Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 05 Apr 2022 13:17 IST

1. పార్లమెంట్‌లో తెరాస ఎంపీల వాయిదా తీర్మానం.. వాకౌట్‌

తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ల విషయంలో తెరాస, కేంద్ర ప్రభుత్వం మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో ధాన్యం సేకరణపై చర్చించాలని తెరాస ఎంపీలు పార్లమెంట్‌ ఉభయసభల్లో పట్టుబట్టారు. అనంతరం లోక్‌సభ, రాజ్యసభల్లో ఎంపీలు వాయిదా తీర్మానం నోటీసులిచ్చారు. ఈ తీర్మానాన్ని స్పీకర్‌ ఓం బిర్లా తిరస్కరించారు. ధాన్యం సేకరణపై చర్చ చేపట్టకపోవడంతో ఉభయసభల నుంచి ఎంపీలు వాకౌట్‌ చేశారు. అంతకముందు కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా లోక్‌సభలో ఎంపీలు ఆందోళన చేపట్టారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

 ఆస్తి మొత్తం రాహుల్‌ గాంధీ పేరిట వీలునామా రాసిన వృద్ధురాలు

2. ఏబీ వెంకటేశ్వరరావుకు రాష్ట్ర ప్రభుత్వం షోకాజ్‌ నోటీసు

 ఏపీ ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌, ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు రాష్ట్ర ప్రభుత్వం షోకాజ్‌ నోటీసు జారీచేసింది. గత నెల 21న పెగాసస్‌తో పాటు తన సస్పెన్షన్‌ అంశాలపై మీడియాతో ఆయన మాట్లాడారు. ఈ నేపథ్యంలో ఏబీ వెంకటేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించడంపై ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. మీడియాతో మాట్లాడటంపై వివరణ కోరుతూ సీఎస్‌ సమీర్‌ శర్మ ఆయనకు షోకాజ్‌ నోటీసు జారీ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. మేడ్చల్‌లో దారుణం.. పదకొండేళ్ల బాలికపై ఆటో డ్రైవర్‌ అత్యాచారం

మేడ్చల్‌ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పదకొండేళ్ల బాలికపై ఆటో డ్రైవర్‌ వెంకటయ్య అత్యాచారం చేశాడు. పాఠశాలకు వెళ్లి వస్తున్న బాలికపై ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. హెచ్‌డీఎఫ్‌సీ విలీనం.. కస్టమర్లపై ఎలాంటి ప్రభావం ఉండనుంది?

భారత్‌లోనే అతిపెద్ద గృహ రుణాల సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ.. దేశంలోనే అతిపెద్ద ప్రైవేటు బ్యాంకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో విలీనం అవుతోంది. దీంతో ఒక గొప్ప బ్యాంకింగ్‌ దిగ్గజం ఏర్పాటు కానుంది. 40 బిలియన్‌ డాలర్ల ఒప్పంద విలువతో మొత్తం రూ.3.3 లక్షల కోట్ల నికర విలువ గల; రూ.18 లక్షల కోట్ల బ్యాలెన్స్‌ షీట్‌ సంస్థ ఏర్పాటు అవుతుంది. ఈ విలీనం 2023-24 రెండు లేదా మూడు త్రైమాసికాల్లో పూర్తి కానుంది. ఇప్పటి వరకు సంస్థల ఒప్పందం, వాటి నిర్మాణం, యాజమాన్యంలో మార్పుల గురించి మాత్రమే వివరాలు వెల్లడయ్యాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

 అంధులకు దారి చూపే సరికొత్త బూట్లు

5. Sonia Gandhi: ‘ఆ ఫలితాలు షాక్‌కు గురిచేశాయి.. మీ నిరాశ నాకు తెలుస్తోంది ’

ఇటీవల వెల్లడైన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు షాక్‌కు గురిచేశాయని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అన్నారు. ఏదిఏమైనప్పటికీ పార్టీలో అన్ని స్థాయుల్లో ఐక్యత అవసరమని నొక్కిచెప్పారు. అలాగే పార్టీని బలోపేతం చేసే దిశగా.. తనకు ఎన్నో సూచనలు అందాయని, వాటిపై పనిచేస్తున్నట్లు తెలిపారు. ‘ఇటీవల వెల్లడైన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మిమ్మల్ని ఎంత నిరాశకు గురిచేశాయో నాకు బాగా తెలుసు. ఆ ఫలితాలు షాక్‌ గురిచేశాయి. తీవ్రంగా బాధించాయి.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. అమెరికా హైపర్‌సోనిక్‌ క్షిపణి పరీక్ష విజయవంతం..!

