Sonia Gandhi: ‘ఆ ఫలితాలు షాక్‌కు గురిచేశాయి.. మీ నిరాశ నాకు తెలుస్తోంది ’

ఇటీవల వెల్లడైన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు షాక్‌కు గురిచేశాయని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అన్నారు. ఏదిఏమైనప్పటికీ పార్టీలో అన్ని స్థాయుల్లో ఐక్యత అవసరమని నొక్కిచెప్పారు. 

Updated : 05 Apr 2022 15:48 IST

దేశం కోసం మనం పుంజుకోవాలి: సోనియా

దిల్లీ: ఇటీవల వెల్లడైన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు షాక్‌కు గురిచేశాయని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అన్నారు. ఏదిఏమైనప్పటికీ పార్టీలో అన్ని స్థాయుల్లో ఐక్యత అవసరమని నొక్కిచెప్పారు. అలాగే పార్టీని బలోపేతం చేసే దిశగా.. తనకు ఎన్నో సూచనలు అందాయని, వాటిపై పనిచేస్తున్నట్లు తెలిపారు.

‘ఇటీవల వెల్లడైన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మిమ్మల్ని ఎంత నిరాశకు గురిచేశాయో నాకు బాగా తెలుసు. ఆ ఫలితాలు షాక్‌ గురిచేశాయి. తీవ్రంగా బాధించాయి. మన నిబద్ధత, దృఢ సంకల్పానికి ఇది పరీక్షా సమయం. పార్టీలో అన్ని స్థాయుల్లో ఐక్యత అనేది అత్యంత ఆవశ్యకం. అందుకోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని నేను నిశ్చయించుకున్నాను. అలాగే ఫలితాల అనంతరం సీడబ్ల్యూసీ సమావేశం కూడా జరిగింది. ఇతర సహచరులనూ కలిశాను. మన పార్టీని బలోపేతం చేసేందుకు చాలా సూచనలు వచ్చాయి. ఇప్పుడు వాటిపై పనిచేస్తున్నాం’ అని పార్టీ ఎంపీలతో జరిగిన సమావేశంలో మాట్లాడారు. ‘ఇప్పుడు మనం ముందుకు వెళ్లాల్సిన దారి మునుపెన్నడూ లేనంత సవాలుతో కూడుకొని ఉంది.  పార్టీ తిరిగి పుంజుకోవడం మనకు మాత్రమే ముఖ్యం కాదు. ఇది మన ప్రజాస్వామ్యానికి, మన సమాజానికి ఎంతో అవసరం’ అంటూ ఆమె మాట్లాడారు. ఈ సమావేశంలో రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పాల్గొన్నారు.

ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. దాంతో ఇప్పుడు కాంగ్రెస్ దేశవ్యాప్తంగా రెండు రాష్ట్రాల్లో మాత్రమే పూర్తిస్థాయి అధికారంలో కొనసాగుతోంది. కాగా ఫలితాల అనంతరం నిర్వహించిన సీడబ్ల్యూసీ సమావేశంలో సోనియా పార్టీ పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే అందుకు సభ్యులు అంగీకరించలేదు. కానీ జీ-23 పేరిట అసమ్మతి నేతలు ఎప్పటికప్పుడు హస్తం పార్టీ లోపాలను బహిరంగంగా ఎత్తిచూపుతున్నారు. పార్టీ నాయకత్వం, సంస్థాగత నిర్మాణంలో మార్పులు అవసరమని గళమెత్తుతున్నారు. తాజాగా ఐక్యత అనే పదం సోనియా వారిని ఉద్దేశించే వాడారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని