Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 01 Jul 2023 16:59 IST

1. జూన్‌లోనూ భారీగా జీఎస్టీ వసూళ్లు

దేశంలో మరోసారి వస్తు, సేవల పన్ను (GST) వసూళ్లు భారీగా నమోదయ్యాయి. జూన్‌ నెలకు గానూ ₹1,61,497 కోట్లు వసూళ్లు (GST collections) నమోదైనట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ (Finance ministry) వెల్లడించింది. ఇందులో సీజీఎస్టీ రూపంలో రూ.31,013 కోట్లు, ఎస్‌జీఎస్టీ కింద రూ.38,292 కోట్లు, ఐజీఎస్టీ కింద రూ.80,292 కోట్లు చొప్పున వసూలైనట్లు తెలిపింది. గతేడాది జూన్‌లో రూ.1.44 లక్షల కోట్లు వసూళ్లు నమోదవ్వగా.. ఈ ఏడాది వసూళ్లు 12 శాతం మేర పెరిగాయి. అలాగే, జీఎస్టీ వసూళ్లు రూ.1.60 లక్షల కోట్లు మార్కు దాటడం ఇది నాలుగోసారి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. భారాసకు భద్రాద్రి జడ్పీ ఛైర్మన్‌ రాజీనామా..

గ్రామీణం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారత్‌ రాష్ట్ర సమితి (భారాస)కు ఎదురుదెబ్బ తగిలింది. భద్రాద్రి జడ్పీ ఛైర్మన్‌ కోరం కనకయ్య భారాసకు రాజీనామా చేశారు. కనకయ్యతో పాటు ఆయన అనుచరులు కూడా పార్టీకి రాజీనామా సమర్పించారు. ఇల్లందు నియోజకవర్గంలోని ఐదు మండలాల పరిధిలో ఒక జడ్పీటీసీ, 56 మంది సర్పంచులు, 26 మంది ఎంపీటీసీలు రాజీనామాలు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. పవన్‌ కల్యాణ్ ఏ విప్లవంలో పాల్గొన్నారో చెప్పాలి: మంత్రి అంబటి

భీమవరంలో పవన్‌ కల్యాణ్ ఓ రౌడీలా.. అసాంఘిక శక్తిలా మాట్లాడారని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. వైకాపా నాయకుల్ని, కార్యకర్తల్ని తిట్టడమేనా పవన్‌ పాలసీ? అని ప్రశ్నించారు. గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన మంత్రి అంబటి .. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై విరుచుకుపడ్డారు. పవన్‌ మాటలు విని నవ్వాలో, ఏడవాలో ప్రజలకు అర్థం కావడం లేదన్నారు. మాట్లాడితే పవన్‌ కల్యాణ్ విప్లవం అంటున్నారని, ఇంతకీ ఆయన ఏ విప్లవంలో పాల్గొన్నారో చెప్పాలన్నారు. 3 పెళ్లిళ్ల వీరుడు పవన్‌ కల్యాణ్ నీతులు చెబితే హాస్యాస్పదంగా ఉందని, 3 పెళ్లిళ్లు చేసుకోవడమేనా పవన్‌ చెప్పే ఆదర్శమని ఎద్దేవా చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. భారాస, భాజపా నేతలు టచ్‌లో ఉన్నారు.. ఖమ్మం సభ తర్వాత చేరికలు: ఠాక్రే

భారాస అధినేత, సీఎం కేసీఆర్‌ ఆర్భాటం తప్ప ఏమీ లేదని, మహారాష్ట్రలో ఆ పార్టీకి ఒక్క సీటు కూడా రాదని తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జి మాణిక్‌రావు ఠాక్రే అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్‌ పార్టీలో నేతల మధ్య మంచి కో ఆర్డినేషన్‌ ఉందన్నారు. భారాస, భాజపా నేతలు తమతో టచ్‌లో ఉన్నారని, ఖమ్మం సభ తర్వాత మిగతావారి చేరికలు ఉంటాయన్నారు. కర్ణాటక ఫలితాల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్‌ బలం పెరిగిందన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌దే విజయమని ధీమా వ్యక్తం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ‘బహుళ రాష్ట్ర సహకార సంఘాల చట్టం’లో సవరణలు తథ్యం: అమిత్‌షా

బహుళ రాష్ట్ర సహకార సంఘాల చట్టం (MSCS)లో సవరణలకు పార్లమెంటరీ కమిటీ ఏకాభిప్రాయం వ్యక్తం చేసిందని, రానున్న పార్లమెంట్‌ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెడతామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా (Amit Shah) అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో సహకార రంగంలో అనేక కార్యక్రమాలు చేపట్టామని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. దిల్లీలోని ఇంటర్నేషనల్‌ ఎగ్జిబిషన్‌ కన్వెన్షన్ సెంటర్‌ (ఐఈసీసీ)లో ఏర్పాటు చేసిన 17వ భారత సహకార కాంగ్రెస్‌ సమావేశాల్లో అమిత్‌షా మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. గ్రూప్‌ -4 పరీక్ష రాస్తూ ఫోన్‌తో పట్టుబడ్డ అభ్యర్థి

 గ్రూప్‌ -4 పరీక్ష రాస్తూ సెల్‌ఫోన్‌తో ఓ అభ్యర్థి పట్టుబడ్డాడు. సరూర్‌నగర్‌లోని సక్సెస్‌ కళాశాలలో ఈ ఘటన జరిగింది. పరీక్ష ప్రారంభమైన అరగంట తర్వాత ఇన్విజిలేటర్‌ గుర్తించి.. అభ్యర్థి నుంచి ఫోన్‌ తీసుకుని సీజ్‌ చేశారు. మాల్‌ ప్రాక్టీస్‌ కింద అభ్యర్థిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.  ఈ సంఘటన మినహా జిల్లా వ్యాప్తంగా ఉదయం సెషన్‌లో జరిగిన గ్రూప్-4  పేపర్-1 పరీక్ష ప్రశాంతంగా జరిగిందని కలెక్టర్‌ తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. వెంటనే లొంగిపోండి: తీస్తా సెతల్వాడ్‌కు బెయిల్‌ నిరాకరణ

 ప్రముఖ సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్‌(Teesta Setalvad)కు గుజరాత్ హైకోర్టు(Gujarat High Court)లో ఎదురుదెబ్బ తగిలింది. ఆమె బెయిల్‌(Regular bail) అభ్యర్థనను తోసిపుచ్చిన కోర్టు.. ఆమె వెంటనే లొంగిపోవాలని ఆదేశాలు ఇచ్చింది. గుజరాత్‌లో 2002లో జరిగిన అల్లర్ల విషయంలో ప్రత్యేక దర్యాప్తు బృందానికి, పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చారన్న ఆరోపణలపై ఆమెపై గతంలో కేసు నమోదైంది. అమాయకులను కేసులో ఇరికించేందుకు కుట్రపన్నారంటూ ఆమెపై అభియోగాలు నమోదయ్యాయి. ఆ కేసులోనే ప్రస్తుతం హైకోర్టు ఆదేశాలు వచ్చాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఫ్రాన్స్‌లో ఘర్షణలు.. కచేరీలో అధ్యక్షుడు: ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు

పోలీసు కాల్పుల్లో 17 ఏళ్ల యువకుడి మృతి ఘటన ఫ్రాన్స్‌ (France)ను కుదిపేస్తోంది. పౌరులు పెద్దఎత్తున విధ్వంసాలకు పాల్పడుతూ ఆందోళనలను కొనసాగిస్తునే ఉన్నారు. మంగళవారం నుంచి ఈ ఘర్షణలు కొనసాగుతున్నాయి. వీటిని కట్టడి చేసేందుకు ఫ్రాన్స్ ప్రభుత్వం 45 వేల మంది బలగాలను మోహరించింది. కొన్ని తేలికపాటి సాయుధ వాహనాలను రంగంలోకి దించింది. ఇప్పటివరకు 1,100 అరెస్టులు చోటుచేసుకున్నాయని ఫ్రాన్స్‌ ఇంటీరియర్ మినిస్టర్ గెరాల్డ్‌ డార్మానిన్ వెల్లడించారు. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌ (Emmanuel Macron) శాంతి కోసం విజ్ఞప్తి చేసినప్పటికీ ఈ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9.మోదీ ప్రభుత్వం దగ్గర ఆ లెక్కలు ఉన్నాయా?:పరకాల ప్రభాకర్‌

ప్రస్తుతం దేశం అత్యంత సంక్షోభంలో ఉందని.. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నిరుద్యోగం, ధరల పెరుగదల ఇప్పుడే అధికంగా ఉందని రాజకీయ, ఆర్థిక విశ్లేషకులు పరకాల ప్రభాకర్ అన్నారు. సోమజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ‘సంక్షోభంలో మన గణతంత్రం - విశ్లేషణ’ అనే అంశంపై ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఇండియా(మెఫీ) సంస్థ నిర్వహించిన సదస్సులో పరకాల ప్రభాకర్ మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. హెచ్‌డీఎఫ్‌సీ విలీనం.. హోమ్‌లోన్‌ వడ్డీ రేట్లు మారుతాయా?

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో (HDFC bank) మార్టగేజ్‌ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ (HDFC Ltd) విలీనం పూర్తయ్యింది. విలీనానికి (HDFC merger) శుక్రవారం రెండు బోర్డులు ఆమోదం తెలిపాయి. దీంతో జులై 1 నుంచి రూ.18 లక్షల కోట్ల ఆస్తులతో ఒక దిగ్గజ సంస్థ ఏర్పాటైంది. విలీనం అనంతరం 12 కోట్ల కస్టమర్లు, 8,300 బ్యాంకు శాఖలు, 1.77 లక్షల మంది ఉద్యోగులతో కూడిన అతిపెద్ద బ్యాంకుగా ఆవిర్భవించింది. విలీన సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌గా కొనసాగనుంది. మరి హెచ్‌డీఎఫ్‌సీలో హోమ్‌లోన్‌ తీసుకున్న వారి పరిస్థితేంటి? వడ్డీ రేట్లు ఏమైనా మారుతాయా? పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని