Top Ten News @ 1PM

ఈనాడు.నెట్‌లో ముఖ్యమైన పది వార్తల కోసం క్లిక్‌ చేయండి

Published : 22 May 2021 12:55 IST

1. black fungus: ఇన్‌ఫెక్షన్‌ ముప్పు పురుషులకే ఎక్కువ

 కొవిడ్‌ నుంచి కోలుకున్నవారిలో ప్రస్తుతం మ్యుకర్‌మైకోసిస్‌ (బ్లాక్‌ ఫంగస్‌) ఇన్‌ఫెక్షన్లు ఆందోళన కలిగిస్తున్నాయి. పెరుగుతున్న కేసుల దృష్ట్యా బ్లాక్‌ఫంగస్‌ను అంటువ్యాధుల జాబితాలోకి చేర్చాలని కేంద్రం నిర్ణయించింది. ఈ బ్లాక్‌ ఫంగస్‌ ముప్పు పురుషులకు ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు వెల్లడించారు. కోల్‌కతాలోని జీడీ హస్పిటల్‌ అండ్‌ డయాబెటిస్‌ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన డాక్టర్‌ అవదేశ్‌ కుమార్‌సింగ్‌, డాక్టర్‌ రితుసింగ్‌, ముంబయిలోని లీలావతి ఆస్పత్రికి చెందిన డాక్టర్‌ శశాంక్‌ జోషి, దిల్లీలోని నేషనల్‌ డయాబెటిస్‌, ఒబేసిటీ ఫౌండేషన్‌కు చెందిన డాక్టర్‌ అనూప్‌ మిశ్రా సంయుక్తంగా ఈ పరిశోధనను నిర్వహించారు. అరుదుగా వచ్చే ఈ ఇన్‌ఫెక్షన్‌ ప్రమాదకరమైందని వారు వెల్లడించారు. ఇప్పటి వరకు నమోదైన కేసుల ఆధారంగా పరిశీలిస్తే వారిలో 79శాతం మంది పురుషులే ఉన్నట్లు వారు తెలిపారు.

2. TS Lockdown:క‌ఠిన ఆంక్ష‌లు..ముమ్మ‌ర త‌నిఖీలు

తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశాల మేర‌కు రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను పోలీసులు క‌ఠినంగా అమ‌లు చేస్తున్నారు. ఉద‌యం 10.10 గంట‌ల త‌ర్వాత ఎవ‌రూ బ‌య‌ట తిర‌గ‌కూడ‌ద‌ని సీఎం తెలిపిన‌ నేప‌థ్యంలో ఆ మేర‌కు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. న‌గ‌రంతో పాటు జిల్లాల్లోనూ వాహ‌నాల త‌నిఖీని పోలీసులు మ‌మ్మురం చేశారు. పాస్‌లు, అనుమ‌తులు లేని వాహ‌నాల‌ను సీజ్ చేస్తున్నారు. లాక్‌డౌన్ అమ‌లును డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి ప‌రిశీలించారు. కూక‌ట్‌ప‌ల్లిలో ఆయ‌న ఆకస్మిక త‌నిఖీలు చేశారు. హైద‌రాబాద్ సీపీ అంజ‌నీకుమార్ పంజాగుట్ట‌, బంజారాహిల్స్‌, బేగంపేట‌లో లాక్‌డౌన్ అమ‌లు తీరును ప‌రిశీలించారు.

3.Corona: పెరుగుతున్న పరీక్షలు..కేసుల్లో స్వల్ప తగ్గుదల

దేశంలో కరోనాఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. మరోరోజు నాలుగు వేలకు పైనే మరణాలు నమోదయ్యాయి. రోజూవారీ కేసులు మాత్రం కొద్దిమేర తగ్గాయని శనివారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. శుక్రవారం 20,66,285మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 2,57,299మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. గత కొద్దిరోజులుగా కొత్తకేసుల్లో స్వల్ప హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. అలాగే గత నాలుగు రోజులుగా నిత్యం 20లక్షలపైనే నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నప్పటికీ..మూడు లక్షలకు దిగువనే కేసులు వెలుగుచూస్తున్నాయి. అలాగే 24 గంటల వ్యవధిలో 4,194మంది మృత్యుఒడికి చేరుకున్నారు.

4. China: సరిహద్దుల్లో విస్తరిస్తున్న డ్రాగన్‌

టిబెట్‌ సరిహద్దులోని మారుమూల గ్రామాల్లో మౌలిక వసతుల విస్తరణ ముసుగులో చైనా ఇటు భారత్‌లోని అరుణాచల్‌ప్రదేశ్‌.. అటు నేపాల్, భూటాన్‌ భూభాగాలకు చేరువగా వస్తోంది. టిబెట్‌ ఆధ్యాత్మిక గురువు దలైలామా (85) వారసుడి ఎంపిక విషయమై చైనా శుక్రవారం విడుదల చేసిన శ్వేతపత్రం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. ‘1951 నుంచీ టిబెట్‌.. దాని విమోచనం, అభివృద్ధి.. శ్రేయస్సు’ అంటూ దీనికి పేరు కూడా పెట్టారు. హిమాలయ ప్రాంతంలోని నాలుగు వేల కిలోమీటర్ల సరిహద్దులపై పట్టు సాధించాలంటే టిబెట్‌ కీలకం కావడంతో సరిహద్దు గ్రామాల అభివృద్ధి పేరిట చైనా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.

నెల‌కు ప‌ది వేల వ‌ర‌కు పెన్ష‌న్ పొందాలంటే..

5. Vizag Steel: 100వ రోజుకు నిరాహారదీక్ష‌లు

విశాఖ ఉక్కు ప‌రిశ్ర‌మ‌ ప్రైవేటీక‌ర‌ణ‌ నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తూ స్టీల్ ప్లాంట్ ప‌రిర‌క్ష‌ణ ఐక్య కార్యాచ‌ర‌ణ స‌మితి ఆధ్వ‌ర్యంలో కార్మికులు చేస్తున్న రిలే నిరాహార దీక్ష‌లు 100వ రోజుకు చేరుకున్నాయి. ఈ సంద‌ర్భంగా కొవిడ్ నిబంధ‌న‌లు పాటిస్తూ స్టీల్ ప్లాంట్ ప్ర‌ధాన ద్వారం వ‌ద్ద‌ ఉక్కు ప‌రిరక్ష‌ణ, కార్మిక సంఘ నేత‌లు నిర‌స‌న  తెలుపుతున్నారు. నిర‌స‌న‌కు సీపీఎం, సీపీఐ, టీఎన్‌టీయూసీ మ‌ద్ద‌తు తెలిపాయి. రాష్ట్ర‌ ఎంపీలంద‌రూ క‌లిసి ఉక్కు ప‌రిశ్ర‌మ‌ను ప్ర‌భుత్వ రంగంలోనే కొన‌సాగించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల‌ని ప‌రిర‌క్ష‌ణ స‌మితి నేత‌లు కోరుతున్నారు. కేంద్ర ప్రభుత్వం త‌న నిర్ణ‌యాన్ని ఉప సంహ‌రించుకునే వ‌ర‌కూ ఉద్య‌మాన్ని ఆప‌బోమ‌ని నిర్వాసిత గ్రామాల ప్ర‌జ‌లు చెబుతున్నారు.

6. Israel-Palestine: రెండు రాజ్యాలే ఏకైక పరిష్కారం

ఇజ్రాయెల్‌, పాలస్తీనా మధ్య 11 రోజుల పాటు జరిగిన పోరులో తీవ్రంగా నష్టపోయిన గాజా పునర్నిర్మాణానికి పూర్తిస్థాయి సహాయ సహకారాలు అందిస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ హామీ ఇచ్చారు. అలాగే జేరూసలెంలో ఇరు వర్గాల మధ్య జరుగుతున్న అంతర్గత ఘర్షణలు తక్షణమే ముగిసేలా చర్యలు చేపట్టాలని ఇజ్రాయెల్‌ను కోరినట్లు తెలిపారు. ఇజ్రాయెల్‌ భద్రతకు అమెరికా పూర్తి హామీ ఇస్తోందని.. దీంట్లో ఎలాంటి మార్పు ఉండబోదని భరోసానిచ్చారు. ఇజ్రాయెల్‌ ఉనికిని నిస్సందేహంగా గుర్తించినప్పుడే ఈ ప్రాంతంలో శాంతి నెలకొంటుందని నొక్కి చెప్పారు. రెండు రాజ్యాలను ఏర్పాటు చేయడమే ఈ వివాదానికి పరిష్కారమని తాము బలంగా విశ్వసిస్తున్నట్లు తెలిపారు.

