Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in Eenadu.net: ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 18 Mar 2023 09:53 IST

1. తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు విస్తారంగా వర్షాలు.. వాతావరణ శాఖ సూచన

తెలుగు రాష్ట్రాల్లో శని, ఆదివారాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏపీలో పలుచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు విస్తారంగా కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఉత్తర తమిళనాడు నుంచి కర్ణాటక మీదుగా కొంకన్‌ తీరం వరకు సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోందని వాతావరణ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. వైకాపాకు ఎదురుగాలి
పట్టభద్రుల విషయంలో అధికార పార్టీ అంచనాలు పట్టాలు తప్పాయన్న భావన రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది. విశాఖే రాజధాని అని ఉత్తరాంధ్రలో వ్యూహాలు పన్నినా ప్రయోజనం కలగలేదు. పార్టీకి కంచుకోట లాంటి రాయలసీమలోనూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీకి ఎదురుగాలి తప్పలేదు. సాధారణ ఎన్నికలకు ముందు జరిగిన దాదాపు చివరి ఎన్నికలివి. పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో గెలవడం ద్వారా ఈ రెండు వర్గాల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత లేదనే సందేశాన్ని గట్టిగా ఇవ్వాలని వైకాపా పన్నిన వ్యూహం బెడిసికొట్టింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. ఉత్కంఠ.. పశ్చిమ రాయలసీమలో నువ్వా.. నేనా?

ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలిలో మూడు పట్టభద్రుల స్థానాలకు జరిగిన ఎన్నికల్లో(MLC elections) రెండు చోట్ల తెదేపా జయకేతనం ఎగురవేయగా.. పశ్చిమ రాయలసీమలో మాత్రం వైకాపా(YSRCP), తెదేపా(TDP) పార్టీల అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. ఇక్కడ ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా సాగుతోంది. ప్రతి రౌండ్‌లోనూ తెదేపా, వైకాపా బలపరిచిన అభ్యర్థుల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోటీ నడుస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. అర్ధరాత్రి హైదరాబాద్‌కు రామ్‌చరణ్‌.. అభిమానుల భారీ ర్యాలీ

మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ హైదరాబాద్‌కు చేరుకున్నారు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటిగంట సమయంలో బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరకున్న ఆయనకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ‘జై చరణ్‌’, ‘జై ఆర్‌ఆర్‌ఆర్‌’ అనే నినాదాలతో ఎయిర్‌పోర్ట్‌ ప్రాంగణం మార్మోగింది. పోలీసుల భారీ బందోబస్తు మధ్య ఆయన ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయటకు వచ్చారు. అభిమానులకు అభివాదం చేసి.. తనపై ఇంతటి ప్రేమను చూపిస్తోన్న వారికి ధన్యవాదాలు చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. అగ్నికీలల మాటున ‘క్యూనెట్‌’ పాపం

సికింద్రాబాద్‌ స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌ అగ్నికీలల మాటున మల్టీలెవల్‌ మార్కెటింగ్‌(ఎంఎల్‌ఎం) మాయాజాలం బహిర్గతమైంది. భారీ మొత్తాలను ఆశ చూపి అమాయకులకు వల వేస్తున్న ‘క్యూనెట్‌’ సంస్థ బాగోతం వెలుగులోకి వచ్చింది. గురువారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదానికి ఆహుతైన ఆరుగురు ఈ సంస్థలోనే పనిచేస్తున్నట్లు తేలింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. పట్టభద్రుల స్థానాల్లో రెండు తెదేపాకే

శాసనమండలిలో మూడు పట్టభద్రుల స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెదేపా స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది. ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానంలో తెదేపా అభ్యర్థి వేపాడ చిరంజీవిరావు భారీ విజయం సాధించారు. తూర్పు రాయలసీమ శాసనమండలి పట్టభద్రుల ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్‌ గెలిచారు. పశ్చిమ రాయలసీమలో మాత్రం ఇరు పార్టీల అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. అక్టోబరు నుంచి ప్రశ్నపత్రాల చౌర్యం

ప్రశ్నపత్రాల లీకేజీకి సంబంధించి సిట్‌ జరుపుతున్న దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో అంతా తామై వ్యవహరించిన సిస్టమ్‌ ఎనలిస్ట్‌ రాజశేఖర్‌, కార్యదర్శి పీఏ ప్రవీణ్‌ల ద్వయం అక్టోబరు నుంచే ఈ దందా మొదలుపెట్టినట్లు వెల్లడైంది. ఇందుకోసం మొత్తం కంప్యూటర్‌ వ్యవస్థను తమ అధీనంలోకి తెచ్చుకొని అప్పటి నుంచే కాన్ఫిడెన్షియల్‌ సిస్టమ్‌లో యాక్సెస్‌ అయినట్లు తెలుస్తోంది. ఆరు నెలలుగా ఈ వ్యవహారం నడుస్తున్నా.. ఎవరూ పసిగట్టలేకపోవడం గమనార్హం. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. శుద్ధంకాని నీటితో.. ప్రోస్టేట్‌ క్యాన్సర్‌!

జలం జీవనాధారం! తాగేది శుద్ధ జలం కాకపోతే.. అది ప్రాణాలను హరించే గరళం కావొచ్చు. నీటి ద్వారా ఒంట్లోకి చేరే నైట్రేట్‌, ట్రైహాలోమీథేన్‌ (టీహెచ్‌ఎం)లతో ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ ముప్పు పెరుగుతుందని శాస్త్రవేత్తలు తాజాగా తేల్చారు. వేగంగా వ్యాపించే కణుతులకు ఈ రసాయనాలకు  ఎక్కువ సంబంధం ఉందని గుర్తించారు. నైట్రేట్‌తో కలిగే హానిని మంచి ఆహారంతో తగ్గించుకోవచ్చని వెల్లడైనట్లు వారు తెలిపారు. స్పెయిన్‌లోని బార్సిలోనా ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ గ్లోబల్‌ హెల్త్‌ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. వుహాన్‌ కుక్కల నుంచి పాకిన కరోనా?

చైనాలోని వుహాన్‌ చేపల మార్కెట్‌లో విక్రయించిన రాకూన్‌ జాతి కుక్కల జన్యుపదార్థంలో కొవిడ్‌ కారక సార్స్‌కోవ్‌-2 వైరస్‌ ఆనవాళ్లు కనిపించాయని అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం తెలిపింది. దీన్నిబట్టి కొవిడ్‌ కారక కరోనా వైరస్‌ ప్రయోగశాలలో కృత్రిమంగా సృష్టించినది కాదనీ, అది ప్రకృతిలో సహజంగానే ఉత్పన్నమై ఉండవచ్చని వారు భావిస్తున్నట్లు ‘న్యూయార్క్‌ టైమ్స్‌’ దినపత్రిక తెలిపింది. వైరస్‌ ప్రయోగశాల నుంచి లీకై ఉండవచ్చని అమెరికా ఇంధనశాఖ అంచనా వేసిన కొన్ని వారాలకే దానికి విరుద్ధమైన అంచనాను అంతర్జాతీయ శాస్త్రవేత్తలు వెలువరించడం విశేషం. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. కౌన్సెలింగ్‌ పేరిట లాకప్‌లో విద్యార్థులు!

విద్యార్థులు ఏదైనా తప్పు చేస్తే ఉపాధ్యాయులు వారికి అర్థమయ్యేలా చెప్పాలి. అవసరమైతే తల్లిదండ్రులను పిలిచి వారి సమక్షంలో హెచ్చరించాలి. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం జడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ఇవేవీ పట్టించుకోకుండా.. పిల్లలను ఏకంగా పోలీసు స్టేషన్‌లో పెట్టించారు. అక్కడ పోలీసులూ అత్యుత్సాహం చూపి విద్యార్థులను ఇబ్బందులకు గురిచేశారు. శుక్రవారం ఈ ఘటన వెలుగు చూసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని