icon icon icon
icon icon icon

ఎస్సై, పోలీసులపై వైకాపా మూకల దాడి

వైకాపా మూకల అరాచకానికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ప్రతిపక్ష కార్యకర్తలతో పాటు అడ్డుచెప్పిన పోలీసులను సైతం వదలకుండా దాడులకు తెగబడుతున్నారు.

Published : 17 May 2024 04:11 IST

మూడు గంటల పాటు నిర్బంధం
తెలుగు యువత నాయకుడి కారు ధ్వంసం చేయడాన్ని అడ్డుకున్నారన్న కసి
ఆలస్యంగా వెలుగు చూసిన ఎన్నికల నాటి ఘటన

బొల్లాపల్లి, వినుకొండ, న్యూస్‌టుడే: వైకాపా మూకల అరాచకానికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ప్రతిపక్ష కార్యకర్తలతో పాటు అడ్డుచెప్పిన పోలీసులను సైతం వదలకుండా దాడులకు తెగబడుతున్నారు. పల్నాడు జిల్లాలో ఏకంగా ఓ ఎస్సై, కానిస్టేబుల్‌పై దాడికి తెగించారు. మాకే అడ్డొస్తారా అని మూడు గంటలపాటు వారిని నిర్బంధించారు. ఎస్సై కంటి వద్ద గాయమై నెత్తురు కారుతున్నా కనికరించలేదు. పోలింగ్‌ రోజున జరిగిన ఈ ఘటన మూడు రోజుల అనంతరం వెలుగు చూసింది. బొల్లాపల్లిలో పోలింగ్‌ కేంద్రంలో ఏజెంటు విషయమై తెదేపా, వైకాపా వర్గీయులకు వివాదం రేగింది. ఈ క్రమంలో వైకాపా నేత అచ్చిరెడ్డిపై తెదేపావారు చేయి చేసుకున్నారు. తనపై చేయి చేసుకోవడానికి గంగులపాలేనికి చెందిన తెలుగు యువత నాయకుడు పోకా వెంకట్రావు కారణమని ఆయనపై దాడి చేయాలని అచ్చిరెడ్డి నిర్ణయించుకున్నాడు. పోలింగ్‌ ముగిశాక.. రాత్రి వేళ 200 మంది వైకాపా అల్లరిమూకను పోగేసి కర్రలు, కత్తులతో కాపు కాశారు. వెంకట్రావు బండ్లమోటు నుంచి వస్తుండగా కారుపై దాడి చేశారు. కర్రలతో కొట్టారు. గొడవ జరుగుతోందని తెలిసి పోలీసులు వచ్చారు. ఎస్సై చెన్నకేశవులు ఆపే ప్రయత్నం చేసినా వైకాపా మూక వెనక్కి తగ్గలేదు. తెదేపా వర్గీయులపై దాడులు చేస్తున్న క్రమంలో ఎస్సైను కూడా కర్రలతో కొట్టారు. అంతేకాకుండా ఎస్సై, కానిస్టేబుళ్లను 3 గంటలపాటు నిర్బంధించారు. రక్తమోడుతున్న గాయంతోనే ఎస్సై అలాగే ఉండిపోయారు. కాసేపటికి అల్లరిమూక వెనుదిరగడంతో వెంకట్రావు, పోలీసులు అక్కడి నుంచి తప్పించుకోగలిగారు. ఈ విషయమై పోలీసులను వివరణ కోరగా పూర్తి వివరాలు చెప్పేందుకు ఆసక్తి చూపలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img