icon icon icon
icon icon icon

పవన్‌ను తిట్టించడానికే నాన్నను జగన్‌ వాడుకుంటున్నారు

ఇటీవల వైకాపాలో చేరి,  పవన్‌ కల్యాణ్‌ లక్ష్యంగా విమర్శల దాడి చేస్తున్న మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభానికి.. ఆయన సొంత కుమార్తె బార్లపూడి క్రాంతి నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది.

Published : 04 May 2024 05:53 IST

పవన్‌ కల్యాణ్‌ విజయానికి కృషి చేస్తా 
ముద్రగడ కుమార్తె క్రాంతి వీడియో సందేశం

ఈనాడు-రాజమహేంద్రవరం, న్యూస్‌టుడే-పిఠాపురం: ఇటీవల వైకాపాలో చేరి,  పవన్‌ కల్యాణ్‌ లక్ష్యంగా విమర్శల దాడి చేస్తున్న మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభానికి.. ఆయన సొంత కుమార్తె బార్లపూడి క్రాంతి నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. ఆయన రాజకీయ నిర్ణయంతో విభేదిస్తూ కుమార్తె క్రాంతి ఓ వీడియో సందేశం విడుదల చేశారు. ‘‘పిఠాపురంలో పవన్‌కల్యాణ్‌ను ఓడించడానికి వైకాపా నాయకులు ఎన్ని చేయాలో అన్నీ చేస్తున్నారు. ముఖ్యంగా మా నాన్న బాధాకరమైన ఛాలెంజ్‌ చేశారు. పవన్‌ కల్యాణ్‌ను ఓడించకపోతే ఆయన పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటారట. ఈ విధానం ఏంటో నాకు అస్సలు అర్థం కాలేదు. ఆ ప్రకటన ముద్రగడ అభిమానులకు సైతం నచ్చలేదు. వంగా గీతను గెలిపించడానికి కష్టపడొచ్చు. పవన్‌కల్యాణ్‌ను, ఆయన అభిమానులను కించపరిచేలా వ్యాఖ్యలు ఉండకూడదు. మా నాన్నను కేవలం పవన్‌కల్యాణ్‌ను తిట్టడానికే సీఎం జగన్‌ వాడుతున్నారు. ఎన్నికల తర్వాత ఆయన్ను ఎటూ కాకుండా వదిలేయడం పక్కా. ఈ విషయంలో మా నాన్న నిర్ణయాన్ని నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నా. పవన్‌ విజయానికి నా వంతు కృషి చేస్తా’’ అని క్రాంతి స్పష్టం చేశారు. తన కోడలి సందేశాన్ని ఆమె మామ బార్లపూడి రవికుమార్‌ సైతం ధ్రువీకరించారు.


నా కుటుంబంలో చిచ్చు పెట్టినా భయపడను: ముద్రగడ

‘నా కుటుంబంలో చిచ్చు ఎవరు పెట్టించారో, పెట్టారో తెలియదు గానీ నేనైతే భయపడటం లేదు, బాధపడటం లేదు’ అని మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం అన్నారు. పిఠాపురంలోని వైకాపా కార్యాలయంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘నా కుమార్తె మామ 2008 నుంచి పీఆర్పీలో ఉన్నారు. గుర్తు కోసం కోర్టుకు, ఈసీకి వెళ్లింది ఆయనే. అప్పట్నుంచి ఆ కుటుంబానికి, మాకు సంబంధాలు అంతంత మాత్రం. సీఎం జగన్‌ నన్ను వాడుకుని వదిలేస్తారని నా కుమార్తెతో చెప్పించారు. పెళ్లి కానంతవరకే నా కుమార్తె నా ప్రాపర్టీ. పెళ్లయిన తర్వాత అత్తవారి ప్రాపర్టీ. వాళ్లు నాపై దుష్ప్రచారం చేయించారు. నేను జగన్‌కు సేవకుడిగా ఉంటా. ఎవరు బెదిరించినా బెదరను. కుమార్తె, వియ్యంకుడి చేత తిట్టించినా లెక్కచేయను. పదవీకాంక్ష లేకుండా జగన్‌ ఆహ్వానం మేరకు వెళ్లా. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజాసేవ చేసే అవకాశం ఇస్తే తీసుకుంటా. అదీ వారంతట వారు ఇస్తేనే..’’ అని ముద్రగడ స్పష్టం చేశారు.

సేవ చేయడానికే ఎన్నుకుంటాం: ‘పేదలకు సేవ చేయడానికే మనం ప్రతినిధులను ఎన్నుకుంటాం. షూటింగ్‌ల కోసం ఎన్నుకోము. హైదరాబాద్‌ నుంచి పిఠాపురం వచ్చి, ముఖానికి రంగులు వేసుకుని ఎమ్మెల్యేని చేసేయాలని అడుగుతున్నారు’ అని పవన్‌ కల్యాణ్‌ను ఉద్దేశించి విమర్శించారు. ఉద్రేకం, ఆవేశం, కోపం చూపిస్తూ రకరకాల బూతులతో జగన్‌ను, ఇతర నాయకులను తిట్టిపోయడం ఎంతవరకు న్యాయమని ముద్రగడ ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img