icon icon icon
icon icon icon

‘ఇంటి నుంచే ఓటు’లో వైకాపా చొరబాటు

ఓటు వేసేందుకు పోలింగ్‌ కేంద్రాల వరకు రాలేని దివ్యాంగులు, వృద్థుల కోసం ఎన్నికల కమిషన్‌ చేపట్టిన ‘ఇంటి నుంచే ఓటు’ ప్రక్రియలో వైకాపా నాయకులు చొరబడుతున్నారు.

Published : 04 May 2024 05:56 IST

తెదేపా అభ్యంతరం, అధికారుల నిలదీత

రోలుగుంట, సంగం, న్యూస్‌టుడే: ఓటు వేసేందుకు పోలింగ్‌ కేంద్రాల వరకు రాలేని దివ్యాంగులు, వృద్థుల కోసం ఎన్నికల కమిషన్‌ చేపట్టిన ‘ఇంటి నుంచే ఓటు’ ప్రక్రియలో వైకాపా నాయకులు చొరబడుతున్నారు. అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం నిండుగొండలో శుక్రవారం ఎన్నికల సిబ్బందితోపాటు ఏజెంట్‌గా వైకాపా నాయకుడు, స్థానిక ఎంపీపీ యర్రంశెట్టి శ్రీనివాసరావు పోలింగ్‌ సిబ్బందితో కలిసి వెళ్లారు. ఓ ఇంట్లో వృద్ధురాలు ఓటు వేస్తుండగా శ్రీనివాసరావు వైకాపాకు అనుకూలంగా ఓటు వేయించేందుకు యత్నించారు. దీంతో ఎంపీటీసీ సభ్యుడు రామకృష్ణ, తెదేపా నాయకులు అప్రమత్తమై ఆయనను అడ్డుకున్నారు. ఎంపీపీ ఎందుకొచ్చారని పీఓ విశ్వేశ్వరావును నిలదీయగా.. ఏజెంట్‌గా వచ్చారని ఆయన బదులిచ్చారు. ఎంపీపీకి ఆర్వో జారీ చేసిన పత్రాలను చూడగా వాటిల్లో అధికారుల సంతకాలు లేకపోవడాన్ని తెదేపా నాయకులు గుర్తించారు. ఈ ఘటనపై ఆర్వో చిన్నికృష్ణకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఆయనను వివరణ కోరగా ఘటనపై పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని ఏఆర్వోగా వ్యవహరిస్తున్న బుచ్చెయ్యపేట తహసీల్దారును ఆదేశించినట్లు వెల్లడించారు.

శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోనూ..

శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోనూ ఇంటి నుంచి ఓటు వేసే ప్రక్రియలో వైకాపా నాయకుడు ఓటర్లను మభ్యపెట్టేందుకు ప్రయత్నించారు. సంగం మండలం శ్రీకోలగట్ల గ్రామంలో శుక్రవారం ఇంటి వద్ద ఓటు వేసే ప్రక్రియను అధికారులు నిర్వహించారు. వైకాపాకు చెందిన ఓ మాజీ సర్పంచి పోలింగ్‌ సిబ్బందితో కలిసి ఓటర్ల ఇళ్ల వద్దకు వెళ్లారు. సమాచారం తెలుసుకున్న తెదేపా నాయకుడు ఎ.శ్రీధర్‌.. పోలింగ్‌ సిబ్బంది వద్దకు వెళ్లి ప్రశ్నించారు. ఓటర్లు వైకాపాకు ఓటు వేసేలే ఆయన ప్రలోభ పెడుతున్నారని.. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించడంతో సదరు వైకాపా నాయకుడు అక్కడి నుంచి జారుకున్నారు. ఆత్మకూరు ఆర్డీఓ మధులత ఈ ఘటనపై మాట్లాడుతూ కోలగట్లలో ఒక రాజకీయపార్టీకి చెందిన వ్యక్తి ఓటర్ల ఇళ్లకు వెళ్లింది వాస్తవమేనని, సిబ్బంది గమనించి అక్కడి నుంచి పంపేశారని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img