ఉచిత శిక్షణ.. భవిత రక్షణ..

ప్రభుత్వ కళాశాలల విద్యార్థుల భవిష్యత్తు కోసం ఇంటర్‌బోర్డు అడుగులు వేస్తోంది. పోలీసు శాఖలో స్థిరపడాలనుకునే వారికి ఉచిత శిక్షణ అందిస్తోంది. ఈ ఉద్యోగాలకు పోటీ పడేలా పూర్తిస్థాయిలో సన్నద్ధం చేస్తోంది. కోచింగ్‌ కోసం వేల రూపాయలు ఖర్చు పెట్టలేని విద్యార్థులకు భరోసా కల్పిస్తోంది.

Published : 05 Dec 2020 23:27 IST


 

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రభుత్వ కళాశాలల విద్యార్థుల భవిష్యత్తు కోసం ఇంటర్‌బోర్డు అడుగులు వేస్తోంది. పోలీసు శాఖలో స్థిరపడాలనుకునే వారికి ఉచిత శిక్షణ అందిస్తోంది. ఈ ఉద్యోగాలకు పోటీ పడేలా పూర్తిస్థాయిలో సన్నద్ధం చేస్తోంది. కోచింగ్‌ కోసం వేల రూపాయలు ఖర్చు పెట్టలేని విద్యార్థులకు భరోసా కల్పిస్తోంది. త్వరలో నిర్వహించనున్న పోలీసు నియామకాలను దృష్టిలో ఉంచుకుని ఉచిత శిక్షణ ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా 20 జిల్లాల్లో విద్యార్థులకు.. పోలీసు నియామక పరీక్షలకు అవసరమయ్యే శిక్షణ అందిస్తోంది. దేహదారుఢ్య, రాత పరీక్షల కోసం వారిని సన్నద్ధం చేస్తున్నారు అధికారులు. 

ఇందుకోసం ప్రతిజిల్లాలోనూ సుమారు వందమందిని ఎంపిక చేశారు. అందులో భాగంగా ద్వితీయ సంవత్సరం చదువుతున్న వారితో పాటు, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఇంటర్‌ పూర్తిచేసిన విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అర్హత కలిగిన వారికి ఉచితంగా తర్ఫీదు ఇస్తున్నారు. పోలీసు శాఖతో పాటు ఆర్మీ తదితర పోటీ పరీక్షల్లోనూ ప్రతిభ చూపేలా తీర్చిదిద్దుతున్నారు. తమ శిక్షణతో చాలామంది బంగారు భవిష్యత్తుకు బాటలు పడతాయని చెబుతున్నారు.

‘‘ప్రతిరోజూ ఉదయం 5:30 గంటల నుంచి 7:30/8:00 గంటల వరకు ఫిజికల్‌ ఫిట్‌నెస్‌కు సంబంధించిన శిక్షణ ఇస్తున్నాం. విద్యార్థులు బాగా కష్టపడుతున్నారు. వారు కచ్చితంగా ఉద్యోగాలు సాధిస్తారన్న నమ్మకం మాకుంది. వీరిలో ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాలకు చెందిన నిరుపేద విద్యార్థులే ఉన్నారు. ఇదేరకమైన శిక్షణ బయట తీసుకోవాల్సి వస్తే ఒక్కొక్కరికీ ఇరవై నుంచి నలభై వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు అంత డబ్బు ఖర్చుచేసి శిక్షణ తీసుకోలేరు. అందువల్ల వారికోసమే ఈ కార్యక్రమం కొనసాగుతోంది’’ అని సమన్వయ కర్తలు, శిక్షకులు చెబుతున్నారు.

ఉచితంగా శిక్షణ తమకు ఓ వరమని విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. శిక్షణ కోసం వేల రూపాయలు ఖర్చుపెట్టి సుదూర ప్రాంతాలకు వెళ్లలేని తమకు ఇదో గొప్ప అవకాశం అని చెబుతున్నారు. ఇంటర్‌ తరువాత విద్యార్థులు గందరగోళానికి గురవ్వకుండా సరైన మార్గంలో నడిపేందుకు ఇలాంటి శిక్షణలు ఉపయోగపడతాయని పలువురు అభిప్రాయ పడుతున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని