icon icon icon
icon icon icon

పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో 13 మంది అరెస్టు

తిరుపతి జిల్లా చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం కేసులో 13 మంది నిందితులను గురువారం అరెస్టుచేశారు.

Published : 17 May 2024 04:10 IST

కడప కేంద్ర కారాగారానికి నిందితుల తరలింపు
సూత్రధారులను విస్మరించిన పోలీసులు

తిరుపతి (నేరవిభాగం), న్యూస్‌టుడే: తిరుపతి జిల్లా చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం కేసులో 13 మంది నిందితులను గురువారం అరెస్టుచేశారు. ఈ నెల 14న శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని స్ట్రాంగ్‌రూమ్‌ పరిశీలనకు వచ్చిన ఆయనపై ఎమ్మెల్యే చెవిరెడ్డి అనుచరులు హత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఎన్నికల అనంతర హింసపై కేంద్ర ఎన్నికల సంఘం సీఎస్‌, డీజీపీల నుంచి నేరుగా వివరణ కోరిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రధాన పాత్రధారులైన రామచంద్రాపురం మండలం దిగువరామాపురానికి చెందిన వైకాపా నాయకుడు వల్లేటి భానుకుమార్‌రెడ్డి, నడవలూరు సర్పంచి గణపతిరెడ్డి, దిగువ రామాపురానికి చెందిన ముదిపల్లి జానకిరెడ్డి, జయచంద్రారెడ్డి, పొదలకూరు కోదండమ్‌, బొక్కిసం చిరంజీవి, దండు పుష్పకాంత్‌రెడ్డి, గడ్డకిందపల్లెకు చెందిన భాస్కర్‌రెడ్డి, కామసాని సాంబశివారెడ్డి, తిరుమల బాలాజీనగర్‌కు చెందిన అప్పన్నగిరి సుధాకర్‌రెడ్డి, పసుపులేటి రాము, శెట్టిపల్లి గ్రామానికి చెందిన పి.హరికృష్ణ, కరకంబాడి తారకరామ నగర్‌కు చెందిన గోగుల కోటయ్యను అరెస్టు చేసి మొదటి అదనపు జూనియర్‌ సివిల్‌ కోర్టు ఇన్‌ఛార్జి జడ్జి బి.వాణిశ్రీ ఎదుట హాజరుపరచగా ఈ నెల 29వ తేదీ వరకు రిమాండు విధించారు. పోలీసులు వారిని కడప కేంద్ర కారాగారానికి తరలించారు.

చెవిరెడ్డిపై ఫిర్యాదు చేసినా..: హత్యాయత్నం ఘటనలో సూత్రధారులను పోలీసులు విస్మరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఘటనకు ముందు కీలక నిందితులు స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, చెవిరెడ్డి మోహిత్‌రెడ్డిలతో సమావేశమైనట్లు సమాచారం. వీరి పాత్రపై పులివర్తి నాని ఫిర్యాదుచేసినా ఇప్పటివరకు దర్యాప్తు చేయలేదు. ఎఫ్‌ఐఆర్‌లో పేర్లు లేకపోవడం, పోలీసులు మరికొన్ని రోజులు వేచిచూసే ధోరణి కనబరుస్తుండటంపై ఆరోపణలు వస్తున్నాయి.

నాని గన్‌మన్‌ కాల్పుల్లో ఒకరికి గాయం.. చెన్నైలో చికిత్స

పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం ఘటనలో గన్‌మన్‌ ధరణి జరిపిన కాల్పుల్లో ఒకరు గాయపడినట్లు ఆలస్యంగా వెల్లడైంది. గాయపడిన అతడిని మొదట శ్రీపద్మావతి మహిళా వైద్యశాలకు, తర్వాత చెన్నైలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో స్వీయరక్షణ కోసం నానితోపాటు గన్‌మన్‌ ధరణి కాల్పులు జరిపారు. తొలుత గాల్లోకి కాల్చి.. తర్వాత దాడిచేస్తున్న వారిపై కాల్చారు. ఆ సమయంలో రామచంద్రాపురం మండలం దిగువ రామాపురానికి చెందిన సుధాకర్‌రెడ్డికి బుల్లెట్‌ తగిలింది. ఎడమవైపు కడుపు భాగంలో నుంచి శరీరంలోకి దూసుకెళ్లింది. సహచరులు అతడిని ముందుగా శ్రీపద్మావతి మహిళా వైద్యశాలకు తరలించారు. తర్వాత స్విమ్స్‌కు, బుధవారం అక్కడి నుంచి చెన్నైలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం అక్కడ చికిత్స అందిస్తుండగా ఒకటి రెండురోజుల్లో శరీరంలోని బుల్లెట్‌ తొలగించే శస్త్రచికిత్స చేస్తారని సమాచారం. అయితే, గాయపడిన సుధాకర్‌రెడ్డి వివరాలను తిరుపతి పోలీసులు ఇప్పటివరకు అధికారికంగా వెల్లడించలేదు. దీనిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img