icon icon icon
icon icon icon

Pawan Kalyan: మూడు కబ్జాలు.. ఆరు సెటిల్‌మెంట్లు.. ఇదీ వైకాపా పాలన: పవన్‌ కల్యాణ్‌

వైకాపా పాలన మూడు కబ్జాలు.. ఆరు సెటిల్మెంట్‌లుగా ఉందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ అన్నారు. 

Updated : 05 May 2024 20:12 IST

తుని: వైకాపా పాలన మూడు కబ్జాలు.. ఆరు సెటిల్మెంట్‌లుగా ఉందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ అన్నారు. కాకినాడ జిల్లా తునిలో నిర్వహించిన వారాహి విజయభేరి సభలో ఆయన ప్రసంగించారు. వైకాపా వ్యతిరేక ఓటు చీలకూడదనే కూటమిగా వస్తున్నామని, రాష్ట్రంలో కూటమి అభ్యర్థుల్ని ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే ఉద్యోగులకు భద్రత కల్పిస్తామని  హామీ ఇచ్చారు.

‘‘ మ్యానిఫెస్టోలో పేర్కొన్నట్లుగా ఏడాదికి 4 లక్షల చొప్పున ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. నిరుద్యోగభృతి కింద నెలకు రూ.3 వేల ఆర్థిక సాయం చేస్తాం. కాలుష్య రహిత పరిశ్రమలు స్థాపిస్తాం. తుని నుంచి విశాఖకు లోకల్‌ రైలు సదుపాయం కల్పిస్తాం. తునిలోని వంద చెరువుల్లో వైకాపా ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా మట్టి తవ్వేశారు. జర్నలిస్టులుపైనా దాడులు చేశారు. ఓ విలేకరిని చంపేశారు. అన్యాయానికి పాల్పడితే సహించేది లేదు. జర్నలిస్టులకు అండగా ఉంటాం. తుని మార్కెట్‌ యార్డులో మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. కోర్టులు చెబుతున్నా వినిపించుకోకుండా తాండవ నదిలో అక్రమ తవ్వకాలు జరిపి వైకాపా పెద్దలు ఇసుక అమ్ముకున్నారు. తునిలో హేచరీస్‌ పెట్టాలంటే రూ.10 లక్షలు డిమాండ్‌ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రూపాయి ఖర్చుకాకుండా హేచరీస్‌కు అనుమతిస్తాం’’ అని పవన్‌ భరోసా ఇచ్చారు.

కూటమి ప్రభుత్వ ఏర్పాటు ఇప్పటికే ఖాయమైందని, మెజార్టీ కోసమే మనమంతా కలిసి పని చేయాలని పవన్‌ పిలుపునిచ్చారు. వైకాపా నేత ముద్రగడ పద్మనాభం గురించి ప్రస్తావిస్తూ.. ఆయనకు కుమార్తె ఉందన్న సంగతే తెలియదని అన్నారు. ముద్రగడ ఇంట్లో గొడవలు పెట్టాలనుకోవట్లేదని వ్యాఖ్యానించారు. ముద్రగడ, ఆయన కుమార్తె క్రాంతిని మళ్లీ కలుపుతానన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆమెను జనసేన నుంచి నిలబెడతానని చెప్పారు. వైకాపా అవినీతి కోటలు బద్దలు కొడుతున్నామని, భవిష్యత్‌ అంతా మనదేనని పవన్‌ ధీమా వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img