icon icon icon
icon icon icon

జగన్‌ పాలనంతా బూతులు.. గోతులే

‘ఆడబిడ్డలకు పెళ్లిళ్లు చేసి పసుపు కుంకుమ కింద ఇచ్చే పొలాలకు జిరాక్స్‌ పత్రాలు ఇస్తామా? వాటికి విలువ ఉంటుందా? అందుకే వైకాపా ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్‌ గ్రాబింగ్‌ యాక్ట్‌ను వ్యతిరేకించాలని కోరుతున్నా.

Published : 05 May 2024 06:48 IST

అది ల్యాండ్‌ గ్రాబింగ్‌ యాక్ట్‌
దాడులు, దోపిడీలు మాత్రమే చేసే డబుల్‌ డి ప్రభుత్వం ఇది
రైతుల కష్టాలు జగన్‌కు  తెలియదు
రేపల్లె, గుడివాడ, అవనిగడ్డ సభల్లో పవన్‌కల్యాణ్‌ ధ్వజం

ఈనాడు, బాపట్ల: ‘ఆడబిడ్డలకు పెళ్లిళ్లు చేసి పసుపు కుంకుమ కింద ఇచ్చే పొలాలకు జిరాక్స్‌ పత్రాలు ఇస్తామా? వాటికి విలువ ఉంటుందా? అందుకే వైకాపా ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్‌ గ్రాబింగ్‌ యాక్ట్‌ను వ్యతిరేకించాలని కోరుతున్నా. దీన్ని తెలివిగా జగన్‌ తీసుకొస్తున్నారు. అదేమంటే కేంద్రం తెచ్చిందని చెబుతున్నారు. అలా అని అడ్డగోలుగా ప్రజలకు చెప్పకుండా రుద్దేస్తారా.. జగన్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ దెబ్బకు మీ భూములు మీకు కాకుండా పోతాయి. ప్రభుత్వ ఆస్తులనే విచ్చలవిడిగా బ్యాంకుల్లో తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకున్న జగన్‌కు మన ఆస్తులు ఒక లెక్కా’ అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ నిప్పులు చెరిగారు. ఈ ఐదేళ్ల పాలనలో గోతులు.. బూతులు తప్ప ఇంకేం లేవన్నారు. శనివారం బాపట్ల జిల్లా రేపల్లె, కృష్ణా జిల్లా గుడివాడ, అవనిగడ్డల్లో నిర్వహించిన వారాహి విజయ భేరి బహిరంగ సభల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. ‘అసలు జగన్‌ను ఎలా నమ్ముతాం. ఇప్పటికే విశాఖలోనే రూ.25 వేల కోట్ల విలువగల ప్రభుత్వ ఆస్తులను తనఖా పెట్టారు. ఆయన ఎంత ప్రమాదకరమైన వ్యక్తో ప్రతి ఒక్కరూ గుర్తెరగాలి. దీన్ని దృష్టిలో పెట్టుకుని వైకాపాను ఓడించాలి. ఆ పార్టీకి ఓటేస్తే కొరివితో తల గోక్కున్నట్లే అని గుర్తించాలి’ అని అన్నారు. ముఖ్యమంత్రి పీఠం కూటమిదేనని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ధీమా వ్యక్తం చేశారు. ‘రైతుల కష్టాలు ఎలా ఉంటాయో జగన్‌కు తెలియదు. రైతుల భూములను లాగేసుకోవడం, పచ్చని చెట్లను నరికేయడమే ఆయనకు తెలుసు. భూమిలో గుప్పెడు గింజలు వేసి పంట తీయడం జగన్‌కు తెలియదు. కానీ భూమి లోపల ఉన్న ఖనిజాలను తీసి వాటిని దోచేయడం తెలుసు’ అని విరుచుకుపడ్డారు. ‘అడ్డగోలుగా మట్టి తవ్వేవారు చివరకు మట్టిలోనే కలిసిపోతారు. కూల్చేవాడు ఉంటే కట్టేవారు కూడా ఉంటారనేది వైకాపా నాయకులు గుర్తుపెట్టుకోవాలి’ అని పవన్‌కల్యాణ్‌ హెచ్చరించారు.

బూతులకు పన్నులు వేస్తే...

రాష్ట్రంలో వైకాపా నేతల దాడులు, బూతులకు పన్నులు వేస్తే వచ్చే ఆదాయంతో ప్రభుత్వానికి నిధుల కొరత పూర్తిగా తీరిపోతుందని పవన్‌ ఎద్దేవా చేశారు. ఈ ఐదేళ్ల పాలనలో గోతులు.. బూతులు తప్ప ఇంకేం లేవన్నారు. ‘వాళ్ల తాత కాలం నుంచి ప్రజల ఆస్తులను దోచుకోవడానికి జగన్‌ అలవాటుపడ్డారు. ఎవరైనా నిలదీస్తే బూతులు.. దాడులు చేస్తారు. బ్లేడ్‌ బ్యాచ్‌ను కూడా మనపైకి ఉసిగొల్పుతున్నారు. ఇళ్లలో ఉన్న మహిళలనూ తిడుతున్నారు. దాడులు, దోపిడీలు మాత్రమే చేసే డబుల్‌ డి ప్రభుత్వం ఇది. చివరికి జగన్‌ వేలు చూపించి బెదిరిస్తూ.. ఓట్లు అడుగుతున్నారు. మన సభలకు స్థలాలు ఇస్తే.. వాళ్ల ఇళ్లను కూలగొడుతున్నారు. మరికొద్ది రోజుల్లో ఈ బెదిరింపులన్నీ శాశ్వతంగా ఆగిపోతాయ్‌’ అని పవన్‌ స్పష్టం చేశారు.

తీర ప్రాంతాన్ని పర్యాటక హబ్‌గా అభివృద్ధి చేస్తాం

‘మడ అడవులను సైతం జగన్‌ ప్రభుత్వం ధ్వంసం చేసి తీర ప్రాంత వాసులకు రక్షణ లేకుండా చేస్తోంది. ఇప్పటికే 1500 ఎకరాల్లో వాటిని ధ్వంసం చేశారు. మేం అధికారంలోకి రాగానే సముద్ర తీర ప్రాంతాన్ని పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దుతాం’ అని జనసేనాని అన్నారు.

చిరంజీవిని జగన్‌ అవమానించారు.

‘నమస్కారం పెడితే ప్రతి నమస్కారం పెట్టకుండా చిరంజీవిని జగన్‌ అగౌరవపరిచారు. ప్రముఖ క్రికెటర్‌ అంబటి రాయుడిని ఇబ్బంది పెట్టారు. జగన్‌కు కావాల్సింది బానిసలు. ఆత్మగౌరవం కోరుకునేవారు కాదు’ అని పేర్కొన్నారు.

జగన్‌కేం తెలుసు తెలుగు మాధుర్యం..

కాపీలు కొట్టి పాసయ్యే జగన్‌కు.. తెలుగు భాషలో ఉన్న మాధుర్యం, గొప్పతనం ఏం తెలుస్తాయని పవన్‌ ఎద్దేవా చేశారు. ‘మేం మాతృభాషను మరచిపోవద్దని కోరుతుంటే.. ఆంగ్లం వద్దంటున్నామని జగన్‌ విష ప్రచారం చేస్తున్నారు. అసలు చదువుకుంటే కదా.. మేం ఏం చెబుతున్నామో అర్థం కావడానికి. మన భాషే లేకపోతే.. గుర్రం జాషువా, విశ్వనాథ సత్యనారాయణ లాంటి మహనీయుల రచనలు భవిష్యత్తు తరాలకు ఎలా అర్థమవుతాయి. మన చరిత్ర ఎలా తెలుస్తుంది. తెలుగును మనం రక్షించుకోకపోతే.. ఆంగ్లేయులు కాపాడతారా?. వైకాపా వాళ్లకు బూతులు తిట్టడానికేనా తెలుగు. మాతృభాష మాధుర్యం అర్థమవ్వని వ్యక్తి.. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి’ అని పవన్‌ మండిపడ్డారు.

ఈ అవకాశం చేజార్చుకోవద్దు..

వైకాపా నాయకుల అరాచకాలు తవ్వేకొద్దీ వెలుగుచూస్తూనే ఉన్నాయని పవన్‌ తెలిపారు. ఈ ఎన్నికల్లో వారికి భయపడకుండా ముందుకొచ్చి ఓట్లేయాలన్నారు. ఈ ఒక్క అవకాశం ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు.. ఎవరూ వదులుకోవద్దని విజ్ఞప్తి చేశారు.

మండుటెండలో పోటెత్తారు...

గుడివాడ సభ మధ్యాహ్నం ఒంటిగంటకు విపరీతమైన ఎండలో జరిగింది. అయినా.. పవన్‌ కోసం జనసైనికులు, తెదేపా, భాజపా శ్రేణులు పోటెత్తారు. ప్రసంగిస్తున్న సమయంలోనూ ప్రతి మాటకూ ఈలలు, చప్పట్లతో మోత మోగించారు. అవనిగడ్డలో సభ జరిగిన రాజీవ్‌గాంధీ చౌక్‌ కూడా.. కూటమి శ్రేణులతో కిక్కిరిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img