7. India: 80% పల్లెలు వైద్యానికి దూరం

పల్లెలే దేశానికి పట్టుగొమ్మలంటూ ప్రభుత్వాలు ఘనంగా చెబుతున్నా గ్రామాల్లో అది ప్రతిబింబించడంలేదు. కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ నిర్వహించిన మిషన్‌ అంత్యోదయ సర్వే-2019ని పరిశీలిస్తే ఈ అంశం స్పష్టమవుతోంది. దాదాపు 80%కిపైగా గ్రామాల్లో వైద్య సౌకర్యాలు లేవని తేలింది. 6% గ్రామాల్లో కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు, 14.5% గ్రామాల్లో ప్రాథమిక వైద్య కేంద్రాలు, 23.5% గ్రామాల్లో ఆరోగ్య ఉపకేంద్రాలు, 11.5% గ్రామాల్లో మాత్రమే జన ఔషధీ కేంద్రాలు ఉన్నట్లు తేలింది. దేశవ్యాప్తంగా ఉన్న 2,66,430 పల్లెల్లో సర్వే చేసిన అనంతరం ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి.

*RRR: ఇది కదా రికార్డు అంటే

8. Covid: ఆ గ్రామాల్లో రోజుకొకరు చొప్పున కరోనాకు బలి

రెండో దశలో కొవిడ్‌ మహమ్మారి పల్లెలపై పెను ప్రతాపమే చూపిస్తోంది. అవగాహన లోపం, సరైన వైద్య సౌకర్యాలు లేకపోవడంతో మారుమూల పల్లెల్లో కరోనా విజృంభిస్తోంది. వైరస్‌ గురించి తెలుసుకునేలోపే అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఝార్ఖండ్‌లోని ఓ గ్రామంలో కేవలం 20 రోజుల వ్యవధిలోనే 22 మంది కొవిడ్‌ లక్షణాలతో మరణించగా, ఉత్తరప్రదేశ్‌లోని ఒక గ్రామంలోనూ అనేక మంది వైరస్‌కు బలయ్యారు. ఝార్ఖండ్‌లోని పాలము జిల్లాలో మారమూల సువా కౌడియా గ్రామంలో గడిచిన 20 రోజుల్లో 22 మంది చనిపోయారు. ఏప్రిల్‌ 25 నుంచి మే 15 మధ్య ఈ మరణాలు సంభవించాయి. వీరంతా కొవిడ్‌ లక్షణాలతో చనిపోయినట్లు గ్రామస్థులు చెబుతుండగా.. అధికారులు మాత్రం ఇంకా ధ్రువీకరించలేదు.

9. WHO: లెక్కకు రాని మరణాలు 12 లక్షలు 

కొవిడ్‌ మరణాలకు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తాజాగా ఓ ఆందోళనకర విషయాన్ని బయటపెట్టింది. మృతుల గణన నిర్దుష్టంగా సాగడం లేదని తెలిపింది. గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా కనీసం 30 లక్షల మందిని కరోనా మహమ్మారి బలి తీసుకొని ఉండొచ్చని అంచనా వేసింది. ఆయా దేశాలు అధికారికంగా వెల్లడించిన మరణాలతో (18 లక్షలు) పోలిస్తే ఈ సంఖ్య చాలా ఎక్కువ అని తెలిపింది. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య గణాంకాల పేరుతో ప్రత్యేక నివేదికను డబ్ల్యూహెచ్‌వో శుక్రవారం విడుదల చేసింది. తాజా నివేదిక ప్రకారం.. 2020 డిసెంబరు 31 నాటికి ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 8.2 కోట్లు, మృతుల సంఖ్య 18 లక్షలుగా ఉందని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. 

10. Team India: 10 కాదు 3 రోజులే

ఇంగ్లాండ్‌లో పర్యటించే భారత జట్లకు శుభవార్త! కఠిన క్వారంటైన్‌ ఆంక్షలను ఈసీబీ సడలించింది. బీసీసీఐ చర్చలతో 10 రోజుల కఠిన క్వారంటైన్‌ను 3 రోజులకు తగ్గించింది. దీంతో పురుషులు, మహిళల జట్లు నాలుగో రోజు నుంచే సాధన చేసుకోవచ్చు. సుదీర్ఘ పర్యటన కావడంతో క్రికెటర్ల కుటుంబ సభ్యులూ ఇంగ్లాండ్‌ వెళ్తున్న సంగతి తెలిసిందే. వారికి మాత్రం పది రోజుల కఠిన క్వారంటైన్‌ ఉండనుంది. వీరికీ మినహాయింపు కల్పించేలా బోర్డు వర్గాలు చర్చలు జరుపుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని