Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Published : 13 Jul 2022 21:02 IST

1. గోదావరికి భారీ వరద.. ముంపు ప్రాంతాలపై సీఎం కేసీఆర్‌ ఆరా

గత కొన్ని రోజులుగా ఎడతెరపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. పరిస్థితులు మెరుగయ్యేంత వరకు మంత్రులు, ఎమ్మెల్యేలు ఎట్టిపరిస్థితుల్లోనూ జిల్లాలు, నియోజకవర్గాలు విడిచి వెళ్లరాదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరోసారి ఆదేశాలు జారీ చేశారు. ఈమేరకు ఆయన బుధవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో వాగులు, వంకలు, జలాశయాలు, నదులు పొంగిపొర్లుతున్న పరిస్థితుల్లో తక్షణ రక్షణ చర్యలను కొనసాగిస్తూ.. వరదల వల్ల కలిగే ఆస్తి, ప్రాణ నష్టాలను తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించారు.

2. రైల్వే శాఖ అప్రమత్తం.. భారీ వర్షాల కారణంగా పలు రైళ్లు రద్దు

భారీ వర్షాల కారణంగా పలు రైళ్లు రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. రేపటి నుంచి ఈనెల 17వరకు సికింద్రాబాద్‌- ఉందానగర్‌-సికింద్రాబాద్‌ ప్యాసింజర్‌ రైలు, సికింద్రాబాద్‌-ఉందానగర్‌ మెము రైలు, మేడ్చల్‌-ఉందానగర్‌ మెము ప్రత్యేక రైలు, ఉందానగర్‌-సికింద్రాబాద్‌ మెము స్పెషల్‌ రైలు, సికింద్రాబాద్‌- ఉందానగర్‌ మెము స్పెషల్‌ రైలు, హెచ్‌.ఎస్‌ నాందేడ్‌- మేడ్చల్‌-హెచ్‌ఎస్‌ నాందేడ్‌, సికింద్రాబాద్‌- మేడ్చల్‌ మెము రైలు, మేడ్చల్‌-సికింద్రాబాద్‌ మెము రైలు, కాకినాడ పోర్టు-విశాఖపట్నం మెము రైలు, విజయవాడ- బిట్రగుంట మెము రైలును రద్దు చేసినట్టు దక్షిణ మద్య రైల్వే పేర్కొంది.


Video: భారీగా వరద నీరు.. పరవళ్లు తొక్కుతున్న గోదావరి


3. కొండల్ని మింగేస్తున్న జగన్‌ గ్యాంగ్‌.. తెదేపా ఫొటో ప్రదర్శన

సీఎం జగన్ మోహన్‌రెడ్డి గ్యాంగ్ కొండల్ని చెరువులుగా మార్చేసిందని తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. కొండల్ని ఏ విధంగా పెంచుతారంటూ న్యాయస్థానం సైతం ప్రశ్నించిందని గుర్తు చేశారు. దోచుకుంటూ.. పర్యావరణ విధ్వంసం చేయమని ప్రజలు జగన్‌కి అధికారం ఇవ్వలేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 75 అడవుల్ని నాశనం చేశారని ఆరోపించారు. పర్యావరణాన్ని కాపాడకుండా అడవుల్ని నాశనం చేస్తే భవిష్యత్తు తరాలకు తీవ్ర ముప్పేనని హెచ్చరించారు.

4. వివాహితపై ఇన్‌స్పెక్టర్‌ అత్యాచారం.. రిమాండ్‌ రిపోర్టులో విస్తుపోయే వాస్తవాలు

టాస్క్‌ఫోర్స్‌ విభాగంలో ఇన్‌స్పెక్టర్‌ నాగేశ్వరరావుకు కీలకమైన కేసులను ఛేదించగలిగే అధికారిగా పేరుంది.. ఉత్తరమండలం టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌గా ఏడేళ్లు పనిచేసిన ఆయన ఎన్నో కీలకమైన కేసులు పరిష్కరించారు. ఉగ్రవాదుల నెట్‌వర్క్‌ను గుర్తించారు.. మాదకద్రవ్యాల స్మగ్లర్లనూ పట్టుకున్నారు. పరారీలో ఉన్న ఎంతోమంది కరడుగట్టిన నేరగాళ్లను పట్టుకొచ్చిన నాగేశ్వరరావు ఇప్పుడు అత్యాచారం కేసులో కటకటాల పాలయ్యారు. వివాహిత కణతపై తుపాకి గురిపెట్టి అత్యాచారం చేసిన మాజీ ఇన్‌స్పెక్టర్‌ కె.నాగేశ్వరావు కేసులో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూశాయి.

5. ఏపీలో మరో 3 రోజులు వానగండం: అమరావతి వాతావరణ కేంద్రం

మరో 3 రోజులు రాష్ట్రంలోని అనేక చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈరోజు రాష్ట్రంలోని రెండు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. మరో రెండు, మూడు చోట్ల ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలతో పాటు కొన్ని చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడొచ్చని అంచనా వేసింది.


Video: వికారాబాద్ ఎమ్మెల్యేపై జడ్పీ ఛైర్ పర్సన్ సునీతా మహేందర్ తీవ్ర ఆరోపణలు


6. ప్రశ్నార్థకంగా విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌ కొనసాగింపు: సీఎల్‌ఎస్‌ఏ నివేదిక

దేశీయ చమురు సంస్థలు పొందుతున్న అనూహ్య లాభాలను ఆదాయంగా మార్చుకునేందుకు రెండు వారాల క్రితం కేంద్ర ప్రభుత్వం విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌ (Windfall tax) విధించింది. సరిగ్గా అప్పటి నుంచి అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. దీంతో కంపెనీల అదనపు లాభాలు పూర్తిగా తగ్గాయని తాజాగా ఓ నివేదిక వెల్లడించింది.

7. ప్రధాని కార్యాలయంలోకి నిరసనకారులు.. ‘బాహుబలి’ని తలపించిన దృశ్యాలు..!

సంక్షోభ పరిస్థితులతో విసుగెత్తిన శ్రీలంక ప్రజలు.. సరికొత్త నాయకత్వాన్ని కోరుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే అధ్యక్షుడు గొటబాయ రాజపక్సను గద్దె దింపేందుకు గట్టిగా పోరాడిన వారంతా.. తాత్కాలిక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గొటబాయ దేశం దాటిన వార్తలతో ఈ రోజు ఉదయం పెల్లుబికిన ప్రజాగ్రహం.. ప్రధాని కార్యాలయం వైపు దూసుకెళ్లింది.

8. ఔషధాల కొరతతో అల్లాడుతోన్న శ్రీలంక.. అనారోగ్యం బారిన పడొద్దని వైద్యుల హెచ్చరిక

ఆర్థిక, ఆహార, ఇంధన సంక్షోభాల్లో మునిగిపోయిన శ్రీలంకలో పరిస్థితులు రోజురోజుకు క్షీణిస్తున్నాయి. ఇదే సమయంలో దేశంలో ఆరోగ్య వ్యవస్థ కూడా అత్యంత దయనీయ స్థితికి చేరుకుంటున్నట్లు అక్కడి వైద్యులు వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా అత్యవసర సేవలకు సంబంధించిన ఔషధాల కొరత తీవ్రంగా వేధిస్తోందని వాపోతున్నారు.


Pakistan: దివాలా దిశగా పాకిస్థాన్‌


9. ‘₹950 కోట్ల గ్యారెంటీతో బ్యాంకు ఖాతాలు వినియోగించుకోండి’

ఈడీ జప్తు చేసిన బ్యాంకు ఖాతాలను వినియోగించుకునేందుకు చైనా స్మార్ట్‌ఫోన్‌ సంస్థ వివోకు దిల్లీ హైకోర్టు అనుమతించింది. అయితే, వారంలోగా రూ.950 కోట్ల బ్యాంకు గ్యారెంటు ఇవ్వాలని షరతు విధించింది. అలాగే ఖాతాల ద్వారా జరిపే లావాదేవీల వివరాలను ఈడీకి సమర్పించాలని జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ ఆదేశించారు. జప్తు చేసిన సమయంలో ఖాతాల్లో ఉన్న రూ.251 కోట్ల సొమ్మును తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు వినియోగించొద్దని తెలిపారు.

10. 2022 మోస్ట్‌ పాపులర్‌ సినిమాలివే.. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రేటింగ్‌ ఎంతంటే?

ఎప్పటిలానే ఈ ఏడాదీ విభిన్న కథా చిత్రాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. కొన్ని అంచనాలకు మించి వసూళ్లు సాధిస్తే మరికొన్ని ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయాయి. ఈ ఏడాది ఇప్పటి వరకూ (2022 జనవరి- జూన్‌) వందల సంఖ్యలో సినిమాలు విడుదల కాగా వాటిల్లోంచి ‘మోస్ట్‌ పాపులర్‌ ఫిల్మ్స్‌’ పేరిట 10 సినిమాలను ప్రకటించింది ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్‌ పోర్టల్‌ ఐఎండీబీ. ఐఎండీబీ వినియోగదారులని ఆధారంగా చేసుకొని రూపొందించిన ఈ జాబితాలో కమల్‌ హాసన్‌ హీరోగా తెరకెక్కిన ‘విక్రమ్‌’ 8.8 రేటింగ్‌తో మొదటి స్థానాన్ని సొంతం చేసుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని