icon icon icon
icon icon icon

రాజశేఖరరెడ్డికి వారెలా వారసులు?: జగన్‌

వైఎస్‌ రాజశేఖరరెడ్డి, జగన్‌పై లేనిపోని ముద్రలు వేసి దెబ్బతీయడానికి చంద్రబాబు, వదినమ్మ, దత్తపుత్రుడు ప్రయత్నిస్తున్నారని సీఎం జగన్‌ విమర్శించారు.

Published : 26 Apr 2024 03:32 IST

ఈనాడు, కడప: వైఎస్‌ రాజశేఖరరెడ్డి, జగన్‌పై లేనిపోని ముద్రలు వేసి దెబ్బతీయడానికి చంద్రబాబు, వదినమ్మ, దత్తపుత్రుడు ప్రయత్నిస్తున్నారని సీఎం జగన్‌ విమర్శించారు. ఈమధ్య కొత్తగా రాజశేఖరరెడ్డి వారసులమని.. వారి కుట్రలో భాగంగా ప్రజల మధ్యకు వస్తున్నారని పరోక్షంగా షర్మిలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రాజశేఖరరెడ్డి కుటుంబాన్ని లక్ష్యంగా చేసింది ఎవరు? నాన్నగారిపై కక్షతో, కుట్రతో ఆయనపై కేసులు పెట్టిందెవరు? ఆ కుట్రలు చేసిన పార్టీలో చేరినవాళ్లు.. రాజశేఖరరెడ్డి వారసులా? అని ప్రశ్నించారు. ‘నా సొంతగడ్డ.. నా పులివెందుల.. ప్రతీ కష్టంలో పులివెందుల నా వెంట నడిచింది. పులివెందులంటే నమ్మకం.. అభివృద్ధి.. ఒక సక్సెస్‌ స్టోరీ.. మంచి మనసు.. బెదిరింపులకు లొంగకపోవడం మన కల్చర్‌. తెదేపా మాఫియాను నాలుగు దశాబ్దాలుగా ఎదిరించింది పులివెందుల బిడ్డలే. కృష్ణానది నీటిని పులివెందులకు తీసుకొచ్చాం’ అని తెలిపారు. రాజన్న బిడ్డనంటూ షర్మిల ప్రస్తావిస్తున్న నేపథ్యంలో.. జగన్‌ సైతం పదే పదే తన తండ్రి పేరు ప్రస్తావించారు. పులివెందుల ప్రజల దృష్టిని వివేకా హత్యకేసు నుంచి మళ్లించి వివిధ అంశాలపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. దేశంలోని అన్ని వ్యవస్థలనూ తనపై ప్రయోగించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే.. భాజపా కూటమికే లబ్ధి కలుగుతుందని పేర్కొన్నారు. తనమీద ఆరోపణలు చేస్తున్న బంధువులకు వివరణ ఇస్తూ... మాట్లాడారు. ‘మీ బిడ్డ డబ్బులు సంపాదించుకోవడానికి అధికారంలోకి రాలేదు. అధికారంలోకి వచ్చాక... అందరినీ పక్కన పెట్టారని  బంధువులు అంటున్నారు’ అని గుర్తుచేశారు. వివేకానందరెడ్డి హత్యపై ప్రసంగించే సమయంలో మాటలు కొంత తడబడ్డాయి. సొంత నియోజకవర్గం నుంచి జనాన్ని తరలించడానికి మనిషికి రూ.500 వంతున చెల్లించారు. ప్రారంభంలో ఎంపీ అవినాష్‌రెడ్డి ప్రసంగించారు. సభానంతరం రిటర్నింగ్‌ అధికారి దగ్గరికి వెళ్లి నామినేషన్‌ దాఖలుచేసి ప్రమాణపత్రం చదివారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img