శుద్ధంకాని నీటితో.. ప్రోస్టేట్‌ క్యాన్సర్‌!

జలం జీవనాధారం! తాగేది శుద్ధ జలం కాకపోతే.. అది ప్రాణాలను హరించే గరళం కావొచ్చు. నీటి ద్వారా ఒంట్లోకి చేరే నైట్రేట్‌, ట్రైహాలోమీథేన్‌ (టీహెచ్‌ఎం)లతో ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ ముప్పు పెరుగుతుందని శాస్త్రవేత్తలు తాజాగా తేల్చారు.

Published : 18 Mar 2023 05:48 IST

లం జీవనాధారం! తాగేది శుద్ధ జలం కాకపోతే.. అది ప్రాణాలను హరించే గరళం కావొచ్చు. నీటి ద్వారా ఒంట్లోకి చేరే నైట్రేట్‌, ట్రైహాలోమీథేన్‌ (టీహెచ్‌ఎం)లతో ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ ముప్పు పెరుగుతుందని శాస్త్రవేత్తలు తాజాగా తేల్చారు. వేగంగా వ్యాపించే కణుతులకు ఈ రసాయనాలకు  ఎక్కువ సంబంధం ఉందని గుర్తించారు. నైట్రేట్‌తో కలిగే హానిని మంచి ఆహారంతో తగ్గించుకోవచ్చని వెల్లడైనట్లు వారు తెలిపారు. స్పెయిన్‌లోని బార్సిలోనా ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ గ్లోబల్‌ హెల్త్‌ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు.

ఏమిటీ పదార్థాలు?

తాగునీటిలో సాధారణంగా కనిపించే కాలుష్యకారకాల్లో నైట్రేట్‌, టీహెచ్‌ఎంలు ఉంటాయి. పొలాల్లో వాడే ఎరువులు, పశుపెంపకం కేంద్రాల నుంచి వచ్చే వ్యర్థాల్లో నైట్రేట్‌ అధిక మోతాదులో ఉంటుంది. అది భూగర్భజలాల్లోకి, వర్షాల ద్వారా నదుల్లోకి చేరుతుంది. నిజానికి ఈ పదార్థం ప్రకృతిలో భాగం. మానవ చర్యల ఫలితంగా దీని సహజ చక్రం మారిపోతోంది.

టీహెచ్‌ఎంలు.. క్లోరిన్‌ తదితరాలతో నీటిని క్రిమిరహితం (డిస్‌ఇన్‌ఫెక్షన్‌) చేసే ప్రక్రియలో  వెలువడుతుంటాయి. నైట్రేట్‌.. నోటి ద్వారానే  శరీరంలోకి ప్రవేశిస్తుంది. దానికి భిన్నంగా శ్వాస, చర్మం ద్వారా కూడా టీహెచ్‌ఎంలు ఒంట్లోకి చేరతాయి. కలుషిత నీటిలో ఈత కొట్టడం, వంటపాత్రలు కడగడం తదితరాల ద్వారా అవి శరీరంలోకి ప్రవేశిస్తాయి. టీహెచ్‌ఎంలకు దీర్ఘకాలం గురికావడం వల్ల మూత్రాశయ క్యాన్సర్‌ తలెత్తే ప్రమాదం ఉందని ఇప్పటికే వెల్లడైంది. అయితే వీటికి ఇతర రకాల క్యాన్సర్లతో ఏదైనా సంబంధం ఉందా అన్నది ఇప్పటివరకూ స్పష్టత లేదు.

ఇదీ పరిశోధన..!

దీర్ఘకాలం పాటు నీటి ద్వారా శరీరంలోకి చేరే నైట్రేట్‌, టీహెచ్‌ఎంల వల్ల ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ ముప్పు పెరుగుతుందా అన్నది శాస్త్రవేత్తలు పరిశీలించారు. ఇందుకోసం 2008 నుంచి 2013 మధ్య స్పెయిన్‌లోని ఆసుపత్రుల్లో చికిత్స పొందిన 697 మంది ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ బాధితులను పరిశీలించారు. ఇందులో వేగంగా వ్యాపించే కణితులు 97 మందిలో ఉన్నాయి.

8 ఏళ్ల వయసు వచ్చినప్పటి నుంచి పరీక్షార్థులు ఎంత పరిమాణంలో నైట్రేట్‌, టీహెచ్‌ఎంలకు గురయ్యారన్నది పరిశీలించారు. వారు ఏ ప్రాంతంలో నివసించారు? ఎలాంటి నీరు తాగారు? జీవితకాలంలో ఎంత పరిమాణంలో నీరు తాగారు? అక్కడి భూగర్భజలాల్లోని రసాయనాల తీరు వంటి వివరాలను విశ్లేషించారు.

ఏం తేలింది?

నైట్రేట్‌ పరిమాణం ఎంత పెరిగితే.. ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ ముప్పు అంత పెరుగుతుంది.

రోజుకు సరాసరిన 6 మిల్లీగ్రాముల కన్నా తక్కువగా నైట్రేట్‌ తీసుకునేవారితో పోలిస్తే 14 మిల్లీగ్రాముల కన్నా అధికంగా పొందేవారికి లో గ్రేడ్‌ లేదా మీడియం గ్రేడ్‌ ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం 1.6 రెట్లు ఎక్కువ. వీరికి దూకుడుగా వ్యాపించే ప్రోస్టేట్‌ కణితి వచ్చే ముప్పు     3 రెట్లు ఎక్కువ.  

తాగునీటి ద్వారా చేరే టీహెచ్‌ఎంల వల్ల ప్రోస్టేట్‌  క్యాన్సర్‌ ముప్పు పెరగక పోయినప్పటికీ.. కుళాయి నీటిలో వీటి తీవ్రత ఎక్కువగా ఉంటే ఈ కణితులకు ఆస్కారం పెరుగుతున్నట్లు వెల్లడైంది. దీన్నిబట్టి శ్వాస, చర్మం ద్వారా ఒంట్లోకి చేరే టీహెచ్‌ఎంలు ముప్పును పెంచుతున్నట్లు తేలింది.

ఆహారంతో అడ్డుకట్ట

పరీక్షార్థుల ఆహారపుటలవాట్లను విశ్లేషించినప్పుడు కీలక విషయాలు బయటపడ్డాయి.

నీటి ద్వారా నైట్రేట్‌ను ఎక్కువగా తీసుకునేవారి ఆహారంలో ఫైబర్‌, పండ్లు, కూరగాయలు, విటమిన్‌-సి పరిమాణం తక్కువగా ఉంటే.. వారికి ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ ముప్పు బాగా పెరుగుతుంది.  

క్యాన్సర్‌ కారక నైట్రోసెమీన్లు ఏర్పడకుండా పండ్లు, కూరగాయల్లోని యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, పాలీఫినాల్స్‌ అడ్డుకుంటుండొచ్చని పరిశోధకులు విశ్లేషిస్తున్నారు. కణితులకు గణనీయంగా కళ్లెం వేసే సామర్థ్యం విటమిన్‌-సికి ఉంది. పీచు పదార్థంతో పేగుల్లోని ప్రయోజనకర బ్యాక్టీరియాకు మేలు జరుగుతుంది. ఆ జీవులు.. నైట్రోసెమీన్లు సహా ఆహారం ద్వారా వచ్చే హానికర పదార్థాల నుంచి రక్షణ కల్పిస్తాయి.

ఈనాడు ప్రత్యేక విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని