logo

కమలాపురం... ప్రగతికి దూరం!

‘నువ్వు మా బిడ్డ... రాష్ట్రం వైపు చూడు.. మిగిలిన విషయాలు మేము చూసుకుంటామంటూ మీరు దీవించి పంపడంతోనే ఈ రోజు మీ బిడ్డ ముఖ్యమంత్రిగా దేవుడి ఆశీస్సులతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో మంచి పనులు చేస్తున్నాడు.

Updated : 28 May 2023 04:55 IST

కలగానే రైల్వే పైవంతెన
సర్వేకే పరిమితమైన బైపాస్‌ రోడ్డు
సర్వరాయసాగర్‌ కింద ఆయకట్టేది?
కొప్పర్తి పారిశ్రామికవాడ ఉనికేదీ?

గేట్‌ మూయడంతో నిరీక్షిస్తున్న వాహనదారులు

* ‘నువ్వు మా బిడ్డ... రాష్ట్రం వైపు చూడు.. మిగిలిన విషయాలు మేము చూసుకుంటామంటూ మీరు దీవించి పంపడంతోనే ఈ రోజు మీ బిడ్డ ముఖ్యమంత్రిగా దేవుడి ఆశీస్సులతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో మంచి పనులు చేస్తున్నాడు. ఎన్నికలు వస్తుంటాయి... పోతుంటాయి.. ఒక్కటి మాత్రం నిజం. సాటి మనిషికి మంచి చేస్తే ఆ మనిషి గుండెల్లో చనిపోయిన తర్వాత కూడా బతకడం ఒక వరం. దాని కోసం మీ బిడ్డ పాకులాడుతాడు. ఈ రోజు మీ ప్రాంత అభివృద్ధి కోసం రూ.905 కోట్ల నిధులతో చేపట్టబోమే వివిధ పనులకు శంకుస్థాపన చేస్తున్నా. ’

* 2022, డిసెంబరు 23న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కమలాపురం సీఎస్‌ఐ చర్చి మైదానంలో జరిగిన సభలో అన్నమాటలివి. ఈ మాటలు విన్న నియోజకవర్గ ప్రజలు ఆనందపరవశులయ్యారు. ఇక మన కష్టాలన్నీ తీరిపోయినట్లేనని భావించిన వారంతా ఇప్పుడు నిరాశ, నిస్సహాయతతో ఉన్నారు.

* కమలాపురంలో ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి స్వయానా మేనమామ. సీఎం మేనమామ తలుచుకుంటే అభివృద్ధికి కొదవా... అంటూ అందరూ భావిస్తారు. ఈ మేరకు ఇక్కడ పరిస్థితులు కనిపించడంలేదు. ఆశించినంత అభివృద్ధి జరగలేదనే అసంతృప్తితో ఇక్కడ ప్రజలు రగిలిపోతున్నారు. సీˆఎం జగన్‌ కమలాపురం నియోజకవర్గానికి ఇచ్చిన హామీలు నెరవేరకుండా పోయాయి. ముఖ్యమంత్రి హోదాలో తొలి సారిగా వచ్చిన ఆయన అనేక హామీలు గుప్పించారు.  

ఈనాడు డిజిటల్‌, కడప, న్యూస్‌టుడే, కమలాపురం

*  కొప్పర్తి పారిశ్రామికవాడలో ఆశించినంత ప్రగతి కనిపించలేదు. బ్రహ్మంసాగర్‌ నుంచి తాగునీటి పైపులైను పనులు చేపట్టాల్సి ఉండగా ప్రక్రియ సాగలేదు. ఇక్కడ పలు యూనిట్లు స్థాపన జరగాల్సి ఉండగా ఆశించినంతగా అడుగులు పడడంలేదు. మౌలిక సదుపాయాల పనులు నత్తనడకన సాగుతున్నాయి. నీరు అందుబాటులో లేకపోకడం ప్రతిబంధకంగా ఉంది. ఇక్కడ మూడు లక్షల ఉద్యోగాలొస్తాయని సీఎం జగన్‌ పలుమార్లు ప్రకటించినా.. ఆమేరకు లభించిన దాఖలాలు.. సమీపంలో వస్తాయనే ఆశలు కనిపించడంలేదు.

* కమలాపురం పట్టణంలో ప్రధాన సమస్యగా ఉన్న రైల్వే పైవంతెనను నిర్మిస్తామని చెప్పి చేతులెత్తేశారు. సీఎం జగన్‌ సైతం బహిరంగ సభలో రూ.39 కోట్లతో రైల్వే పై వంతెన, లోవంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇంతవరకు పనులు ప్రారంభించిన దాఖలాల్లేవు.

* రూ.88 కోట్లతో బైపాస్‌ రోడ్డు ఏర్పాటు చేస్తామని చెప్పి సర్వేలకే పరిమితం చేశారు. కమలాపురం-ఖాజీపేట రోడ్డు నుంచి గంగవరం వయా మొలకవారిపల్లె మీదుగా సంబటూరు వరకు రూ.3.82 కోట్లతో 4.35 కిలోమీటర్ల రహదారి నిర్మాణ పనులు ఇంత వరకు ప్రారంభానికి నోచుకోలేదు.

* రూ.22 కోట్లతో వల్లూరు నుంచి ఆదినిమ్మాయపల్లె వరకు రోడ్డు, చిన్నమాచుపల్లె, పుష్పగిరి రోడ్డు విస్తరణ, అభివృద్ధికి సంబంధించిన పనులు చేపట్టారు. వల్లూరు నుంచి ఆదినిమ్మాయపల్లె వరకు రోడ్డు పనులు పూర్తికాగా, చిన్నమాచుపల్లె, పుష్పగిరి రోడ్డు విస్తరణ పనులు నిధుల లేమితో నత్తనడకన సాగుతున్నాయి.

* కోగటం- పాయసంపల్లె రోడ్డు నిర్మాణానికి భూములు కోల్పోయిన రైతులకు ఇవ్వాల్పిన రూ.8 కోట్లు పరిహారం ఇంతవరకు అందలేదు.

* కమలాపురంలో రూ.58.20 కోట్లతో సమగ్ర నీటి సరఫరా కోసం 67.66 కిలోమీటర్ల పైపులైన్‌ నిర్మాణ పనులు చేపట్టి 5,500 ఇళ్లకు ఇస్తామన్న నీటి కనెక్షన్లకు టెండర్లు కూడా పూర్తయినా శంకుస్థాపనకే పరిమితమైంది.

* వరద నీరు ప్రవహించేందుకు రూ.8 కోట్లతో చేపట్టిన మురికినీటి కాలువ నిర్మాణం నిధుల లేమితో గుత్తేదారు మధ్యలోనే నిలిపేశారు. రోజుకు 5 మిలియన్‌ లీటర్ల సామర్థ్యంతో పనిచేసే మురుగునీటి పారిశుద్ధ్య ప్లాంట్‌ రూ.18.60 కోట్లతో నిర్మిస్తామని ఇంత వరకు నిర్మించలేదు.

* రూ.3 కోట్లతో అన్ని వసతులతో నగర పంచాయతీ కార్యాలయాన్ని నిర్మిస్తామని చెప్పగా ప్రస్తుతం ఆ ఊసే లేదు. పేరొందిన దర్గా-ఏ-గఫారియాకు రూ.2.50 కోట్లతో ప్రహరీ, ఫంక్షన్‌హాలు, గదుల నిర్మాణాలు చేపట్టనే లేదు.

* రూ.36 కోట్లతో బీసీ బాలుర గురుకుల పాఠశాల నిర్మాణం చేపట్టకపోవడంతో అద్దె భవనంలోనే చాలీ చాలని వసతుల నడుమ కొనసాగిస్తున్నారు.

* రూ.15 కోట్లతో రూ.2.18 ఎకరాల్లో రాష్ట్ర సహకార బ్యాంకు(ఆప్కాబ్‌)కు సంబంధించిన ట్రైనింగ్‌ ఇనిస్టిట్యూట్‌ ఇంత వరకు నిర్మాణానికి నోచుకోలేదు.

* రూ.213 కోట్లతో గాలేరు నగరి సుజల స్రవంతి ప్రాజెక్టుకు సంబంధించి జీఎన్‌ఎస్‌ ఫేజ్‌-1 ప్యాకేజీ-2లో మిగిలిన పనులన్నీ పూర్తి చేయడంతోపాటు సర్వరాయసాగర్‌, వామికొండ రిజర్వాయర్‌ సాగునీటి కాలువలు నిర్మించి 35 వేల ఎకరాలకు సాగునీరందిస్తామన్నారు. ఈ పనులు ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు.

కొప్పర్తి పారిశ్రామికవాడ

మొలకవారిపల్లె రహదారి దుస్థితి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని