icon icon icon
icon icon icon

అంగీకారం.. అభ్యంతరం.. రెండూ ఆయనవే!

‘ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టంపై ఎవరికైనా అభ్యంతరాలుంటే అప్పిలేట్‌ అథారిటీ (జిల్లా జడ్జి స్థాయి అధికారి) దృష్టికి తీసుకెళ్లొచ్చు.

Updated : 05 May 2024 06:52 IST

ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌పై మంత్రి బొత్స వింత సమాధానాలు

ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం: ‘ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టంపై ఎవరికైనా అభ్యంతరాలుంటే అప్పిలేట్‌ అథారిటీ (జిల్లా జడ్జి స్థాయి అధికారి) దృష్టికి తీసుకెళ్లొచ్చు. వారి ఉత్తర్వులపైనా అభ్యంతరాలుంటే హైకోర్టుకు వెళ్లాల్సిందే’ అని మంత్రి బొత్స సత్యనారాయణ అంగీకరించారు. సమగ్ర భూ సర్వే పూర్తయిన గ్రామాల్లో ప్రజాభిప్రాయం సేకరించి చట్టాన్ని అమల్లోకి తీసుకొస్తామన్నారు. శనివారం వైకాపా విశాఖ పార్లమెంటు ఎన్నికల కార్యాలయంలో బొత్స మాట్లాడారు. అమరావతిలో ఉన్న హైకోర్టుకు వెళ్లడానికి సామాన్య ప్రజలకు ఇబ్బంది కాదా? అని విలేకర్లు అడిగిన ప్రశ్నకు ‘హైకోర్టుకు ఎవరు వెళ్లమన్నారు..? మేం వెళ్లమని చెప్పామా?’ అంటూ అసహనం వ్యక్తం చేశారు. ‘జిల్లా జడ్జి స్థాయి అధికారి ఉత్తర్వులు ఇచ్చి, రూలింగ్‌ ఇచ్చిన తర్వాత హైకోర్టుకు తప్ప కింది కోర్టుకు వెళ్లడానికి అవకాశం లేదు. కింది కోర్టుల పరిధి తీసేశాం. ఈ విషయమై న్యాయవాదులు విజ్ఞప్తి చేయడంతో పరిశీలిస్తామని చెప్పాం’ అని అన్నారు. ‘గిట్టని వ్యక్తులు చేసిన క్లెయిమ్‌ల వల్ల స్థలం డిస్ప్యూట్‌ రిజిస్ట్రర్‌లో చేరితే సామాన్య ప్రజలు హైకోర్టు చుట్టూ తిరగలేరుగా..’ అని ప్రశ్నించగా.. మీరు చెప్పింది నిజమేనంటూ అంగీకరించారు. ఆ వెంటనే ‘అలా తిరగకుండా ఉండటానికే చట్టం తీసుకొస్తున్నాం’ అని బదులిచ్చారు. ‘ఈ చట్టం గురించి ఏమైనా సందేహాలుంటే అడగండి.. సమాధానాలు చెబుతా’ అంటూనే మంత్రి.. పాత్రికేయులకు ఎదురు ప్రశ్నలు వేశారు. పైగా పట్టాదారు పాసు పుస్తకాలపై జగన్‌ ఫొటో వేస్తే తప్పేంటంటూ సమర్థించుకున్నారు.

అవి జిరాక్స్‌ కాపీలు కావట..

రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్లు జిరాక్స్‌ కాపీలు ఇస్తారని ఆందోళన చెందుతున్నారని మంత్రి దృష్టికి తీసుకెళ్లగా ‘అన్నం తినే వారెవరైనా డాక్యుమెంట్లకు సంబంధించి జిరాక్స్‌ కాపీలు ఇస్తారా? ప్రజలు అమాయకులు అనుకుంటున్నారా?’ అంటూ ఎదురు ప్రశ్నించారు. స్థిరాస్తులు కొనుగోలు చేసిన వారికి ఒరిజినల్‌ దస్తావేజులు కాకుండా అన్ని వివరాలను ప్రింట్‌ తీసి ఇస్తే.. వాటిని జిరాక్స్‌ కాకుండా ఏమనాలో ఆయనే చెప్పాలి. పట్టాదారు పాసుపుస్తకాలపై జగన్‌ ఫొటో వేస్తే తప్పేంటంటూ సమర్థించుకున్నారు. సమగ్ర సర్వేలో భూ విస్తీర్ణం తగ్గిన రైతుల ఆవేదన గురించి ప్రశ్నిస్తే.. ‘కొన్ని చోట్ల దస్తావేజులు, వాస్తవానికి విస్తీర్ణం తేడా ఉంది. తగ్గిపోయిందంటే ఆ భూములను పిల్లి ఎత్తుకెళ్లిపోయిందా’ అంటూ ఎద్దేవా చేశారు. ఈ వివాదాలపై రైతులు అధికారుల చుట్టూ తిరుగుతున్నారంటే.. ‘సమగ్ర సర్వే వద్దా చెప్పండ’ంటూ దాటవేసే ప్రయత్నం చేశారు.

కొన్నది 2.5 ఎకరాలే..: విద్యుత్తు ఛార్జీలను 8 సార్లు పెంచారని అడగ్గా.. ఛార్జీలు పెంపు వాస్తమేనని, ఎన్ని సార్లు పెంచారు, ఆ తేదీలు గుర్తు లేవని బదులిచ్చారు. ‘తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలోని భూములను మూడో రిజిస్ట్రేషన్‌ కింద మా కుమారుడు సందీప్‌ కొనుగోలు చేశారు. ఆ సర్వే నంబరులో మొత్తం 31 ఎకరాలుంటే.. మేం కొన్నది 2.50 ఎకరాలే. దీనిపై అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారు’ అని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img