అగ్రరాజ్యం అమెరికా కూడా హైపర్‌సోనిక్‌ రేసులో ముందడుగు వేసింది. ఓ పక్క ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేస్తోన్న వేళ అమెరికా గుట్టుగా హైపర్‌ సోనిక్‌ క్షిపణిని పరీక్షించింది. మార్చి మధ్యలో అధ్యక్షుడు జోబైడెన్‌ ఐరోపా పర్యటనకు ముందు ఇది జరిగిందని ఆ దేశ రక్షణశాఖ అధికారి ఒకరు వెల్లడించారు. హైపర్‌ సోనిక్‌ క్షిపణిలో కీలక భాగమైన ఎయిర్‌ బ్రీతింగ్‌ వెపన్‌ కాన్సెప్ట్‌ (హెచ్‌ఏడబ్ల్యూసీ)ను ఓ బీ-52 బాంబర్‌ పై దేశంలోని పశ్చిమ ప్రాంతంలో ప్రయోగించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ‘ట్విటర్‌లో ఆ ఫీచర్‌ కావాలా?’ ఎలాన్‌ మస్క్‌ ప్రశ్న.. సీఈఓ హెచ్చరిక

ప్రముఖ సోషల్‌మీడియా సంస్థ ట్విటర్‌లో 9.2శాతం వాటాను సొంతం చేసుకున్న టెస్లా అధిపతి ఎలాన్‌ మస్క్‌.. అప్పుడే సంస్థలో తన బాధ్యతల్లోకి దిగినట్లు కన్పిస్తోంది. ట్విటర్‌ యూజర్లు ఎంతోకాలంగా ఎదురుచూస్తోన్న ‘ఎడిట్‌’ ఫీచర్‌పై తాజాగా మస్క్‌ పెట్టిన పోస్ట్‌ వైరల్‌గా మారింది. అయితే ఈ ట్వీట్‌కు ట్విటర్‌ సీఈఓ పరాగ్‌ అగర్వాల్‌ స్పందిస్తూ యూజర్లను హెచ్చరించడం గమనార్హం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

 స్కూల్‌ ఇన్నోవేషన్ ఛాలెంజ్‌లో ఆకట్టుకున్న ఆవిష్కరణలు

8. ఐఐటీ కాన్పుర్‌కు రూ.100కోట్ల విరాళం.. ఎవరిచ్చారంటే..?

తాను చదువుకున్న విద్యాసంస్థపై ప్రేమతో ఏకంగా రూ.100కోట్ల విరాళమిచ్చారో పూర్వ విద్యార్థి. ఆయన మరెవరో కాదు ఇండిగో సహ వ్యవస్థాపకుడు రాకేశ్ గంగ్వాల్‌. ఐఐటీ కాన్పుర్‌లో మెడికల్‌ కాలేజీ ఏర్పాటుకు ముందుకొచ్చిన ఆయన.. తన వంతు సాయంగా ఈ వ్యక్తిగత విరాళాన్ని ప్రకటించడం విశేషం. ‘‘ఐఐటీ కాన్పుర్‌ ప్రాంగణంలో స్కూల్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఏర్పాటుకు మా పూర్వ విద్యార్థి, ఇండిగో సహ వ్యవస్థాపకులు రాకేశ్‌ గంగ్వాల్‌ మద్దతు ప్రకటించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. Ghani: వెండితెర బాక్సర్లు.. వీరు ‘పంచ్‌’ విసిరితే ‘కిక్‌’ ఎక్కాల్సిందే..!

 కథానాయకుడు ప్రతినాయకుడిపై పంచ్‌ డైలాగ్స్‌ వేస్తే ప్రేక్షకులకు ఎంతటి మజా వస్తుందో.. బాక్సింగ్‌ రింగ్‌లోకి దిగి ‘పంచ్‌’ విసిరితే అంతకుమించిన ‘కిక్‌’ వస్తుంది. ఇప్పటికే పలువురు హీరోలు  ఆ జోష్‌ను నింపగా ఇప్పుడు వరుణ్‌తేజ్‌ సిద్ధమయ్యాడు. ప్రొఫెషనల్‌ బాక్సర్‌గా ఆయన నటించిన ‘గని’ సినిమా ఏప్రిల్‌ 8న విడుదలకానుంది. ఈ సందర్భంగా తెరపైకొచ్చిన కొన్ని బాక్సింగ్‌ కథలను గుర్తుచేసుకుందాం.. బాక్సింగ్‌ సినిమా అంటే తెలుగు ప్రేక్షకులకు ఠక్కున గుర్తొచ్చేది ‘తమ్ముడు’. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. తొలి మ్యాచ్‌తో పోలిస్తే బాగా మెరుగయ్యాం: విలియమ్సన్

 టీ20 మెగా లీగ్‌లో హైదరాబాద్‌ టీమ్‌ రెండో మ్యాచ్‌లోనూ ఓటమిపాలై అభిమానులను మరోసారి నిరాశకు గురిచేసింది. సోమవారం రాత్రి లఖ్‌నవూతో తలపడిన పోరులో 12 పరుగుల స్వల్ప తేడాతో ఓటమిపాలైంది. అయితే, తొలి మ్యాచ్‌తో పోలిస్తే రెండో మ్యాచ్‌లో తమ ప్రదర్శన చాలా మెరుగైందని హైదరాబాద్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ అన్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని