icon icon icon
icon icon icon

ప్రతి రంగంలోనూ మార్పులు తెచ్చాం

‘ఎన్నడూ లేని విధంగా ఈ 59 నెలల్లో రాష్ట్రంలోని ప్రతి రంగంలోనూ విప్లవాత్మక మార్పులు తెచ్చాం. 2.31 లక్షల ఉద్యోగాలిచ్చాం. రూ.2.70 లక్షల కోట్లను అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేశాం.

Published : 05 May 2024 06:48 IST

2.31 లక్షల ఉద్యోగాలిచ్చాం
చంద్రబాబు సూపర్‌ సిక్స్‌ను నమ్మొద్దు
విలువలు, విశ్వసనీయతకు ఓటేయండి
హిందూపురం, పలమనేరు, నెల్లూరు సభల్లో సీఎం జగన్‌

ఈనాడు, చిత్తూరు, నెల్లూరు - ఈనాడు డిజిటల్‌, అనంతపురం: ‘ఎన్నడూ లేని విధంగా ఈ 59 నెలల్లో రాష్ట్రంలోని ప్రతి రంగంలోనూ విప్లవాత్మక మార్పులు తెచ్చాం. 2.31 లక్షల ఉద్యోగాలిచ్చాం. రూ.2.70 లక్షల కోట్లను అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేశాం. మ్యానిఫెస్టోలో చెప్పిన వాటిలో 99 శాతం అమలు చేశాం’ అని సీఎం జగన్‌ చెప్పారు. ‘2014లో చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఒక్కదాన్నీ అమలు చేయలేదు. అలాంటి వ్యక్తిని నమ్మగలమా? ఇప్పుడేమో సూపర్‌ సిక్స్‌ అంటున్నారు’ అని విమర్శించారు. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం, చిత్తూరు జిల్లా పలమనేరు, నెల్లూరు జిల్లా నెల్లూరు నగరంలో శనివారం నిర్వహించిన ప్రచార సభల్లో సీఎం మాట్లాడారు. రాబోయే ఎన్నికలు ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునేవి మాత్రమే కావని.. ఐదేళ్ల భవిష్యత్తును నిర్ణయించేవని, పథకాలను కొనసాగించేవని జగన్‌ చెప్పారు. విలువలు, విశ్వసనీయత ఉన్న పార్టీకి ఓటేయాలని పిలుపునిచ్చారు. తెదేపాకు వేసే ఓటు.. సంక్షేమ పథకాలకు ముగింపు పలుకుతుందన్నారు. ‘అవ్వాతాతలకు ఇంటింటికీ వచ్చే పింఛన్‌ను అడ్డుకున్నది వారే. నా మీద నెపం వేస్తున్నారు. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌పై దుష్ప్రచారం చేస్తున్నారు’ అని అన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు పేరు చెబితే.. గుర్తుకొచ్చే పథకం ఒక్కటీలేదని, ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని శపథం చేస్తున్న భాజపాతో ఆయన జతకట్టారని విమర్శించారు.

డబ్బు... కర్ణాటక మద్యం పంపిణీ

జగన్‌ సభలకు వచ్చిన ఒక్కొక్కరికి రూ.300 నుంచి రూ.500 వరకు పంపిణీ చేశారు. జెండాలు మోసే పురుషులకు మద్యం సీసాలు, కర్ణాటక టెట్రా ప్యాకెట్ల మద్యాన్ని ఇచ్చారు. బస్సుల్లోనే బిర్యానీ ప్యాకెట్లు అందించారు. సభల్లో జగన్‌ మాట్లాడుతున్నప్పుడు కేకలు వేస్తూ స్పందించడానికి ప్రత్యేకంగా కొంతమంది యువకుల్ని ఏర్పాటు చేశారు. హిందూపురంలో జగన్‌ ప్రచార సభకు స్థానిక వైకాపా నాయకులు.. హిందూపురంతోపాటు పెనుకొండ, మడకశిర నియోజకవర్గాల నుంచి జనాన్ని తీసుకొచ్చారు. పక్కనున్న కర్ణాటక నుంచి మద్యాన్ని తెప్పించారు. హిందూపురం నుంచి ప్రత్యేక బస్సుల్ని ఆ రాష్ట్రంలోని గౌరీబిధనూరుకు పంపించి అక్కడి జనాన్ని తరలించారు. సభ కోసం హిందూపురాన్ని అష్ట దిగ్బంధనం చేశారు. పెనుకొండ నుంచి వచ్చే వాహనాలను 5 కిలోమీటర్ల అవతలే ఆపేశారు. పట్టణంలోని జిల్లా ఆసుపత్రికి వెళ్లే రెండు దారులనూ మూసివేయడంతో రోగులు చుట్టూ తిరిగి వెళ్లాల్సి వచ్చింది. పలమనేరు సభలో మందుబాబులు చిందులు తొక్కారు. సీఎం మాట్లాడటం మొదలుపెట్టగానే కొందరు గుంపులు గుంపులుగా వెనుదిరిగారు. ఆర్టీసీ బస్సులను పలమనేరులోకి రానివ్వక పోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పట్టణంలో ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టడంతో వాహనదారులకు అవస్థలు తప్పలేదు. జగన్‌ పర్యటన కారణంగా విధించిన ఆంక్షల వల్ల నెల్లూరు నగరం స్తంభించింది. ప్రధాన కూడలిలో సభ ఏర్పాటు చేయడంతో.. రాకపోకలు నిలిపివేశారు. దీంతో స్థానికులు ఇక్కట్లకు గురయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img