GST collections: జూన్‌లోనూ భారీగా జీఎస్టీ వసూళ్లు

GST collections for june: జూన్‌ నెల జీఎస్టీ వసూళ్లు రూ.1.61 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. గతేడాదితో పోలిస్తే 12 శాతం మేర పెరిగాయి.

Updated : 01 Jul 2023 18:22 IST

దిల్లీ: దేశంలో మరోసారి వస్తు, సేవల పన్ను (GST) వసూళ్లు భారీగా నమోదయ్యాయి. జూన్‌ నెలకు గానూ ₹1,61,497 కోట్లు వసూళ్లు (GST collections) నమోదైనట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ (Finance ministry) వెల్లడించింది. ఇందులో సీజీఎస్టీ రూపంలో రూ.31,013 కోట్లు, ఎస్‌జీఎస్టీ కింద రూ.38,292 కోట్లు, ఐజీఎస్టీ కింద రూ.80,292 కోట్లు చొప్పున వసూలైనట్లు తెలిపింది. 

గతేడాది జూన్‌లో రూ.1.44 లక్షల కోట్లు వసూళ్లు నమోదవ్వగా.. ఈ ఏడాది వసూళ్లు 12 శాతం మేర పెరిగాయి. అలాగే, జీఎస్టీ వసూళ్లు రూ.1.60 లక్షల కోట్లు మార్కు దాటడం ఇది నాలుగోసారి. 2021-22లో తొలి త్రైమాసికంలో జీఎస్టీ సగటు వసూళ్లు రూ.1.10 లక్షల కోట్లు ఉండగా.. 2022-23 తొలి త్రైమాసికానికి రూ.1.51 లక్షల కోట్లకు, 2023-24 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.1.69 లక్షల కోట్లకు పెరిగినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఇక తెలుగు రాష్ట్రాల జీఎస్టీ వసూళ్ల విషయానికొస్తే.. తెలంగాణలో రూ.4,681.39 కోట్ల మేర వసూళ్లు జరిగాయి. గతేడాది రూ.3,901.45 కోట్లతో పోలిస్తే 20 శాతం మేర పెరిగాయి. గతేడాది ఏపీలో రూ.2,986.52 కోట్లు వసూళ్లు నమోదవగా.. ఈ ఏడాది జూన్‌లో రూ.3,477.42 కోట్లు వసూళ్లు జరిగాయి. గతేడాదితో పోలిస్తే 16 శాతం వృద్ధి నమోదైంది. ఎప్పటిలానే మహారాష్ట్ర రూ.26,098.78 కోట్ల (17 శాతం) వసూళ్లతో అగ్రస్థానంలో నిలిచింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు