icon icon icon
icon icon icon

మౌనమె నీ భాష.. ఓ మూగ మనసా!

వైకాపా సామాజిక మాధ్యమ విభాగం కార్యకర్తలతో విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం పెద్దిపాలెం కల్యాణ మండపంలో ముఖ్యమంత్రి జగన్‌ మంగళవారం నిర్వహించిన ముఖాముఖి సమావేశం అంతా గందరగోళంగా మారింది.

Updated : 24 Apr 2024 06:35 IST

సామాజిక మాధ్యమ కార్యకర్తలతో సీఎం జగన్‌ భేటీ
ఎవరు ఏం అడిగినా చిరునవ్వే ఆయన సమాధానం

ఈనాడు, విశాఖపట్నం, అమరావతి: వైకాపా సామాజిక మాధ్యమ విభాగం కార్యకర్తలతో విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం పెద్దిపాలెం కల్యాణ మండపంలో ముఖ్యమంత్రి జగన్‌ మంగళవారం నిర్వహించిన ముఖాముఖి సమావేశం అంతా గందరగోళంగా మారింది. నిజానికి ఇందులో ముందే ఎంపిక చేసిన కార్యకర్తలు ఆయన్ను వేనోళ్ల పొగుడుతూ.. ఆకాశానికెత్తేశారు. తమ కుటుంబసభ్యుల కంటే జగనే ఎక్కువని, యువతకు సందేశం ఇస్తే సంతోషిస్తామని యువతి కోరినా.. జగన్‌ నుంచి సమాధానమే కరవైంది. ఇందులో మచ్చుకు రెండు సన్నివేశాలు ఇలా ఉన్నాయి...

యువతి: ఒకటే సందేహం.. మీరు రాజకీయ నేత కాకముందు మంచి పారిశ్రామికవేత్త. ఇవన్నీ ఎలా హ్యాండిల్‌ చేస్తున్నారు? నేను కూడా ఔత్సాహిక పారిశ్రామికవేత్తనే. యువతను పారిశ్రామిక రంగంలో ముందుకు తీసుకెళ్లడానికి ఒక మంచి సలహా చెబుతారా?

సీఎం జగన్‌: (ప్రశ్న తనకేమీ అర్థం కాలేదన్నట్లు వైకాపా సోషల్‌మీడియా ఆర్గనైజర్‌ సజ్జల భార్గవరెడ్డి వైపు చూశారు. ఆయన యువతి చెప్పిన అంశాన్ని మళ్లీ వివరించినా జగన్‌లో స్పందన లేదు. అటూ ఇటూ చూస్తూ.. చిరునవ్వులు చిందిస్తూ కూర్చుండిపోయారు).

కొద్ది క్షణాల తర్వాత భార్గవరెడ్డి కల్పించుకొని..: ‘స్వేచ్ఛ తీసుకుని సీఎం తరఫున నేను మాట్లాడతా. ఆయన రాజకీయ ప్రయాణం ఎంత స్ఫూర్తిదాయకమో.. పారిశ్రామికవేత్తగా చేసిన ప్రయాణం కూడా అంతే స్ఫూర్తిదాయకం. ఇంటర్నెట్‌లో చూడండి. ఆయన జీవితమే ఒక పాఠం. ఆయన్నుంచి యువత నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది’ అని ముగించారు.

మీ ప్రయాణం చెప్పండి.. అన్నా అదే చూపులు

మరో యువతి: మిమ్మల్ని తలవని రోజు, మాట్లాడని రోజు, మీ గురించి రాయని రోజు లేదు. మా కుటుంబ సభ్యులనైనా మరిచిపోయామేమో గానీ, మీ గురించి తలవని రోజు లేదు. మీరు మాకు స్ఫూర్తి. ఎంత గొప్ప అంటే అబ్రహం లింకన్‌, మహాత్మాగాంధీ, అంబేడ్కర్‌ గురించి పుస్తకాల్లో చదివాం. కానీ, మీరు లైవ్‌ ఎగ్జాంపుల్‌. మీరు ఆంధ్రప్రదేశ్‌కు శాశ్వత సీఎంగా ఉండాలి. మీ జీవిత ప్రయాణం ఒకసారి చెప్పండి. యువతతో పంచుకోండి..

సీఎం జగన్‌: ఒక నవ్వు నవ్వేసి మౌనంగా ఉండిపోయారు. (భార్గవరెడ్డి కూడా సమాధానం ఇవ్వలేదు) ముందే సిద్ధమై వచ్చిన ప్రసంగం తప్పితే.. అక్కడ కార్యకర్తల ప్రశ్నలకు సీఎం జగన్‌ సమాధానమే చెప్పలేకపోయారు. వేదికపై తన అసహాయతను మరోమారు బయటపెట్టుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img