా
- కృష్ణయ్య, పీడీ, గృహనిర్మాణశాఖ, వైయస్‌ఆర్‌ జిల్లా

రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను అనుసరించి పేదలకు పక్కాగృహాలు మంజూరు చేశాం. ఇప్పటికే పూర్తిచేసిన లబ్ధిదారుల ఇళ్లల్లో ఉగాది పండగ వేళ గృహప్రవేశాలు చేయించాలని రాష్ట్ర ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈ మేరకు మండలాల వారీగా లక్ష్యాలు నిర్దేశించాం. చాలామంది నిర్మించుకున్నారు. మరికొందరు పూర్తి చేయాల్సి ఉంది. ఉగాది వేళ నిర్వహించాల్సిన కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేశాం. ఏప్రిల్‌ 15న గృహ ప్రవేశాలు కార్యక్రమాన్ని నిర్వహించాలని ఉన్నత స్థాయి నుంచి ఆదేశాలందాయి.          

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని