logo

స్థిరాస్తి వ్యాపారం చతికిల... రిజిస్ట్రేషన్లశాఖ ఆదాయం విలవిల!

జిల్లాలో స్థిరాస్తి వ్యాపారం గాలిలో దీపంలా మారింది. వేలాది ఎకరాల్లో వేసిన ప్లాట్లు కొనేవారు కరవైపోతున్నారు. అమ్మేవారికి బరువైపోతున్నాయి. స్థిరాస్తి వ్యాపార రంగంలో నెలకొన్న మాంద్యం నేరుగా స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ ఆదాయంపై ప్రభావం చూపుతోంది.

Published : 29 Mar 2023 04:21 IST

జిల్లాలో 20 శాతం ఆదాయానికి గండి
న్యూస్‌టుడే, కడప సంక్షేమం

కడప రిజిస్ట్రార్‌ కార్యాలయం

జిల్లాలో స్థిరాస్తి వ్యాపారం గాలిలో దీపంలా మారింది. వేలాది ఎకరాల్లో వేసిన ప్లాట్లు కొనేవారు కరవైపోతున్నారు. అమ్మేవారికి బరువైపోతున్నాయి. స్థిరాస్తి వ్యాపార రంగంలో నెలకొన్న మాంద్యం నేరుగా స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ ఆదాయంపై ప్రభావం చూపుతోంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో సుమారు 20 శాతం ఆదాయానికి గండిపడింది. జిల్లాలో ఎగిసి‘పడిన’ రియల్‌బూమ్‌ ఎప్పటికి కోలుకుంటుందోనన్న ఆందోళన అధికారులు, వ్యాపారవర్గాల్లో నెలకొంది.

జిల్లాలోని 12 సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల పరిధిలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ.316.60 కోట్ల ఆదాయం రావాలని ప్రభుత్వం స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖకు లక్ష్యాన్నిచ్చింది. ఈ మొత్తంలో రూ.262.01 కోట్ల ఆదాయం ఇప్పటివరకు సమకూరింది. లక్ష్యం చేరాలంటే మరో రూ.54 కోట్ల ఆదాయం రావాల్సి ఉంది. ఆర్థిక సంవత్సరంలో మిగిలింది మూడు రోజులు మాత్రమే. ఆదాయ సమూపార్జనలో జిల్లాలోని 12 కార్యాలయాల్లో దువ్వూరు మినహా మిగిలిన కార్యాలయాలు వెనుకబడి ఉండడం గమనార్హం. దువ్వూరు సబ్‌రిజిస్ట్రర్‌ కార్యాలయం వంద శాతానికి మించి ఆదాయం సాధించింది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయానికి జిల్లాలో కడప పట్టణ, గ్రామీణ కార్యాలయాలు పట్టుగొమ్మలు. మొత్తం ఆదాయం రూ.316 కోట్లకుగానూ ఈ రెండు కేంద్రాల నుంచే రూ.143 కోట్ల ఆదాయం రావాల్సి ఉంది. ఇంత కీలకమైన కేంద్రాల్లోనే మార్చిలో ఆదాయం పూర్తిగా పడిపోయింది. కడప అర్బన్‌లో మార్చిలో రూ.9.71 కోట్ల ఆదాయం రావాల్సి ఉండగా, రూ.4.80 కోట్లు, రూరల్‌ నుంచి రూ.6.08 కోట్లకు రూ.3.58 కోట్లు మాత్రమే వచ్చింది. ప్రొద్దుటూరులో రూ.8.47 కోట్లకు రూ.3.90 కోట్లు సమకూరింది. మిగిలిన ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.

మార్కెట్‌ విలువ పెంచినా...: జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు ఆస్తుల మార్కెట్‌ విలువ పెంచినా రిజిస్ట్రేషన్ల ఆదాయం ఆశించిన స్థాయిలో రాకపోవడం అధికారులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. జిల్లాలో కడప నగర పాలక సంస్థ పరిధి, సమీపంలోని పంచాయతీల్లో స్థిరాస్తి వ్యాపారం స్థిరంగా సాగుతోంది. లక్ష్యానికి మించి ఆదాయం రావాల్సిన ఈ కేంద్రాల్లో సైతం ఆదాయం అంతంతమాత్రమే రావడం గమనార్హం. ప్రధాన పట్టణాల సమీపంలో పరిశ్రమల స్థాపన జరుగుతుందని, అభివృద్ధి పరుగులు తీస్తుందని నాయకులు చెబుతున్నా ఆయా ప్రాంతాల ప్రజలు వాటిని విశ్వసించడంలేదని గణాంకాలు చెబుతున్నాయి. దీనికితోడు రాష్ట్ర ప్రభుత్వం భూములు, ప్లాట్ల రిజిస్ట్రేషన్లు, భవననిర్మాణ అనుమతుల విషయంలో కొత్త నిబంధనలు తీసుకురావడం స్థిరాస్తి వ్యాపారులను నిరుత్సాహపరుస్తోంది. కడప తదితర పట్టణ ప్రాంతాల్లో భూ కబ్జాలు పెరిగి ఎక్కడ ఏ స్థలం కొంటే ఏ సమస్య వస్తుందోనన్న భయంతో మధ్యతరగతి ప్రజలు కొనుగోళ్లకు వెనకడుగు వేస్తున్నారని రియల్‌ రంగంలోని నిపుణులు చెబుతున్నారు. ప్రధానంగా జిల్లా కేంద్రంలో నిషేధిత స్థలాల రిజిస్ట్రేషన్లకు సమీపంలోని సర్వే నంబర్లు వేయడం ప్రధాన సమస్యగా మారింది. జిల్లా అభివృద్ధిని సూచించే విషయంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయాన్ని ప్రామాణికంగా తీసుకుంటే అభివృద్ధి మేడిపండు చందంలా మారిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ విషయమై స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులను వివరణ కోరగా 2021-22 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన ఆదాయంతో పోల్చితే ఈ ఏడాది ఆదాయం పెరిగిందన్నారు. 2022-23 లక్ష్యాన్ని చేరుకోవడానికి మూడు రోజులు గడవు ఉందని, ఆలోగా లక్ష్యం సాధిస్తామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని