logo

సీఎం మాట నిలబెట్టుకోకుంటే ఆందోళన ఉద్ధృతం

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్యోగులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, లేకుంటే ఆందోళన ఉద్ధృతం చేస్తామని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా నాయకులు హెచ్చరించారు.

Published : 01 Jun 2023 04:42 IST

 

కడప కలెక్టరేట్‌ ఎదుట ఉద్యోగుల రిలేనిరాహార దీక్ష

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్యోగులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, లేకుంటే ఆందోళన ఉద్ధృతం చేస్తామని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా నాయకులు హెచ్చరించారు. కడప కలెక్టరేట్‌ ఎదుట బుధవారం వారు ఉద్యోగులతో కలిసి నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు రమేష్‌కుమార్‌ మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో పాలకులు విఫలమయ్యారన్నారు. సీపీఎస్‌ రద్దు చేస్తామని ఎన్నికల ముందు హామీనిచ్చి అయిదేళ్లు గడుస్తున్నా ఇంతవరకు ఆ ఊసేలేదన్నారు. సలహాదారుల పేరుతో విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్న ప్రభుత్వం ఉద్యోగుల ఆర్థిక సమస్యలు పరిష్కరించడంలో తాత్సారం చేస్తోందని విమర్శించారు. ప్రతి నెలా ఒకటో తేదీనే వేతనాలు చెల్లించేవిధంగా చట్టం తీసుకురావాలని, 1993 కంటే ముందుగా నియమితులైన ఎన్‌ఎంఆర్‌, ఒప్పంద, డైలీవేజెస్‌ ఉద్యోగులను క్రమబద్దీకరించాలని డిమాండు చేశారు. వేతన సవరణ సంఘం లేకుండానే ఉద్యోగ సంఘాలతో నేరుగా సంప్రదింపులు జరిపి 12వ వేతన సవరణ చేపట్టాలని డిమాండు చేశారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనలు మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సుదర్శన్‌రెడ్డి, కడప తాలూకా అధ్యక్షుడు నాగరాజు, కార్యదర్శి మునెయ్య, ఐసీడీఎస్‌ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఈశ్వరయ్య, బీసీ సంక్షేమ ఉద్యోగుల సంఘం నాయకుడు ఆంజనేయులు, సచివాలయ ఉద్యోగుల సంఘం నాయకుడు మస్తాన్‌, వీఆర్వోల సంఘం అధ్యక్షుడు మస్తాన్‌వలీ, వివిధ శాఖల ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని