icon icon icon
icon icon icon

విద్యా వ్యవస్థను తీర్చిదిద్దాం

‘వైకాపా పాలనలో విద్యావ్యవస్థ రూపురేఖలు మార్చాం. నాడు-నేడు ద్వారా పాఠశాలలను అభివృద్ధి చేశాం. పిల్లలు బడికి వెళితే చాలు.. విద్యాకానుక, అమ్మఒడి ద్వారా వారికి చేయూతగా నిలిచాం.

Updated : 04 May 2024 06:42 IST

చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో చేసిందేమీ లేదు
నరసాపురం సభలో సీఎం జగన్‌
2.15 గంటల ఆలస్యంగా వచ్చిన సీఎం
మండుటెండలో ప్రజల అవస్థలు

ఈనాడు, భీమవరం, ఈనాడు డిజిటల్‌, నరసరావుపేట, కనిగిరి, న్యూస్‌టుడే: : ‘వైకాపా పాలనలో విద్యావ్యవస్థ రూపురేఖలు మార్చాం. నాడు-నేడు ద్వారా పాఠశాలలను అభివృద్ధి చేశాం. పిల్లలు బడికి వెళితే చాలు.. విద్యాకానుక, అమ్మఒడి ద్వారా వారికి చేయూతగా నిలిచాం. విద్యార్థులకు విద్యాదీవెన, వసతి దీవెన ఇచ్చి బాసటగా నిలిచాం. బైజ్యూస్‌ కంటెంట్‌, డిజిటల్‌ బోధన, ట్యాబ్‌లు ఇచ్చి విద్యారంగాన్ని అభివృద్ధి చేశాం. మూడు సార్లు, 14 ఏళ్లు చంద్రబాబు ముఖ్యమంత్రిగా పని చేసి పేదలకు చేసిన ఒక్క మేలు కూడా లేదు. వారి కోసం ప్రవేశపెట్టిన ఒక్క పథకమూ గుర్తు రాదు’ అని సీఎం జగన్‌ విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం, పల్నాడు జిల్లా క్రోసూరు, ప్రకాశం జిల్లా కనిగిరిలో శుక్రవారం నిర్వహించిన ‘జగన్‌ కోసం సిద్ధం’ సభల్లో ఆయన ప్రసంగించారు. మరో పదిరోజుల్లో కురుక్షేత్ర యుద్ధం జరగబోతోందని, ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునేవే కావని, మీ ఇంటి భవిష్యత్తును నిర్ణయించేవని ఆయన అన్నారు.  ఈ ఎన్నికల కురుక్షేత్రంలో చంద్రబాబు తన బాణాన్ని నేరుగా పేద వర్గాలు, నా అవ్వాతాతలు, వారి పింఛన్ల మీద గురిపెట్టారని విమర్శించారు. చంద్రబాబు సాధ్యంకాని హామీలతో ఇచ్చిన మ్యానిఫెస్టోకు అర్థం లేదన్నారు. ఈ అయిదేళ్లలో కూడా ప్రతిఒక్క రంగంలోనూ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామన్నారు. చంద్రబాబు మ్యానిఫెస్టో అంతా మోసాలపుట్ట అని వీటిని ఎలా నెరవేరుస్తారని ప్రశ్నించారు. ఈసారి సూపర్‌ సిక్స్‌ అని, సూపర్‌ సెవెన్‌ అని అంటున్నారు నమ్ముతారా అని ప్రశ్నించారు. అసెంబ్లీ స్థానాలు 175కు 175, ఎంపీ స్థానాలు 25కు 25 రావాలన్నారు. ‘ఆడబిడ్డలకు చేయూత, ఆసరా, సున్నావడ్డీ రుణాలతో పాటు 32 లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశాం. రైతులకు రైతుభరోసా, 9 గంటలు పగటిపూట విద్యుత్తు, ఆర్బీకేల ద్వారా ధాన్యం కొనుగోళ్లు చేస్తూ అండగా నిలిచాం. రూ.25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ వర్తించేలా చేసి పథకం ద్వారా చికిత్స పొందిన వారికి ఆరోగ్య ఆసరా అందిస్తున్నాం. ఆరోగ్య సురక్ష, ఫ్యామిలీ డాక్టర్‌ తదితర సేవలు అందిస్తున్నాం. సచివాలయాల ద్వారా 600 రకాల సేవలు అందిస్తున్నాం’ అని సీఎం జగన్‌ తెలిపారు. ‘మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎవరితో ప్రమేయం లేకుండా నేరుగా మీ ఖాతాల్లో పథకాల సొమ్మును జమ చేస్తున్నాం. అవ్వాతాతలకు 3 వేల పింఛన్‌ అందించి చరిత్ర సృష్టించాం’ అని జగన్‌ వివరించారు.

