Azadi ka Amrit Mahotsav: భారత్‌ సాధించాల్సింది ఎంతో ఉంది: దత్తాత్రేయ

దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు గడిచిన సందర్భంగా ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ వేడుకలు నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ తెలిపారు. దిల్లీలోని తెలంగాణ

Published : 24 Aug 2021 19:26 IST

దిల్లీ: దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు గడిచిన సందర్భంగా ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ వేడుకలు నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ తెలిపారు. దిల్లీలోని తెలంగాణ భవన్‌ అంబేడ్కర్‌ ఆడిటోరియంలో ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ‘స్వతంత్ర భారతి నాట్య హారతి’ కార్యక్రమానికి దత్తాత్రేయ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, శిఖరం ఆర్ట్ థియేటర్స్ ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. దత్తా్త్రేయతో పాటు వివిధ రంగాల్లో సేవలు అందించిన మరో 14 మందికి శిఖరం ఆర్ట్ థియేటర్స్
 సంస్థ సేవా భారతి-2021 జాతీయ అవార్డులు ప్రదానం చేసింది.

దత్తాత్రేయ మాట్లాడుతూ.. ‘‘ప్రపంచ చరిత్రలో భారత స్వాతంత్ర్య పోరాటం చాలా గొప్పది. అత్యుత్తమ సంగ్రామంగా చరిత్రలో నిలిచింది. ఈ పోరాటంలో ఎంతో మంది ప్రాణత్యాగం చేశారు. వారి త్యాగాలను ఎప్పటికీ మర్చిపోవద్దు. 75 ఏళ్లలో ఎంతో సాధించిన భారత్.. ఇంకా సాధించాల్సింది మరెంతో ఉంది. స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు గడిచినా సమాజంలో ఇప్పటికీ అసమానతలు ఉన్నాయి. వివిధ భాషలు, సంస్కృతులు ఉన్న భారతదేశాన్ని కాపాడుకోవాలంటే సామరస్యం, అభివృద్ధి ఎంతో కీలకమైనవి. ప్రపంచంలో మూడో ఆర్థిక శక్తిగా భారత్ ఎదగడం చాలా సంతోషకరం. దేశంలో సాంకేతిక పరిజ్ఞానం, మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టాలి. ఇవి సమకూరినట్లయితే అభివృద్ధిలో భారత్‌ మరింత ముందుకు దూసుకెళ్తుంది. కరోనా కట్టడికి కేంద్రం తీసుకున్న చర్యలు చాలా గొప్పగా ఉన్నాయి. కొవిడ్ టీకాలు కనుగొని ఫార్మా రంగంలో అంతర్జాతీయ స్థాయిలో భారత్ తనదైన ముద్ర వేసుకుంది’’ అని దత్తాత్రేయ తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని