Andhra news: కౌన్సెలింగ్‌ పేరిట లాకప్‌లో విద్యార్థులు!

విద్యార్థులు ఏదైనా తప్పు చేస్తే ఉపాధ్యాయులు వారికి అర్థమయ్యేలా చెప్పాలి. అవసరమైతే తల్లిదండ్రులను పిలిచి వారి సమక్షంలో హెచ్చరించాలి.

Updated : 18 Mar 2023 12:09 IST

తరగతి గదిలో ఫ్యాన్‌ రెక్కలు వంచారని ఉపాధ్యాయుల నిర్వాకం
అత్యుత్సాహం చూపిన పోలీసులు
ఏలూరు జిల్లాలో ఘటన

జంగారెడ్డిగూడెం, జంగారెడ్డిగూడెం పట్టణం, న్యూస్‌టుడే: విద్యార్థులు ఏదైనా తప్పు చేస్తే ఉపాధ్యాయులు వారికి అర్థమయ్యేలా చెప్పాలి. అవసరమైతే తల్లిదండ్రులను పిలిచి వారి సమక్షంలో హెచ్చరించాలి. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం జడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ఇవేవీ పట్టించుకోకుండా.. పిల్లలను ఏకంగా పోలీసు స్టేషన్‌లో పెట్టించారు. అక్కడ పోలీసులూ అత్యుత్సాహం చూపి విద్యార్థులను ఇబ్బందులకు గురిచేశారు. శుక్రవారం ఈ ఘటన వెలుగు చూసింది. బాధితుల వివరాల మేరకు... తొమ్మిదో తరగతికి చెందిన ముగ్గురు విద్యార్థులు గురువారం తరగతి గదిలోని ఫ్యాను రెక్కలు, ట్యూబ్‌లైట్లు పాడుచేశారని ఉపాధ్యాయులు విజయ్‌ ప్రకాశ్‌, సుధాకరరెడ్డి వారిని కొట్టారు. కౌన్సెలింగ్‌ ఇప్పించాలని పోలీసు స్టేషన్‌లో అప్పగించారు. అక్కడ పోలీసులు విద్యార్థులను భయపెట్టేందుకు ఇతర నిందితులతో కలిపి కొన్ని గంటలపాటు లాకప్‌లో ఉంచారు. ఈ సమయంలో ఓ కానిస్టేబుల్‌ వారిని కొట్టారు. స్టేషన్‌ ఆవరణలో కూర్చోమనడంతో సాయంత్రం వరకు అక్కడే ఉన్నా భోజనం ఇవ్వలేదు. తల్లిదండ్రులకూ చెప్పలేదు. బాధిత విద్యార్థుల్లో ఒకరి సోదరుడు తల్లిదండ్రులకు చెప్పడంతో వెంటనే వెళ్లగా.. స్టేషన్‌ మెట్లపై పిల్లలు ఏడుస్తూ కనిపించారు. పోలీసులు కొట్టారని ఓ విద్యార్థి దెబ్బలూ చూపారు. ఎస్‌ఐ వద్దకు వెళ్తే ‘సంతకాలు పెట్టి తీసుకెళ్లి, మళ్లీ రేపు రావాలి’ అంటూ ఆదేశించారు. శుక్రవారం ఉదయం పిల్లలను స్టేషన్‌కు తీసుకెళ్లగా.. ఉపాధ్యాయుల ఫిర్యాదుతోనే స్టేషన్‌లో పెట్టామని పోలీసులు వెల్లడించారు. లాకప్‌లో వేయాల్సినంత నేరం పిల్లలేం చేశారని.. తల్లిదండ్రులు ప్రధానోపాధ్యాయుడు జగ్గారావు, ఎంఈవో రాముడు, ఉపాధ్యాయులను నిలదీశారు. ఓ పిల్లాడి దెబ్బలకు ఆసుపత్రిలో వైద్యం చేయించాల్సి వచ్చిందన్నారు. స్టేషన్‌కు తీసుకెళ్లడం తప్పేనని ఉపాధ్యాయులు రాత పూర్వకంగా ఒప్పుకొన్నట్లు బాధిత విద్యార్థుల బంధువొకరు పేర్కొన్నారు.

బాత్‌రూమ్‌ కడగమన్నారు...

ఘటనపై కలెక్టర్‌ ఆదేశాల మేరకు జంగారెడ్డిగూడెం తహసీల్దారు స్లీవ జోజి శుక్రవారం బాధిత విద్యార్థులను విచారించారు. ‘ఉపాధ్యాయులు మమ్మల్ని కొట్టి స్టేషన్‌కు తీసుకెళ్లారు. లాకప్‌లో వేసి కొట్టారు. బాత్‌రూమ్‌ కడగాలన్నారు. నీళ్లు రాకపోవడంతో కడిగించలేదు’ అని విద్యార్థులు తెలిపారు. పాడైపోయిన ఫ్యాన్‌ రెక్కలను  సరిచేశామని వివరించారు. ‘దీనిపై నాకు ఎటువంటి సమాచారం లేదు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విచారణ చేశా. కౌన్సెలింగ్‌ పాఠశాలలోనే చేస్తే బాగుండేది’ అని ఎంఈవో రాముడు తెలిపారు.

డీఎస్పీ సమక్షంలో మాట మార్చిన విద్యార్థులు..

ఈ ఘటనపై శుక్రవారం రాత్రి డీఎస్పీ కేవీ సత్యనారాయణ విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కలిసి విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. విద్యార్థులను లాకప్‌లో పెట్టి, పోలీసులు కొట్టారనడం అవాస్తవం అన్నారు. ‘ఉపాధ్యాయులు కౌన్సెలింగ్‌ నిమిత్తం వారిని స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఆ సమయంలో ఎస్‌ఐ, సీఐ అందుబాటులో లేరు. కొద్దిసేపు స్టేషన్‌ ఆవరణలో విద్యార్థులు ఉన్నారు. ఆ తర్వాత తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపాం’ అని వివరించారు. ఇదే సమావేశంలో విద్యార్థులతో మాట్లాడించారు. ‘తమను పోలీసులు కొట్టలేదు. ఉపాధ్యాయులు తమపై పోలీసులకు ఫిర్యాదు చేస్తారనే భయంతో అలా చెప్పాం’ అని మాట మార్చారు. మరి దెబ్బలు ఎలా తగిలాయని విలేకర్లు అడగ్గా.. విద్యార్థుల నుంచి సమాధానం రాలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని