icon icon icon
icon icon icon

ఆ అధికారుల వైఫల్యం వల్లే హింసాకాండ

రాష్ట్రంలో పోలింగ్‌ రోజు, ఆ తర్వాత పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో చోటుచేసుకున్న హింసాకాండకు ఆ మూడు జిల్లాల ఎస్పీలతో పాటు, పల్నాడు జిల్లా కలెక్టర్‌ వైఫల్యమే కారణమని కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి గురువారం నివేదిక ఇచ్చారు.

Updated : 17 May 2024 06:09 IST

ముగ్గురు ఎస్పీలు, ఒక కలెక్టర్‌పై ఈసీకి సీఎస్‌ నివేదిక
పల్నాడు, అనంతపురం ఎస్పీల సస్పెన్షన్‌కు సిఫారసు
పల్నాడు కలెక్టర్‌, తిరుపతి ఎస్పీలను బదిలీ చేయాలని సూచన
సీఎస్‌ నివేదిక ఆధారంగానే చర్యలు చేపట్టిన ఈసీ

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో పోలింగ్‌ రోజు, ఆ తర్వాత పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో చోటుచేసుకున్న హింసాకాండకు ఆ మూడు జిల్లాల ఎస్పీలతో పాటు, పల్నాడు జిల్లా కలెక్టర్‌ వైఫల్యమే కారణమని కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి గురువారం నివేదిక ఇచ్చారు. వారిలో పల్నాడు ఎస్పీ బిందుమాధవ్‌, అనంతపురం ఎస్పీ అమిత్‌ బర్దర్‌లను సస్పెండ్‌ చేయాలని, పల్నాడు కలెక్టర్‌ లోతేటి శివశంకర్‌, తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్‌ పటేల్‌లను బదిలీ చేయాలని, ఈ నలుగురిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేశారు. రాష్ట్ర డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తా, నిఘా విభాగం అదనపు డీజీ కుమార్‌ విశ్వజిత్‌లతో చర్చించాకే ఆ నివేదిక సమర్పించినట్టు పేర్కొన్నారు. సీఎస్‌ నివేదిక ఆధారంగా ఎన్నికల సంఘం ఆ నలుగురు అధికారులపై వెంటనే చర్యలు చేపట్టింది. సీఎస్‌ నివేదికలోని ముఖ్యాంశాలు ఇవీ..!

హింసను నివారించడంలో వైఫల్యం

పల్నాడు జిల్లాలో పోలింగ్‌ రోజున, అనంతరం హింసాకాండ చెలరేగింది. 15 ఈవీఎంలను ధ్వంసం చేశారు. జిల్లాలో పెద్ద సంఖ్యలో పోలీసుల్ని, భద్రతా సిబ్బందిని మోహరించినా ఆ ఘటనలు జరిగాయి. జిల్లా ఎస్పీ బిందుమాధవ్‌ నేతృత్వంలోని పోలీసు యంత్రాంగం వైఫల్యం అడుగడుగునా కనిపిస్తోంది. ఎస్పీ విధి నిర్వహణలో వృత్తిపరమైన నిబద్ధత కనబరచలేదు. క్షేత్రస్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీచేయడంలో, సమాచారాన్ని పైఅధికారుల దృష్టికి తేవడంలో విఫలమయ్యారు. ఆయనను సస్పెండ్‌ చేసి, కఠినమైన క్రమశిక్షణ చర్యలు చేపట్టాలి.

పల్నాడు జిల్లా కలెక్టర్‌ లోతేటి శివశంకర్‌ పోలీసులు, ఇతర భద్రతా బలగాలతో సమన్వయం చేసుకుని హింసను నివారించడంలో విఫలమయ్యారు. విధి నిర్వహణలో నిజాయతీ, నిబద్ధత కనబరచలేదు. ఎన్నికల ప్రక్రియ ఇంకా మిగిలి ఉన్నందున, ఆయనను కలెక్టర్‌గా కొనసాగించడం సరికాదు. శివశంకర్‌ను బదిలీ చేసి, క్రమశిక్షణ చర్యలు చేపట్టాలి.

హింసాకాండను పసిగట్టలేదు

అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఈ నెల 13, 14 తేదీల్లో హింసాకాండ చెలరేగింది. అక్కడ ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య ఎప్పట్నుంచో శత్రుత్వం ఉంది. ఆ విషయం తెలిసినా శాంతిభద్రతల పరిరక్షణలో ఎస్పీ అమిత్‌బర్దర్‌ విఫలమయ్యారు. ఇరుపక్షాలు అక్కడ రాళ్లగుట్టలు సిద్ధం చేస్తున్నా... గుర్తించడంలో విఫలమయ్యారు. దానివల్లే ఈ నెల 13, 14 తేదీల్లో ఇరుపక్షాలు రాళ్లు విసురుకుని దాడులకు పాల్పడ్డాయి. ఇరువర్గాల కదలికలపై నిఘా ఉంచి, వారు అవాంఛనీయ చర్యలకు పాల్పడకుండా ఎస్పీ నిరోధించలేకపోయారు. జిల్లాలో పారామిలిటరీ దళాలు ఉన్నా రాళ్లదాడి జరిగింది. హింసాకాండను ముందుగా పసిగట్టి, నివారణ చర్యలు చేపట్టడంలో విఫలమైన ఎస్పీ అమిత్‌ బర్దర్‌ని సస్పెండ్‌ చేసి, క్రమశిక్షణ చర్యలు చేపట్టాలి.

తిరుపతిలో నిఘా వైఫల్యం

చంద్రగిరిలో గతంలోనూ ఎన్నికల హింస జరిగింది. అది తెలిసినా ఎస్పీ ముందుజాగ్రత్తలు తీసుకోలేదు. పోలింగ్‌ రోజున వైకాపా అభ్యర్థి వాహనాన్ని తెదేపావాళ్లు తగలబెట్టారు. ఆ గ్రామంలో హింసాకాండ చోటుచేసుకుంది. మర్నాడు తిరుపతిలో తెదేపా అభ్యర్థిపై వైకాపా వర్గీయులు దాడిచేశారు. అభ్యర్థి భద్రతా సిబ్బంది గాల్లోకి రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. వెంటనే రెండు పార్టీలవారు  పెద్దసంఖ్యలో చేరుకుని, పరస్పరం రాళ్లు విసురుకున్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా ఎస్పీ కృష్ణకాంత్‌ పటేల్‌ ముందుజాగ్రత్త చర్యలు తీసుకుని ఉండాల్సింది. 144 సెక్షన్‌ విధించినా పెద్దసంఖ్యలో జనం గుమిగూడారంటే... నిఘావైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. కృష్ణకాంత్‌ పటేల్‌ను బదిలీ చేసి, క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img