దుకాణాలు మూసివేత..డివైడర్‌ తొలగింపు

నరసాపురంలో సభ కోసం ఆ రహదారిలోని దుకాణాలను పోలీసులు ఉదయం నుంచే మూయించారు. డివైడర్‌ను అడ్డగోలుగా కొట్టేశారు. డివైడర్‌ మీద ఉన్న విద్యుత్తు స్తంభాన్ని తొలగించేశారు. బ్యారికేడ్లు అడ్డుగాపెట్టి వాహనాల రాకపోకలను నిరోధించారు. నియమావళి ఉన్నా భారీ ప్లెక్సీలను ఏర్పాటుచేశారు.

అసలే ఎండ.. ఆపై ఆలస్యం

నరసాపురం సభ కోసం ఉదయం 8 గంటలకే జనాలను తీసుకొచ్చారు. ఒక్కొక్కరికి రూ.200 చొప్పున ఇచ్చి ఆటోల్లో తరలించారు. ఉదయం పది గంటల్లోగా సభా ప్రాంగణానికి రావాల్సిన జగన్‌ మధ్యాహ్నం 12.15కి ప్రచార వాహనంపైకి రావడంతో ఎండకు జనాలు అల్లాడిపోయారు. నిలబడలేక జగన్‌ రాక ముందే వందల సంఖ్యలో జనం వెనుదిరిగారు. కొందరు దుకాణాల నీడన తలదాచుకున్నారు. పోలీసులు తమ విధులను విస్మరించి వచ్చిన వారికి మజ్జిగ, నీటి ప్యాకెట్లు పంపిణీ చేస్తూ వైకాపా సేవలో తరించారు. సభ నేపథ్యంలో నరసాపురం బస్టాండ్‌ సమీపంలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

మండుటెండలో క్రోసూరులో జనం ఇబ్బందులు

క్రోసూరు సభకు జనాన్ని తరలించేందుకు రూ.200 నగదు, రూ.200 పెట్రోల్‌ కూపన్‌, ఒక మద్యం సీసా పంపిణీ చేశారు. కొందరు యువకులు నడిరోడ్డుపై ఒకచేత్తో మద్యం సీసాలు, మరోచేత్తో పార్టీ జెండాలు పట్టుకుని తిరిగారు. సభకు వచ్చే వారిలో పలువురు ఎక్కడికక్కడ మద్యం తాగుతూ కనిపించారు. మధ్యాహ్నం 12.30గంటలకు జగన్‌ రావాల్సి ఉండగా ఆలస్యంగా 2 గంటలకు వచ్చారు. అరగంటలో ప్రసంగించి వెళ్లిపోయారు. జగన్‌ ప్రసంగంలో కొత్తదనం లేదు.

పదేపదే చెప్పిందే చెప్పి..

కనిగిరి సభలో జగన్‌ ప్రసంగమంతా అవ్వాతాతల పింఛన్ల చుట్టూనే సాగింది. పదే పదే తాను చేసిందే గొప్ప అన్నట్లు చెబుతూ సభకు వచ్చిన జనాల చేత బలవంతంగా చేతులు పైకి ఎత్తి చూపాలని మైకు పైకి ఎత్తారు. ఇలా పదే పదే చేతులు ఊపాలని చెప్పడంతో జనం నవ్వుకున్నారు. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లపై, జనసేన గుర్తుపై విమర్శలు చేశారు. అయినా ప్రజల నుంచి స్పందన కనిపించలేదు. సీఎం ప్రసంగం మొత్తంలో ప్రకాశం జిల్లా, కనిగిరి నియోజకవర్గం గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. పాత హామీల గురించి సైతం మాట్లాడకపోగా, కొత్తగా ఒక్క అభివృద్ధి పనినైనా చేస్తానని హామీ ఇవ్వలేదు. జగన్‌ ప్రసంగం చప్పగా సాగడం, పాత మాటలే చెప్పడంతో జనం నుంచి స్పందన కరవైంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img