logo

Hyderabad News: మీర్‌పేట్‌ యువకుడి హత్యకేసులో కొత్తకోణం

మీర్‌పేట్‌ ఠాణా పరిధి ప్రశాంత్‌హిల్స్‌లో ఫేస్‌బుక్‌ మిత్రుడితో ప్రియుడిని హత్య చేయించిన ఘటనలో కొత్త కోణం వెలుగుచూసింది. ముగ్గురు నిందితులను

Updated : 13 May 2022 11:38 IST

ఈనాడు, హైదరాబాద్‌ - న్యూస్‌టుడే, బాలాపూర్‌: మీర్‌పేట్‌ ఠాణా పరిధి ప్రశాంత్‌హిల్స్‌లో ఫేస్‌బుక్‌ మిత్రుడితో ప్రియుడిని హత్య చేయించిన ఘటనలో కొత్త కోణం వెలుగుచూసింది. ముగ్గురు నిందితులను బుధవారం పోలీసులు అరెస్ట్‌ చేసి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు. వారి మొబైల్‌ఫోన్ల పరిశీలనలో కొత్త అంశాలు బయటపడినట్టు సమాచారం. ప్రశాంత్‌హిల్స్‌కు చెందిన శ్వేతారెడ్డి(32)కి 2015లో వివాహమైంది. భర్త సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. బ్యూటీషియన్‌గా ఉన్న ఆమెకు బాగ్‌ అంబర్‌పేట్‌ ఫొటోగ్రాఫర్‌ యశ్మకుమార్‌(32)తో ఏర్పడిన ఫేస్‌బుక్‌ స్నేహం అక్రమ సంబంధానికి దారితీసింది.

ఆమె నగ్నఫొటోలు, వీడియోలు సేకరించిన అతడు తనను పెళ్లిచేసుకోమంటూ వేధిస్తూ.. వాటిని అంతర్జాలంలో ఉంచుతానని బెదిరించాడు. కొద్దికాలంగా రోజూ ద్విచక్రవాహనంపై ఆమె ఇంటివద్దకెళ్లి అల్లరి చేయటం ప్రారంభించాడు. దీంతో, వీడియోలు, ఫొటోలు ఉన్న అతడి మొబైల్‌ ఫోన్‌ తీసుకుంటే సమస్య తీరిపోతుందని ఆమె భావించింది. చివరిగా హత్య నిర్ణయానికి వచ్చింది. కృష్ణాజిల్లా తిరువూరు మండలవాసి, ఫేస్‌బుక్‌ మిత్రుడు కొంగల అశోక్‌కు ఫోన్‌లో తన పథకం వివరించింది. ఈనెల 4న రాత్రి యశ్మకుమార్‌కు ఫోన్‌ చేసి ప్రశాంత్‌హిల్స్‌ రప్పించింది. కార్తిక్‌తో కలసి అక్కడకు చేరిన అశోక్‌ పథకం అమలుకు సిద్ధమయ్యాడు.

అదే సమయంలో మనసు మార్చుకున్న శ్వేతారెడ్డి వాట్సాప్‌ ద్వారా అశోక్‌కు యశ్మకుమార్‌ను వదిలేయమంటూ మెసేజ్‌ పంపింది. అశోక్‌ అప్పటికే అతడి తలపై సుత్తితో కొట్టడంతో కిందపడిపోయాడు. తల వెనుక కొడితే మతిస్థిమితం కోల్పోతాడనే దాడి చేశామంటూ నిందితులు పోలీసుల ఎదుట వాపోయినట్టు తెలుస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని