logo

స్మార్ట్‌గా ఓటర్లకు చేరువ

ఎన్నికలంటే పార్టీలు, అభ్యర్థుల పాటలతో బస్తీలు మార్మోగేవి. కార్యకర్తలు, అభిమానులు పార్టీ జెండాలు, కండువాలతో పెద్దఎత్తున ఇంటింటి ప్రచారం నిర్వహించేవారు.

Published : 26 Apr 2024 02:24 IST

మారిన ఎన్నికల ప్రచార సరళి

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: ఎన్నికలంటే పార్టీలు, అభ్యర్థుల పాటలతో బస్తీలు మార్మోగేవి. కార్యకర్తలు, అభిమానులు పార్టీ జెండాలు, కండువాలతో పెద్దఎత్తున ఇంటింటి ప్రచారం నిర్వహించేవారు. అభ్యర్థి వెంట భారీ సంఖ్యలో కార్యకర్తలు వెళ్లేవారు. ప్రస్తుత ధోరణి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. ప్రచారంలో సోషల్‌ మీడియా కీలకంగా మారింది. నామినేషన్లు వేసేటప్పుడు, బహిరంగ సభలకు మాత్రమే జన సమీకరణ చేస్తున్నారు. ఎక్కువగా సామాజిక మాధ్యమాలు, ఫోన్‌ కాల్స్‌ ద్వారా ఓటర్లకు చేరువ అవుతున్నారు. ఓ వైపు ఎండ తాకిడి, మరోవైపు ఖర్చుల దృష్ట్యా ఇంటింటి ప్రచారానికి ఎక్కువగా ఆసక్తి చూపించడం లేదు.

సోషల్‌ మీడియా విభాగాల ఏర్పాటు..: స్మార్ట్‌ఫోన్ల వినియోగం విపరీతంగా పెరిగింది. డేటా సైతం తక్కువ ధరకే లభిస్తోంది. యువత ఉదయం లేచింది మొదలు ఏదో ఒక సోషల్‌ మీడియాలో కంటెంట్‌ చూస్తున్నారు. దీంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు స్మార్ట్‌ ప్రచారానికి మొగ్గు చూపుతున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా సోషల్‌ మీడియా విభాగాలు ఏర్పాటు చేసుకున్నారు. నిత్యం అభ్యర్థుల వెంట వ్యక్తిగత వీడియోగ్రాఫర్లు, ఫొటోగ్రాఫర్లు ఉంటున్నారు. సమావేశాలు, ఇంటింటి ప్రచారాల్లో చిత్రీకరించిన వీడియోలు, చిత్రాలను సోషల్‌ మీడియా విభాగం ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌, ఎక్స్‌, యూట్యూబ్‌ల్లో అప్‌లోడ్‌ చేయడంతోపాటు మీడియా, కమ్యూనిటీ, పార్టీ వాట్సప్‌ గ్రూప్‌ల్లో షేర్‌ చేస్తున్నారు. మరికొందరు సంక్షిప్త సందేశాలు, వాయిస్‌ కాల్స్‌ విధానాన్ని ఎంచుకుంటున్నారు. అభ్యర్థులు ఉదయం వాకర్స్‌తో ముచ్చటిస్తున్నారు. గేటెడ్‌ కమ్యూనిటీలు, సామాజిక వర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు.  


ఆచితూచి అడుగులు..

ఇందుకోసం డబ్బులతో పాటు భోజనం, మద్యం వంటివి పంపిణీ చేసి జన సమీకరణ చేసేవారు. ఫలితంగా అభ్యర్థుల ఖర్చు తడిసి మోపెడయ్యేది. ఎండలు మండిపోతుండటంతో ఇంటింటి ప్రచారానికి వచ్చేందుకు రోజు కూలీలు ఆసక్తి చూపకపోవడంతో నేతలు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఎక్కువ డబ్బులిస్తామని ఆశ చూపుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని