Updated : 22 Jul 2021 16:56 IST

Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టండి: కేసీఆర్‌

భారీ వర్షాల కారణంగా శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు ఎగువ నుంచి గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల్లో వరద ఉద్ధృతి పెరుగుతున్నందున యుద్ధప్రాతిపదికన ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ప్రజాప్రతినిధులు, అధికారులను తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో సీఎం సమీక్ష నిర్వహించారు. బాల్కొండ నియోజకవర్గంతో పాటు నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తక్షణమే పరిస్థితులను పర్యవేక్షించాలని మంత్రి ప్రశాంత్ రెడ్డిని ఆయన ఆదేశించారు. అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పారు.

Telangana CS review on Rains: ప్రాణ, ఆస్తి నష్టం ఉండొద్దు: సీఎస్
weather report: మరో రెండ్రోజుల పాటు మోస్తరు వర్షాలు

2. రేపు సాయంత్రం ఏపీ ద్వితీయ ఇంటర్‌ ఫలితాలు

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం ఫలితాలను రేపు ప్రకటించనున్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ ఫలితాలను  విడుదల చేయనున్నారు. పరీక్ష ఫలితాలకు చేయనున్నారు. పరీక్ష ఫలితాలను నాలుగు వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచనున్నట్లు మంత్రి తెలిపారు. కరోనా నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో పరీక్షలు ఉంటాయా? రద్దవుతాయా? అనేదానిపై దాదాపు ఒకటిన్నర నెలలు తీవ్ర ఉత్కంఠ కొనసాగింది.

3. ఓటమి భయంతోనే ఫోన్ ట్యాపింగ్‌: దాసోజు

ఫోన్‌ ట్యాపింగ్‌ ద్వారా భారత్‌లోని చాలామంది ఫోన్లను పెగాసిస్‌ తన అధీనంలోకి తీసుకుందని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఫోన్లను హ్యాక్‌ చేస్తోందంటూ వస్తున్న ఆరోపణల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ఇందిరా పార్కు వద్ద నిరసనకు దిగారు. ప్రైవసీ యాక్ట్‌ ప్రకారం ఇది ముమ్మాటికీ రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందని శ్రవణ్‌ అన్నారు. ఓటమి భయంలోనే ప్రతిపక్షాలు, న్యాయమూర్తులు, మీడియా ప్రతినిధుల ఫోన్లను ప్రధాని ట్యాప్‌ చేయిస్తున్నారని ఆరోపించారు.

4. అప్పుల గురించి దాస్తారా?.. ప్రభుత్వంపై పయ్యావుల ధ్వజం

పాలనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేయడం తప్పుకాదని.. చేస్తే ఆ వివరాలు సమగ్రంగా ఉండాలని తెదేపా సీనియర్‌ నేత, ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ) ఛైర్మన్‌ పయ్యావుల కేశవ్‌ అన్నారు. అప్పుల విషయాన్ని శాసనసభకు తెలపకుండా రహస్యంగా దాచారని ధ్వజమెత్తారు. సహజంగా ఏ అప్పు చేసినా లేదా ప్రభుత్వం ఏ గ్యారెంటీ ఇచ్చినా బడ్జెట్‌ పద్దులు ప్రవేశపెట్టే సమయంలో దాన్ని రాష్ట్ర శాసనసభకు వాల్యూమ్‌ 5/2 అనే పుస్తకంలో తెలపాలని చెప్పారు. అయితే ప్రభుత్వం అప్పులను ఆ పుస్తకంలో తెలియజేయకుండా దాచిందన్నారు.

5. మౌనం వీడిన యడ్డీ.. నాయకత్వ మార్పుపై వ్యాఖ్యలు

కర్ణాటకలో నాయకత్వ మార్పు అంశంలో గత కొంత కాలంగా వస్తున్న వార్తలపై ముఖ్యమంత్రి యడియూరప్ప గురువారం స్పందించారు. భాజపా అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టంచేశారు. ఈ నెల 26తో యడియూరప్ప సర్కారుకు రెండేళ్లు పూర్తికానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నెల 25న సీఎంగా తన భవితవ్యంపై పార్టీ హైకమాండ్‌ నిర్ణయం తీసుకుంటుందని యడ్డీ స్పష్టంచేశారు. బెంగళూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలకు తనపై ప్రత్యేకమైన ప్రేమ, నమ్మకం ఉన్నాయన్నారు. 

6. ఈ ఐస్‌క్రీం ధర ₹60 వేలు.. ఇంతకీ ఏంటో దీని స్పెషల్‌!

పది గ్రాముల బంగారం ధర సుమారుగా రూ. 50వేలు. అదే బంగారంతో చేసిన ఒక్క ఐస్ క్రీమ్ ధర రూ.60వేలు. బంగారంతో ఐస్ క్రీమా? అదీ 60వేల రూపాయలా..! వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది వాస్తవం. దుబాయ్‌లోని ఓ కెఫేలో దీన్ని విక్రయిస్తుండగా.. బాలీవుడ్‌ నటి షెషనాజ్‌ ట్రెజరీ దుబాయ్‌ వెళ్లి మరీ దాన్ని ఆరగించారు. దుబాయ్‌లోని జుమీరా రోడ్‌లోని ‘స్కూపీ కెఫే’ ఈ ఖరీదైన ఐస్ క్రీమ్‌ను విక్రయిస్తోంది. బంగారం సహా, అనేక విలువైన పదార్థాలతో తయారుకావడమే ఈ ధరకు కారణం. 

7. సరిహద్దుల్లో చైనా గస్తీ ముమ్మరం

ఉత్తరాఖండ్‌లోని వాస్తవాధీన రేఖ వద్దనున్న సరిహద్దుల్లో చైనా దూకుడు పెంచింది. ఇక్కడి బరాహోతి సమీపంలో ఆ దేశానికి చెందిన 40 మంది పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ (పీఎల్‌ఏ) సైనికులు ముమ్మరంగా గస్తీలో పాల్గొంటున్నారు. సుమారు 6 నెలల తర్వాత చైనా తన సరిహద్దు భూభాగంలో పెట్రోలింగ్‌ను ముమ్మరం చేసినట్టు భారత అధికారులు ధ్రువీకరించారు. తాజా పరిణామాన్ని నిశితంగా గమనిస్తున్నామని, ఎలాంటి సవాలునైనా దీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

8. ఆ 256 మంది.. కోటీశ్వరులైన ‘పేదవాళ్లు’..!

ఒకరు ఛాయ్‌ - సమోసా అమ్ముకునే వ్యక్తి.. మరొకరు ఛాట్‌ బండితో బతుకు బండి లాగిస్తున్న మనిషి.. ఇంకొకరు పండ్లమ్ముకుంటూ పొట్టనింపుకుంటున్న పేదవాడు..! ఇదంతా కేవలం పైకి కన్పించేదే. రోడ్ల పక్కన ఏళ్ల తరబడి చిరువ్యాపారాలు సాగిస్తున్న వీరి ఆదాయం లక్షలు, కోట్లలో ఉంది. కొందరి వద్ద ఒకటి కంటే ఎక్కువ కార్లు ఉండగా.. మరికొందరికి వందల ఎకరాల్లో సాగు భూమి ఉంది. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో పేదలుగా పరిగణిస్తున్న చిరువ్యాపారులపై ఆదాయపు పన్ను శాఖ దర్యాప్తు జరపగా.. దిమ్మతిరిగే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. అక్కడ 250 మందికి పైగా చిరువ్యాపారుల కోటీశ్వరులేనని తేలింది. 

9. ఎఫ్‌బీలో డిలీట్‌ చేసిన పోస్టులు వెనక్కి!

కొన్నిసార్లు ఫేస్‌బుక్ వాల్‌ లేదా గ్రూప్‌లోని పోస్ట్‌లను డిలీట్‌ చేయాలనుకుంటాం. కానీ ఎలా చేయాలో తెలీదు. మరికొన్నిసార్లు అనాలోచితంగానో, పొరపాటునో ఏదైనా ఒక పోస్టును డిలీట్ చేసేస్తుంటాం. కానీ అది ముఖ్యమైనదనిపిస్తే ఆ తర్వాత నిరాశకు గురవుతాం. అనవసరమైన పోస్టులను డిలీట్‌ చేయడం, అలా డిలీట్ చేసిన పోస్టుల్లో కావాల్సినవాటిని తిరిగి రికవరీ చేసుకోవడం ఎలాగో తెలుసుకుందాం. ఫేస్‌బుక్ మొబైల్ యాప్‌లో మీరు డిలీట్ చేసిన పోస్ట్‌ను 30 రోజుల్లోగా రికవరీ చేసుకోవచ్చు. దీని కోసం ముందుగా మొబైల్ యాప్‌లో మీ ప్రొఫైల్ ఓపెన్ చేయాలి.

10. బుల్‌ జోరు.. లాభాల్లో పరుగులు

బుల్‌ రంకేసింది.. కొనుగోళ్ల అండతో ఉత్సాహంగా ఉరకలేసింది. దీంతో దేశీయ మార్కెట్లు లాభాలతో కళకళలాడాయి.  52,494 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించిన సెన్సెక్స్‌ మొదట్లో కాస్త తడబడినా రోజంతా అదే ఉత్సాహంతో సాగింది. చివరకు 638.70 పాయింట్లు ఎగబాకి 52,837 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 191.90 పాయింట్లు లాభపడి 15,824 వద్ద ముగిసింది. దాదాపు అన్ని రంగాల షేర్లు రాణించాయి.

రూ.75 లక్షల కోట్లకు స్థిరాస్తి విపణి

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

ఇవీ చదవండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని