icon icon icon
icon icon icon

‘ఈ-ఆఫీస్‌’ అప్‌గ్రేడ్‌ నిలిపివేయండి

గ్రామ, వార్డు సచివాలయాలకు ‘ఈ-ఆఫీస్‌’ను విస్తరించడం, ప్రస్తుతం వాడుకలో ఉన్న వెర్షన్‌ను అప్‌గ్రేడ్‌ చేసే పేరుతో వైకాపా ప్రభుత్వం పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతోందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు.

Published : 17 May 2024 04:13 IST

ఇప్పటికే పలు కీలక రికార్డులు మాయం
ఫైల్స్‌ కాల్చివేయడంపై సీఈఓకు ఫిర్యాదు చేసినా చర్యల్లేవు
వెంటనే అప్‌గ్రేడ్‌ను నిలిపివేయండి
గవర్నర్‌కు తెదేపా అధినేత చంద్రబాబు లేఖ

ఈనాడు డిజిటల్‌, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాలకు ‘ఈ-ఆఫీస్‌’ను విస్తరించడం, ప్రస్తుతం వాడుకలో ఉన్న వెర్షన్‌ను అప్‌గ్రేడ్‌ చేసే పేరుతో వైకాపా ప్రభుత్వం పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతోందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ఇప్పటికే పలు కీలక రికార్డులు మాయమైనట్లు తెలిసిందన్నారు. కొద్ది రోజుల క్రితం నిబంధనలకు విరుద్ధంగా పలు దస్త్రాల్ని సీఐడీ కార్యాలయంలో కాల్చేసిన విషయాన్ని గుర్తుచేశారు. దీనిపై సీఈఓ ముకేశ్‌కుమార్‌ మీనాకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. కొద్ది రోజుల్లో కొత్త ప్రభుత్వం ఏర్పడనున్న తరుణంలో ఇప్పుడు ఇలాంటి చర్యలు అనవసరమని తేల్చిచెప్పారు. వీటిపై చర్యలు తీసుకోవాలని.. కొత్త ప్రభుత్వం ఏర్పడే దాకా అప్‌గ్రేడ్‌ ప్రక్రియను నిలిపివేయాలని కోరుతూ గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌కు గురువారం ఆయన లేఖ రాశారు. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి విడుదల చేసిన జీఓలతోపాటు దస్త్రాలు, నోట్‌ఫైల్స్‌ను భౌతిక, డిజిటల్‌ రూపాల్లో భద్రపరిచేలా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డిని ఆదేశించాలని కోరారు. హెచ్‌ఓడీ, సెక్రటేరియట్‌లోని అన్ని విభాగాల కార్యాలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా చూడాలన్నారు. ‘అప్‌గ్రేడ్‌ ప్రక్రియ వల్ల సీఎంఓ, సీఎస్‌, ప్రభుత్వ విభాగాల సేవలకు సంబంధించి ఈ-ఆఫీస్‌ ఈ నెల 17 నుంచి 25 వరకు అందుబాటులో ఉండదు. అత్యవసరంగా ఇప్పుడు చేపట్టిన ఈ చర్యలపై రాజకీయ పార్టీలతో పాటు, అధికారుల్లోనూ అనుమానాలున్నాయి. అయిదేళ్లుగా ఈ ప్రభుత్వం విడుదల చేసిన అనేక కీలక జీఓల్ని రహస్యంగా ఉంచింది. అడ్డగోలుగా విడుదల చేసిన చీకటి జీఓల్ని, పారదర్శకత లేకపోవడాన్ని ప్రశ్నించిన వారిపై దాడులకు తెగబడింది. ఈ నేపథ్యంలో అప్‌గ్రేడ్‌ పేరుతో ఈ-ఆఫీస్‌ను అందుబాటులో ఉంచకపోవడం సరికాదు’ అని చంద్రబాబు లేఖలో వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img