HDFC Merger: హెచ్‌డీఎఫ్‌సీ విలీనం.. హోమ్‌లోన్‌ వడ్డీ రేట్లు మారుతాయా?

FAQ about HDFC Merger: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో హెచ్‌డీఎఫ్‌సీ విలీనం పూర్తయ్యింది. విలీనం అనంతరం హెచ్‌డీఎఫ్‌సీకి చెందిన హోమ్‌లోన్‌, ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌, ఆర్‌డీ ఖాతాలు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు బదిలీ కానున్నాయి.

Updated : 01 Jul 2023 17:07 IST

ఇంటర్నెట్ డెస్క్‌: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో (HDFC bank) మార్టిగేజ్‌ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ (HDFC Ltd) విలీనం పూర్తయ్యింది. విలీనానికి (HDFC merger) శుక్రవారం రెండు బోర్డులు ఆమోదం తెలిపాయి. దీంతో జులై 1 నుంచి రూ.18 లక్షల కోట్ల ఆస్తులతో ఒక దిగ్గజ సంస్థ ఏర్పాటైంది. విలీనం అనంతరం 12 కోట్ల కస్టమర్లు, 8,300 బ్యాంకు శాఖలు, 1.77 లక్షల మంది ఉద్యోగులతో కూడిన అతిపెద్ద బ్యాంకుగా ఆవిర్భవించింది. విలీన సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌గా కొనసాగనుంది. మరి హెచ్‌డీఎఫ్‌సీలో హోమ్‌లోన్‌ తీసుకున్న వారి పరిస్థితేంటి? వడ్డీ రేట్లు ఏమైనా మారుతాయా? వంటి సందేహాలకు సమాధానాలు ఇవిగో..

హోమ్‌లోన్‌ కస్టమర్లు

  • ఎవరైతై హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌లో హోమ్‌లోన్‌ తీసుకుని ఉంటారో వారి లోన్‌ అకౌంట్‌ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు బదిలీ అవుతుంది. లోన్‌ అగ్రిమెంట్‌లో గానీ, లోన్‌ నంబర్‌లో గానీ ఎలాంటి మార్పూ ఉండదు.
  • ఇంతకుముందు హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్ల గృహ రుణ వడ్డీ రేట్లు రిటైల్‌ ప్రైమ్‌ లెండింగ్‌ రేట్‌కు (RPLR) అనుసంధానం అయ్యి ఉంటాయి. ఇకపై ఎక్సటర్నల్‌ బెంచ్‌ మార్క్‌ లెండింగ్‌ రేట్‌కు (EBLR) అనుసంధానం అవుతాయి. ఫ్లోటింగ్‌ వడ్డీ రేట్లకు ఇవి వర్తిస్తాయి. ప్రస్తుతానికి వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పూ ఉండనప్పటికీ.. భవిష్యత్‌లో ఈబీఎల్‌ఆర్‌కు అనుగుణంగా వడ్డీ రేట్లలో మార్పులుండొచ్చు.
  • హోమ్‌లోన్‌ ప్రీపేమెంట్‌కు సంబంధించి సంప్రదింపుల కోసం ఇకపై దగ్గర్లోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ శాఖలుకు వెళ్లొచ్చు. లేదంటే customer.service@hdfc.comకు మెయిల్‌ చేయొచ్చు.
  • హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో ఖాతాలు లేని వారు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ హోమ్‌లోన్‌ సెక్షన్‌లో పాత లాగిన్‌ వివరాలతో లాగిన్ అవ్వొచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ పోర్టల్‌ కూడా అందుబాటులో ఉంటుంది. ఒకవేళ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో సేవింగ్స్‌ ఖాతా, కరెంట్‌ అకౌంట్‌ ఉంటే లాగినై అందులో హోమ్‌లోన్‌ వివరాలు తెలుసుకోవచ్చు.
  • ఒకవేళ హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌ హోమ్‌లోన్‌కు సంబంధించిన ఇంట్రెస్ట్‌ సర్టిఫికెట్‌ కావాలంటే బ్యాంక్‌ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. లేదంటే customer.service@hdfc.com నుంచి పొందొచ్చు. లేదా దగ్గర్లోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ శాఖలను సంప్రదించొచ్చు.

ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, రికరింగ్‌ డిపాజిట్లు

  • ఒకవేళ హెచ్‌డీఎఫ్‌సీలో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు ఉంటే.. ఇప్పటికిప్పుడు ఎలాంటి మార్పులూ ఉండబోవు. మీ ఎఫ్‌డీ మెచ్యూరిటీ, రెన్యువల్‌ అయ్యేంత వరకు ప్రస్తుతం అనుసరిస్తున్న వడ్డీ, మెచ్యూరిటీ వంటివి యథాతథంగా కొనసాగుతాయి. 
  • గతంలో ఉన్న ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ నంబరే ఉంటుంది. ఫిక్సడ్‌ డిపాజిట్ల విషయంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌తో ఏమైనా సంప్రదింపులు జరపాలంటే ఎఫ్‌డీ నంబర్‌ను ఉపయోగించుకోవచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌లోని ఎఫ్‌డీ  వివరాలను హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో పొందలేరు. హెచ్‌డీఎఫ్‌సీ పోర్టల్‌లో మాత్రమే అవి లభిస్తాయి.
  • ఒకవేళ ఎవరైనా హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌లో రికరింగ్‌ డిపాజిట్లు తెరిచి ఉంటే వారి నెలవారీ ఇన్‌స్టాల్‌మెంట్లు యథాతథంగా కొనసాగుతాయి. మీరు లింక్‌ చేసిన ఖాతాల నుంచి డిపాజిట్‌ చేయదలిచిన మొత్తం కట్‌ అవుతుంది. ఒకవేళ కొత్త రికరింగ్‌ డిపాజిట్ల తెరవాలంటే మాత్రం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో సేవింగ్స్‌ ఖాతా తెరిచి ఆర్‌డీని ఓపెన్‌ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ వెబ్‌సైట్‌ను సందర్శించండి..
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని