logo

దోమా దోమ.. ఇం‘ధనం ఏదమ్మా’?

జీహెచ్‌ఎంసీ ఎంటమాలజీ విభాగం దోపిడీకి చిరునామాగా మారింది. ఫాగింగ్‌ పేరుతో కొందరు జోనల్‌ స్థాయి అధికారులు  డీజిల్‌ను అమ్మేసుకుంటున్నారు.

Updated : 26 Apr 2024 05:46 IST

ఫాగింగ్‌ పేరుతో వేలాది లీటర్ల డీజిల్‌ పక్కదారి
జీహెచ్‌ఎంసీ దోమల విభాగంలో గోల్‌మాల్‌

ఈనాడు, హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ ఎంటమాలజీ విభాగం దోపిడీకి చిరునామాగా మారింది. ఫాగింగ్‌ పేరుతో కొందరు జోనల్‌ స్థాయి అధికారులు  డీజిల్‌ను అమ్మేసుకుంటున్నారు. సహాయ ఎంటమాలజిస్టులు, సీనియర్‌ ఎంటమాలజిస్టుల వరకు చాలామంది అవకతవకలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా.. చార్మినార్‌ జోన్‌లోని ఓ అధికారి డీజిల్‌, పెట్రోలు విషయంలో తన వాటా విషయమై సిబ్బందిని వేధించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

రోజుకు 600-700లీటర్లు పక్కదారి...

  • ఫాగింగ్‌ కోసం జీహెచ్‌ఎంసీ ఇందుకోసం ఏడాదికి సుమారు రూ.7కోట్లు వెచ్చిస్తుందని అంచనా. అందులో దాదాపు 70శాతం నిధులు దారి మళ్లుతున్నాయని తెలుస్తోంది.
  • నగరంలో 63 పెద్ద, 302 చిన్న ఫాగింగ్‌ యంత్రాలు పనిచేస్తున్నాయి. పెద్ద యంత్రాలకు రోజూ 45లీటర్ల డీజిల్‌, 9లీటర్ల పెట్రోలు, రెండు లీటర్ల మలాథిన్‌ మందు కేటాయిస్తారు. చిన్న వాటికి రోజూ 9 లీటర్ల డీజిల్‌, 1.5లీటర్ల పెట్రోలు, కొద్దిపాటి మలాథిన్‌ను ఇస్తారు. కానీ.. కేటాయింపులన్నీ కాగితాలపైనే కనిపిస్తున్న పరిస్థితి. 80శాతం డీజిల్‌ను పెట్రోలు బంకులోనే విక్రయిస్తామని, పెట్రోలు కూపన్లను అధికారులు, సిబ్బంది వాహనాల కోసం ఉపయోగించుకుంటామని చార్మినార్‌ జోన్‌లోని ఫాగింగ్‌ సిబ్బందే వాపోతున్నారు. కొంతకాలంగా ఓ అధికారి పెట్రోలు మొత్తాన్ని తనకే ఇవ్వాలని వేధిస్తున్నట్లు తెలిపారు. తమ జోన్‌ పరిధిలోని సర్కిళ్లు, డివిజన్లు, మూసీ నది పరివాహక ప్రాంతాల్లో ఫాగింగ్‌ చేపట్టేందుకు రోజుకు కేటాయించే 600లీటర్ల డీజిల్‌లో 20 శాతం మాత్రమే సద్వినియోగం అవుతుందని తెలుస్తోంది.
  • మలాథిన్‌ రసాయనాన్ని.. సరఫరా ఏజెన్సీలకే ఆ మందును తిరిగి విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారనే విమర్శలొస్తున్నాయి.

మూడు నెలలుగా జీతాల్లేవు.. కొవిడ్‌ సమయంలో క్రిమి సంహారక మందులు జనావాసాల్లో పిచికారీ చేసేందుకు జీహెచ్‌ఎంసీ 210 మందిని తాత్కాలికంగా నియమించుకుంది. అనంతరమూ వారి సేవలను ఉపయోగించుకుంటోంది. ఫాగింగ్‌, ఇంటింటి దోమల నివారణ చర్యలు, గుర్రపుడెక్క తొలగింపు, ఇతరత్రా పనుల్లో వారు పని చేస్తున్నారు. వారికి మూడు నెలలుగా జీతాలు అందడం లేదు. ఇళ్ల కిరాయిలు కట్టలేక, ఇంటిని నడిపించలేక నానా అవస్థలు పడుతున్నామని వాపోతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని