TSLPRB: తెలంగాణలో సివిల్ కానిస్టేబుల్ నియామకాలకు అడ్డంకి

తెలంగాణలో సివిల్ కానిస్టేబుల్ కొత్త నియామకాలకు అడ్డంకి ఏర్పడింది. 4 ప్రశ్నలను తొలగించి మరోసారి మూల్యాంకనం చేయాలని, ఆ తర్వాత తాత్కాలిక ఎంపిక జాబితా ప్రకటించాలని హైకోర్టు ఆదేశించింది.

Updated : 09 Oct 2023 22:51 IST

హైదరాబాద్‌: తెలంగాణలో సివిల్ కానిస్టేబుల్ కొత్త నియామకాలకు అడ్డంకి ఏర్పడింది. 4 ప్రశ్నలను తొలగించి మరోసారి మూల్యాంకనం చేయాలని, ఆ తర్వాత తాత్కాలిక ఎంపిక జాబితా ప్రకటించాలని హైకోర్టు ఆదేశించింది. ప్రశ్నలను తెలుగులోకి అనువాదం చేయకపోవడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం నిర్వహించిన రాత పరీక్షల్లో ఇచ్చిన ప్రశ్నలను తెలుగులోకి అనువాదం చేయకపోవడంతో తాము నష్టపోయామని పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు.

రాష్ట్రవ్యాప్తంగా పోలీసు ఉద్యోగాల భర్తీ కోసం పోలీసు నియామక మండలి గతేడాది ఏప్రిల్ 25న నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. సివిల్ కానిస్టేబుల్‌కు సంబంధించి 4,965 పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు పరీక్షలు రాశారు. అయితే, ఇందులో 3 ప్రశ్నలను తెలుగులోకి అనువాదం చేయకపోవడంతో పాటు ఒక ప్రశ్న తప్పుగా ఇవ్వడంతో సమాధానాలు రాయలేకపోయామని పలువురు అభ్యర్థులు పిటిషన్లలో పేర్కొన్నారు. ఇంటర్ వరకు చదువుకున్న అభ్యర్థులు.. ఆంగ్లంలో ప్రశ్నలుండటంతో గందరగోళానికి గురై సమాధానం రాయలేక నష్టపోయారని పిటిషనర్ల తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

ఆంగ్లంలో ఇచ్చిన ఐచ్చికాలు వాడుకలో ఉన్నవేనని పోలీసు నియామక మండలి తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆంగ్లపదాలను తెలుగులో అనువాదం చేసే అవకాశం ఉన్నా.. పరిగణలోకి తీసుకోకపోవడాన్ని కోర్టు తప్పబట్టింది. 4 ప్రశ్నలను తొలగించి ఆ తర్వాత మూల్యాంకనం చేయాలని.. దాని ఆధారంగా తాత్కాలిక జాబితా రూపొందించి ఆ తర్వాతే నియామక ప్రక్రియ కొనసాగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు, సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను గత బుధవారం పోలీస్ నియామక మండలి విడుదల చేసింది. అభ్యర్థుల పూర్తి వివరాలను కూడా సేకరిస్తున్నారు. ప్రస్తుతం హైకోర్టు తీర్పుతో ఈ ప్రక్రియ కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని