Published : 28 Mar 2020 13:10 IST

కరోనా వల్ల జరిగింది ఇదే!

కొవిడ్‌-19(కరోనా వైరస్‌) మహమ్మారి ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తోంది. వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునే క్రమంలో అంతటా లాక్‌డౌన్‌ ప్రకటించారు. దీంతో పర్యావరణపరంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వైరస్‌ ప్రభావం అధికంగా ఉన్న చైనా, ఇటలీ లాంటి దేశాల్లో వాయు కాలుష్యం గణనీయంగా తగ్గింది. ముఖ్యంగా భారత్‌లోని అత్యంత రద్దీ ప్రాంతమైన ఘజియాబాద్‌, నొయిడా హైవేలో వాహన రాకపోకలు తగ్గడంతో గాలిలో నాణ్యత పెరిగింది.

గాలి కాలుష్యం తగ్గడం

2018లో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఇచ్చిన నివేదిక ప్రకారం.. 15 ఏళ్లలోపు పిల్లల్లో 93శాతం మంది విషపూరితమైన, కలుషితమైన గాలిని పీల్చుకుంటున్నారు. అయితే కరోనా వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచి అనేక దేశాలు లాక్‌డౌన్‌లోకి వెళ్లడంతో కార్లు, ఇతర వాహనాలు తిరగడం గణనీయంగా తగ్గింది. దీంతో చైనాలోని హుబీ ప్రావిన్స్‌లో కాలుష్య స్థాయి పడిపోవడాన్ని నాసా గమనించింది. మహమ్మారి కారణంగా చైనాలో కార్బన్‌డైయాక్సైడ్‌ ఉద్గారాలను పావు శాతం తగ్గినట్లు కార్బన్ బ్రీఫ్ నివేదించింది.

‘ఒక నిర్దిష్ట సంఘటనతో ఇంతటి పెద్ద ప్రదేశంలో గాలి కాలుష్య స్థాయిలు పడిపోవడాన్ని నేను చూడటం ఇదే తొలిసారి’అని నాసా గొడ్దార్డ్ అంతరిక్ష విమాన కేంద్రంలోని ఓ వాయు నాణ్యత పరిశోధకులు తెలిపారు.

‘చైనాలో వాయు కాలుష్యం తగ్గడం వల్ల ఐదు సంవత్సరాలలోపు సుమారు 4,000 మంది పిల్లల ప్రాణాలు రక్షించబడ్డాయి. 70 ఏళ్లు పైబడిన 73,000 మంది ప్రాణాలు నిలబడ్డాయి’ అని పర్యావరణ వనరుల ఆర్థికవేత్త మార్షల్ బుర్కే లెక్కగట్టారు.


విమానాల్లో ప్రయాణం తగ్గింది

విమాన ప్రయాణాలు 13.5శాతం తగ్గినట్లు ఈ నెల 10న ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ కౌన్సిల్‌ తమ నివేదికలో పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా అనేక విమానయాన సంస్థలు తమ సర్వీసులను రద్దు చేయడంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.


ట్రాఫిక్ తగ్గింది

24 గంటలూ మేల్కొని ఉండే న్యూయార్క్ నగరంలో ట్రాఫిక్ 35శాతం పడిపోయింది. కార్బన్ మోనాక్సైడ్ ఉద్గారాలు గణనీయంగా తగ్గాయి. స్పెయిన్‌ రాజధాని మాడ్రిడ్‌లో ఎప్పుడూ అధికంగా ఉండే ట్రాఫిక్‌ 14.3శాతం తగ్గిందని స్పెయిన్‌ డైరెక్టరేట్ జనరల్ ఫర్ ట్రాఫిక్ నివేదికలో వెల్లడైంది. ‘‘ఉత్తర ఇటలీలోని పో వ్యాలీలో నైట్రోజన్‌ డయాక్సైడ్ ఉద్గారాల క్షీణత స్పష్టంగా ఉంది’’ అని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కోపర్నికస్ సెంటినెల్ -5పీ మిషన్ మేనేజర్ క్లాజ్ జెహ్నర్ తెలిపారు. 


తగ్గిన నీటి కాలుష్యం

వెనిస్ కాలువల్లో అనేక వన్యప్రాణులు తిరుగుతున్నట్లు నకిలీ వీడియోలు కనిపించాయి. కానీ వీడియోలో కనిపించినట్లు హంసలు, తిమింగలాలు తిరుగుతున్నట్లు వచ్చిన వార్తలు నకిలీవని తెలుస్తోంది. ఎందుకంటే అక్కడున్న నీరు స్పష్టంగా కనిపిస్తున్న ఫొటోలు ఇంటర్నెట్‌లో కనిపించాయి. పర్యాటకులు లేకపోవడంతో పడవల రాకపోకలు ఆగిపోయాయి. దాంతో నీటి నాణ్యత పెరిగినట్లు తెలుస్తోంది.


జంతువుల ఇక్కట్లు

థాయిలాండ్‌లోని ఫ్రా ప్రాంగ్ సామ్ యోట్ కోతి ఆలయానికి వచ్చే పర్యాటకులు అక్కడి కోతులకి ఆహార పదార్థాలు తినిపించడం అలవాటుగా మారింది. అయితే, ఇప్పుడు అక్కడ పర్యాటకులు తగ్గడంతో వచ్చిన వారిపై అవి ఎక్కువ దూకుడుగా ప్రవర్తిస్తున్నాయి. ‘కోతులకి ఒకసారి ఆహారం ఇవ్వడం అలవాటు చేశాక, అవి మనుషుల మీదే ఆధారపడతాయి. ఒకవేళ ఆహారం ఇవ్వకపోతే ఎక్కువ దూకుడుతనాన్ని ప్రదర్శిస్తాయి’ అని బెంగుళూరుకి చెందిన ఆశోక ట్రస్ట్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఇన్‌ ఎకాలజీ అండ్‌ ఎన్విరాన్మెంట్‌లో పనిచేసే పర్యావరణ శాస్త్రవేత్త అస్మితా సేన్‌గుప్తా తెలిపారు.

జపాన్‌లోని నారా పార్క్‌లోని సికా జింకలకు పర్యాటకులు బియ్యం, ఆహారం తినిపించడానికి.. వాటితో స్వీయచిత్రాలు తీసుకోవడానికి పోటీపడేవారు. కానీ ఇప్పుడు పర్యాటకులు లేరు. దాంతో జంతువులు ఆహారం కోసం వీధుల్లో తిరగడం ప్రారంభించాయి.


వైద్య వ్యర్థాలు

కరోనా వైరస్‌ బాధితులు పెరగడంతో.. వారికి చికిత్స భాగంగా ఉపయోగించి వస్తువులు, పదార్థాలు.. అలాగే రోగులు, వైద్య సిబ్బంది ఉపయోగించే మాస్కులు, గ్లౌజులు కూడా పెరిగాయి. దీంతో వైద్య వ్యర్థాలు విపరీతంగా పెరిగాయి. చైనా వాసులు వాడి పడేసిన ఫేస్ మాస్క్‌లు, వైద్య వ్యర్థాలు టన్నుల కొద్దీ ఉన్నాయి. ఒక్క వుహాన్‌లోనే రోజుకు 200 టన్నుల వైద్య వ్యర్థాలు పోగయ్యయాంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. హాంకాంగ్ సముద్రతీరాల్లో వందలాది మాస్క్‌లు పోగుపడుతున్నాయి.

‘గత ఆరు నుంచి ఎనిమిది వారాలుగా సముద్రంలో భారీ పరిమాణంలో మాస్క్‌లను గుర్తిస్తున్నాం. కరోనా పర్యావరణంపై ప్రభావం ఎలా చూపుతుందో ఇప్పుడు మేం చూస్తున్నాం’అని ఎన్విరాన్‌మెంట్‌ గ్రూప్‌ ఓసెన్స్‌ ఆసియా వ్యవస్థాపకుడు గ్యారీ స్టోక్స్ అన్నారు.

దక్షిణాఫ్రికాలో వాడుతున్న శానిటైజర్లు, క్రిమిసంహారక మందుల వాడకంపై కూడా ఆందోళనలు ఉన్నాయి. ఎందుకంటే వీటిని సరిగా పారేయకపోతే పర్యావరణాన్ని విషపూరితం చేయొచ్చు. అలాగే ఇక్కడ రసాయన ఉత్పత్తులు, ప్లాస్టిక్ సీసాలు లాంటివి ఎక్కడ పడితే అక్కడ పడేయడం వలన అవి నదీ ప్రవాహాల్లో కొట్టుకొచ్చి పల్లపు ప్రదేశాలలో పేరుకుపోతున్నాయి.


ఇంటర్నెట్..  వినియోగం పెరిగింది

కరోనా నియంత్రణలో భాగంగా పలు దేశాలు లాక్‌డౌన్‌ విధించాయి. దీంతో ప్రజలు ఇంట్లోనే ఉండటంతో ఇంటర్నెట్‌ వినియోగం భారీగా పెరుగుతోంది. ఈ నెల 11న ఇంటర్నెట్‌ ప్రపంచ రికార్డు సాధించిందని డీఇ-సీఐఎక్స్‌ నివేదించింది. దీని ప్రకారం... ఫ్రాంక్‌ఫర్ట్ ఇంటర్నెట్ ఎక్స్ఛేంజ్‌లో సెకనుకు 9 టెరాబిట్‌లకు పైగా డేటాను వాడుతున్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా అత్యధిక డేటా వినియోగం అని ఇంటర్నెట్ ఎక్స్ఛేంజ్ చెబుతోంది. ఇంటర్నెట్ ప్రొవైడర్లకు డిమాండు పెరిగింది. ఉదాహరణకు, యూరప్‌లో ఇంటర్నెట్ వాడకం 50శాతం పెరిగినట్లు వోడాఫోన్ నివేదించింది.

Read latest Explained News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని