Top Ten News @ 9PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు మీ కోసం.. 

Updated : 17 Jan 2022 21:12 IST

1. TS: వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆంగ్ల మాధ్యమం!

ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టాలని మంత్రి వర్గం నిర్ణయించింది. ఆంగ్ల మాధ్యమం, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్‌, డిగ్రీ కళాశాల్లో ఫీజుల నియంత్రణపై కొత్త చట్టం తీసుకురావాలని కేబినెట్‌ తీర్మానించింది.

2. ఏపీలో మందు బాబులకు మరో గంట అవకాశం

కొత్త ఏడాదిలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మందుబాబులకు మరో శుభవార్త చెప్పింది. ఇటీవల మద్యం పన్ను రేట్లలో మార్పులు చేసి కొంత మేర ధరలు తగ్గించిన ప్రభుత్వం తాజాగా మరో వెసులు బాటు కల్పించింది. రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాల పనివేళలు గంట పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. రాత్రి 10గంటల వరకు మద్యం దుకాణాల పనివేళలు పొడిగిస్తూ ఎక్సైజ్‌శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

3. విద్యార్థుల భవిష్యత్తు కోసమే ఆ నిర్ణయం: మంత్రి సురేశ్‌

కొవిడ్‌ థర్డ్‌ వేవ్‌ వస్తున్న దృష్ట్యా జాగ్రత్తలు పాటిస్తూనే పాఠ్యాంశాలను పూర్తి చేస్తున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ తెలిపారు. సంక్రాంతి సెలవుల అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలు మొదలయ్యాయని తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యంపై తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. విద్యార్థుల రోజువారీ హాజరు తీసుకుంటున్నామని మంత్రి సురేశ్‌ తెలిపారు. 

4. కెప్టెన్సీ.. ఎవరికీ జన్మహక్కు కాదు : గౌతమ్‌ గంభీర్‌

టీమ్‌ఇండియా ఆటగాడు విరాట్ కోహ్లీ టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంపై మాజీ ఓపెనర్ గౌతమ్‌ గంభీర్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్సీ ఎవరికీ జన్మహక్కు కాదని పేర్కొన్నాడు. ప్రస్తుతం అన్ని ఫార్మాట్ల పగ్గాలు వదిలేసిన కోహ్లీ.. తన బ్యాటింగ్‌పై దృష్టి పెట్టాల్సిన సమయం ఆసన్నమైందని అభిప్రాయపడ్డాడు.

5. ‘మార్చి నుంచి 12-14 ఏళ్లలోపు చిన్నారులకు టీకాలు..’

దేశంలో 12 నుంచి 14 ఏళ్లలోపు పిల్లలకు టీకాలు వేసే ప్రక్రియ మార్చిలో ప్రారంభించే అవకాశం ఉందని నేషనల్‌ టెక్నికల్‌ ఆడ్వైజరీ గ్రూప్‌ ఆన్‌ ఇమ్యూనైజేషన్‌(ఎన్‌టీఏజీఐ)కి చెందిన కొవిడ్‌ వర్కింగ్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ ఎన్‌కే అరోడా సోమవారం తెలిపారు. అప్పటివరకు 15-18 ఏళ్లలోపు వారికి వ్యాక్సినేషన్‌ పూర్తయ్యే అవకాశం ఉందని చెప్పారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

6. తెలంగాణలో కొత్తగా 2,447 కరోనా కేసులు.. ముగ్గురి మృతి

తెలంగాణలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 80,138 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 2,447 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 7,11,656కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది. గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కరోనాతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

7. అలాంటి పాత్ర జీవితంలో ఒకసారే వస్తుంది: అనుష్క

అరుంధతి చిత్రానికి నేటికి 13 ఏళ్లు. ఈ సందర్భంగా అనుష్క ‘అరుంధతి’ చిత్రాన్ని గుర్తుచేసుకుంది. ‘ఈ సినిమా నాకెంతో ప్రత్యేకం. ఏ నటికైనా లైఫ్‌టైమ్‌లో ఒకసారి మాత్రమే పోషించగల పాత్రంటూ ఒకటి ఉంటుంది. నా జీవితంలో అది.. అరుంధతిలోని ‘జేజమ్మ’ పాత్ర. ఈ అవకాశాన్నిచ్చిన దర్శకుడు కోడి రామకృష్ణ, నిర్మాత శ్యామ్‌ ప్రసాద్‌ రెడ్డితో పాటు చిత్ర బృందానికి నా ధన్యవాదాలు’’ అని ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది.

8. బెంగళూరుపై ఒమిక్రాన్‌ పంజా.. దిల్లీలో 2500మంది పోలీసులకు కొవిడ్‌!

కర్ణాటకలోని బెంగళూరులో భారీగా ఒమిక్రాన్‌ కేసులు వెలుగుచూశాయి. ఈ ఒక్కరోజే 287 కొత్త వేరియంట్‌ కేసులు నమోదైనట్టు కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ కె.సుధాకర్‌ వెల్లడించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 766కి పెరిగిందన్నారు. మరోవైపు దిల్లీలో జనవరి 1 నుంచి ఇప్పటివరకు దాదాపు 2500 మంది పోలీసులు కొవిడ్‌ బారిన పడినట్టు అధికారులు వెల్లడించారు. 

9. సఫారీలోనూ డార్క్‌ ఎడిషన్‌.. ధర ఎంతంటే?

ప్రీమియం ఎస్‌యూవీ అయిన సఫారీలో డార్క్‌ ఎడిషన్‌ను టాటా మోటార్స్‌ సోమవారం విడుదల చేసింది. దీని ధర రూ.19.05 లక్షలు (ఎక్స్‌షోరూం). బుకింగ్స్‌ ప్రారంభమైనట్లు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. అలాగే దేశవ్యాప్తంగా అన్ని డీలర్‌షిప్‌లలో ఈ వాహనం అందుబాటులో ఉన్నట్లు పేర్కొంది. ఎక్స్‌టీ+, ఎక్స్‌టీఏ+, ఎక్స్‌జెడ్‌+, ఎక్స్‌జెడ్‌ఏ+ ట్రిమ్‌లలో డార్క్‌ ఎడిషన్‌ సఫారీ అందుబాటులో ఉంది.

10. అబుదాబి ఎయిర్‌పోర్టుపై డ్రోన్‌ దాడి.. మృతుల్లో ఇద్దరు భారతీయులు!

యూఏఈ రాజధాని అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయం లక్ష్యంగా అనుమానిత డ్రోన్‌ దాడి జరిగింది. ఈ దాడిలో మూడు ఆయిల్‌ ట్యాంకర్లు పేలడంతో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. ఆరుగురు స్వల్పంగా గాయపడినట్టు అబుదాబి పోలీసులు వెల్లడించారు. మృతుల్లో ఇద్దరు భారతీయులు ఉండగా.. ఒకరిని పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించినట్టు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని